
ప్రభుత్వ వ్యతిరేకి అంతకంటే కాదు
బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా
దిల్లీ: భారత కంపెనీలు.. జాతి వ్యతిరేకం, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండవని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీని విమర్శించడానికి కార్పొరేట్ రంగం భయపడుతోందన్న పారిశ్రామికవేత్త రాహుల్బజాజ్కు తన మద్దతును ఆమె కొనసాగించారు. శనివారం బజాజ్ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ‘ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని అంతటా పాకించడం జాతి ప్రయోజనాలను దెబ్బతీసినట్లే’నని ట్వీట్ చేశారు. బజాజ్ ఆ వ్యాఖ్యలు చేసిన కార్యక్రమ వీడియోను షేర్ చేశారు కూడా. ‘రాహుల్ బజాజ్ లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఏ విషయానికీ భయపడాల్సిన అవసరం లేదు. మోదీని మీడియా విమర్శిస్తూనే ఉంది. ఒకవేళ మీరన్నట్లుగా అలాంటి వాతావరణమే ఉంటే దానిని మెరుగుపర్చడానికి మనం కృషి చేయాలి. అయినా సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను దెబ్బతీయడం తగద’ని పేర్కొన్నారు. దీనిపై మజుందార్ స్పందిస్తూ. ‘మేడం.. మేం జాతి వ్యతిరేకులం లేదా ప్రభుత్వ వ్యతిరేకులం కాదు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో విజయం సాధించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిల్లో మెరుగైన విధానాలను ప్రోత్సహించాలని రాజకీయాలతో సంబంధం లేని నేను కోరుకుంటున్నా’నని సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.