
తాజా వార్తలు
‘ఆకాశమే నీ హద్దురా’.. సమంత రివ్యూ
హైదరాబాద్: కథానాయిక సమంత ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు ఫిదా అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించారు. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకం ఆధారంగా తీసిన ఈ చిత్రం నవంబరు 12న ఓటీటీ వేదికగా విడుదలైంది. ఇన్నాళ్లూ విహారయాత్రలో ఉన్న సమంత తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. దీనికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వొచ్చంటూ యూనిట్ సభ్యుల్ని మెచ్చుకున్నారు.
‘‘ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ‘ఆకాశమే నీ హద్దురా’. ఇది ఓ ఆణిముత్యం. సూర్య సర్, అపర్ణ బాలమురళి నటన అద్భుతంగా ఉంది. సుధా కొంగర డైరెక్షన్ అమేజింగ్. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని సామ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వారం రోజుల క్రితం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. సోమవారం తిరిగి హైదరాబాద్ వచ్చారు. ‘జాను’ తర్వాత ఆమె తొలిసారి ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ కోసం పనిచేశారు. ఓటీటీ వేదికగా ఇది త్వరలో విడుదల కాబోతోంది.