
తాజా వార్తలు
ఎవరీ డీసీపీ వర్తిక చతుర్వేది?
బాలీవుడ్‌కు పరిచయం చేసిన రామ్‌గోపాల్ వర్మ
ఇంటర్నెట్ డెస్క్: డీసీపీ వర్తిక చతుర్వేది.. తాజాగా ఎమ్మీ పురస్కారం గెలుచుకున్న వెబ్ సిరీస్ ‘దిల్లీ క్రైమ్’లోని ఓ పాత్ర పేరిది. ఆ పాత్ర పోషించిన షెఫాలి షా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈమెను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. బాలీవుడ్లో సుపరిచితురాలు. విచిత్రం ఏంటంటే.. ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేసింది దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిందీ పవర్ఫుల్ లేడీ. 21 సంవత్సరాల వయస్సులో ఏ నటి అయినా సరే తల్లి పాత్ర చేసేందుకు సాహసం చేస్తారా..? కానీ.. షెఫాలీ చేసింది. తర్వాత తన కెరీర్ గురించి భయపడలేదు. ఇది చాలు కదా ఆమె తెగువ ఎలాంటిదో చెప్పడానికి..!
ముంబయికి చెందిన షెఫాలీ సినిమా రంగంలోకి రాకముందు గుజరాతి స్టేజ్ డ్రామాలో ఓ పాత్ర పోషించింది. కొంతకాలానికి ఆ నాటకాన్ని అందరూ మర్చిపోయారు. కానీ.. షెఫాలి నటన మాత్రం అందరి మనసుల్లోనూ ముద్రవేసింది. అక్కడి నుంచి ఆమె సినిమా రంగం వైపు అడుగులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె దూరదర్శన్‌లో వచ్చే ‘ఆరోహణ్’ అనే ధారావాహికలో బుల్లితెరపై తొలిసారి కనిపించింది. 1995లో ‘రంగీలా’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. నటన అంటే ప్రాణమిచ్చే షెఫాలి.. కథ నచ్చితే చాలు సినిమా, షార్ట్‌ఫిల్మ్, వెబ్ సిరీస్ అనే తేడా చూడదు. అందుకే అన్ని సినిమాల అనుభవాన్ని పక్కకునెట్టి మళ్లీ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకొంది.
అవార్డులు కొత్తేమీ కాదు...
పాతికేళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది షెఫాలీ. 1995లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రంగీలా’లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. అక్కడి నుంచి ఆమె బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
⇒ 1998లో వర్మ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘సత్య’లో నటించింది. అందులో ఆమె నటనకు ఏకంగా రెండు అవార్డులు వచ్చాయి. ఆమె తన రెండో సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో స్టార్ స్క్రీన్ అవార్డు వచ్చిందామెకు.
⇒ 1999 నుంచి 2006 వరకు వరుసగా ఆరుసార్లు పలు అవార్డులకు నామినేట్ అయింది.
⇒ 2007లో ‘ది లాస్ట్ లీర్’లో వందనగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటి విభాగంలో నేషనల్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారం వరించింది.
⇒ 2007లో ‘గాంధీ, మై ఫాదర్’లో ఆమె తన అభినయంతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. ఈసారి ఉత్తమ నటి ‘టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు’ దక్కింది.
⇒ 2015లో ‘దిల్ ధడక్నే దో’ చిత్రం ఆమెకు మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.
⇒ 2017లో ‘జ్యూస్’ సినిమాలో నటించింది. ఉత్తమ నటి విభాగంలో జియో ఫిల్మ్‌ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
⇒ 2018లో ‘వన్స్ అగైన్’లో కనిపించి ఎడిటర్స్ ఛాయిస్-ఉత్తమ నటి విభాగంలో మరో అవార్డు సొంతం చేసుకుంది.
⇒ 2019లో ‘దిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్‌తో ఐరీల్ ఉత్తమ నటిగా నిలిచింది.
నవంబర్ 24 (సోమవారం)న 48వ ఎమ్మీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అందులో ఉత్తమ డ్రామాగా ‘దిల్లీ క్రైమ్’ ఎంపికైంది. వెబ్ సిరీస్ ఉత్తమ డ్రామా విభాగంలో అర్జెంటీనా, జర్మనీ, యూకేకు చెందిన వెబ్ సిరీస్‌లను వెనక్కి నెట్టి ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. రిషి మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షెఫాలి పవర్ఫుల్ డీసీపీగా కనిపించారు. ఒక పోలీస్‌గా నేరస్థులను పట్టుకోవాలనే కసి.. బాధితురాలికి న్యాయం చేయలనే తపనను ఆమె బాగా పండించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె డీసీపీ పాత్రలో జీవించారు. అయితే.. ‘దిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డు గెలుచుకోవడంపై షెఫాలి స్పందించారు. ‘ఓ మైగాడ్’ అంటూ పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తూ అవార్డు ప్రకటిస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది.
‘దిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డు సొంతం చేసుకోవడంతో.. ప్రముఖ కథానాయకుడు మహేశ్‌బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దిల్లీ క్రైమ్’ అద్భుతమైన సిరీస్ అని కొనియాడారు. ఎమ్మీ అవార్డును సొంతం చేసుకున్న ‘దిల్లీ క్రైమ్’ బృందానికి కంగ్రాట్స్. మీ కృషికి సరైన ఫలితం దక్కింది’ అని మహేశ్ ట్వీట్ చేశారు. ఆయనతోపాటు హృతిక్ రోషన్, తాప్సీ, సోనాలీ బింద్రే, విక్కీ కౌశల్, ఆదితిరావు హైదరీ, కరణ్ జోహార్ తదితరులు ‘దిల్లీ క్రైమ్’ టీమ్‌ను ప్రశంసిస్తూ ట్వీటారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- సాహో భారత్!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
