వైరల్‌ ఎంట్రీ కారకాల వల్లే తీవ్రత ఎక్కువ! - covid viral entry factors
close
Published : 20/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరల్‌ ఎంట్రీ కారకాల వల్లే తీవ్రత ఎక్కువ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదకరంగా భావిస్తున్న కరోనా వైరస్‌ ఒక్కోక్కరిలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించాక ఇతర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వయసుపైబడిన వారు, పురుషులు, ధుమపానం అలవాటు ఉన్నవారిలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, వీరిలోనే తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉందన్న విషయంపై కచ్చితమైన రుజువులు మాత్రం వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల వైరస్‌ కారకాల ప్రవర్తన వల్లే వీరిలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మానవ శరీరంలోని కణాలకు సార్స్‌కోవ్‌-2 వైరస్‌ వ్యాపించడానికి ‘యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2’ (ఏసీఈ2), ప్రోటీజ్ వంటి నిర్దిష్టమైన ప్రవేశకారకాలు కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు ఎంజైమ్‌ల ప్రవర్తనను బట్టి ఏ కణాలకు సార్స్‌కోవ్‌-2 సోకుతుందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు ఎంజైమ్‌ల వల్ల కరోనా వైరస్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా, మానవ శరీరంలోని ప్రతి కణం రకాన్ని మ్యాపింగ్‌ చేయాలని పరిశోధనా బృందంగా ఏర్పడ్డ ‘హ్యూమన్‌ సెల్‌ అట్లాస్‌ (హెచ్‌సీఏ)’ కన్సార్టియం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఏసీఈ2, ప్రోటీజ్‌ ఎంజైమ్‌ల ప్రవర్తనను వ్యక్తపరిచే కణ రకాలను గుర్తించేందుకు దాదాపు ఆరోగ్యవంతులైన వారి జన్యుక్రమ సమాచారాన్ని విశ్లేషించారు.

చివరకు ఊపిరితిత్తులు, శ్వాసమార్గాల్లో ఉండే కొన్ని రకాల కణాలతో పాటు కాలేయం, జీర్ణాశయ భాగాల ఉపరితలాల్లో వైరస్‌ ప్రవేశానికి కారణమైన జన్యుకారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరల్‌ ఎంట్రీ కారకాల్లో ఉండే జన్యువుల వ్యక్తీకరణ వృద్ధులు, పురుషుల్లో ఎక్కువగా ఉండడం వల్లే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ధుమపానం చేసే వారిలోనూ ఈ వైరల్ ఎంట్రీ కారకాలు అధికంగా స్పందించడం వల్ల కొవిడ్‌ తీవ్రత వీరిలోనే అధికంగా ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, వీటిని ధ్రువీకరించుకునేందుకు భారీ సంఖ్యలో సమాచారాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని