అందుకే నేను గ్యాప్‌ తీసుకున్నా!
close
Published : 07/01/2020 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే నేను గ్యాప్‌ తీసుకున్నా!

థ్యాంక్యూ నాన్న: భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్‌

హైదరాబాద్: ‘ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ, నాకు ఆర్మీ ఉంది. అభిమానులు, నా పిల్లల వల్లే ఇంత గ్యాప్‌ తీసుకున్నా అస్సలు బోరు కొట్టకుండా ఉన్నాను’ అన్నారు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర మ్యూజికల్‌ నైట్‌ జరిగింది. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘అందరూ గ్యాప్‌ వచ్చిందని అడుగుతున్నారు. ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య..’ ఈ మూడు సినిమాలు అయిన తర్వాత నాకు ఒక కోరిక కల్గింది. ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్‌ చేశా. చాలా కథలు విన్నా ఏవీ నచ్చలేదు. అలాంటి కథ సెట్‌ కావడానికి త్రివిక్రమ్‌గారి ప్రాజెక్టులు పూర్తవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే ఇంత గ్యాప్‌. రిలీజ్‌లో గ్యాప్‌ ఉంటుంది కానీ, సెలబ్రేషన్‌లో గ్యాప్‌ ఉండదు’’

‘‘ఈ ఖాళీ సమయంలో నేను నా భార్యతో కలిసి మ్యూజిక్‌ బ్యాండ్‌లకు వెళ్లడం వల్లే పాటలో అందరూ కనిపించాలని నేను అనుకున్నా. ‘సామజవరగమన’ ఇంత సెన్సేషన్‌ అవుతుందని నేను అనుకోలేదు. ‘ఎక్కడకి వెళ్లినా ఈ పాటే పాడుతున్నారు. విసుగు వచ్చేస్తోంది’ అని నా భార్య అన్నది. ప్రపంచం ముందు హీరో అవడం కన్నా, భార్య ముందు హీరో అయితే, ఆ ఆనందమే వేరు. ఈ సినిమాలో పాట రాసిన ప్రతి రచయిత, పాడిన గాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. తమన్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు. ఈ సినిమాలోని పాటలతో ఆయనకు ఒక గౌరవం వచ్చింది. పీఎస్‌ వినోద్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. మురళీ శర్మగారు, జయరామ్‌గారు చాలా చక్కగా నటించారు. సునీల్‌, సుశాంత్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణల పాత్రలు ప్రత్యేకంగా అలరిస్తాయి. ‘రాములో రాములా’ పాట చూసి మా అమ్మాయి దోశ స్టెప్‌ వేశానన్నది(నవ్వులు). దేన్నైనా సృష్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకు.. ఇంకొకటి వాళ్లకి(ఆడవాళ్లు) అన్నట్లు మనం మహిళలను గౌరవించాలి. పూజాహెగ్డే, నివేదా పేతురాజు చాలా చక్కగా నటించారు. టబుగారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్‌’’

‘‘నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమా కోసం మేము అడిగిన ప్రతిదాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆనందాన్ని ఇచ్చేది దర్శకుడే. మేమంతా పలు రకాల రంగులం.. మమ్మల్ని కలిపి ఒక అద్భుత చిత్రంగా తీసేది దర్శకుడు మాత్రమే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారు.. ఆయన ఇచ్చిన సినిమాలే. నా ప్రతి కోరికనూ, ఇష్టాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేసినా.. ఏనాడూ నా తండ్రికి ధన్యవాదాలు చెప్పలేదు. నేను తండ్రి అయ్యాక తెలిసింది నాన్న విలువ ఏంటో.. ఇప్పుడు చెబుతున్నా ‘థ్యాంక్యూ డాడీ’(భావోద్వేగంతో కన్నీళ్లు). నేను నా తండ్రి అంత గొప్పవాడిని ఎప్పటికీ కాలేను. ఆయనలో సగం అయితే చాలు. ‘ఆర్య’ సినిమా చేసినప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అప్పటికే నా దగ్గర రూ.కోటి ఉన్నాయి. నాకు పెళ్లయిన తర్వాత నా భార్యను ఒక్కటే అడిగా, ‘నేను మా నాన్న దగ్గరే ఉంటాను. నీకు పర్వాలేదు కదా’ అని అడిగా. నాన్నంటే అంత ప్రేమ నాకు. నేను చూసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆయనొకరు. ‘అబ్బో అల్లు అరవింద్‌ డబ్బులు కాజేస్తారు’ అని చాలా మంది అంటుంటారు. కానీ, ఆయన పది రూపాయల వస్తువును రూ.7కు బేరం చేస్తారు. ఆ తర్వాత అది రూ.6కు ఇచ్చినా, ఇంటికి వెళ్లి మరీ రూ.7 ఇచ్చి వస్తారు. అలాంటి మంచి వ్యక్తి ఆయన. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ, ఆయనకు పద్మశ్రీ రావాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలని విన్నవిస్తున్నాను.’’ 

‘‘సినిమా తీయడంలో ఇంత గ్యాప్‌ తీసుకున్నా, అభిమానులు, నా పిల్లల వల్లే నేను చాలా ఆనందంగా ఉన్నా. చాలా మంది అభిమానులు నా పేరును టాటూ వేసుకున్నారు. ఒక గొప్ప వ్యక్తి పేరును టాటూ వేసుకున్నానని మీరు గర్వపడేలా జీవితంలో ముందుకు సాగుతా. సంక్రాంతికి సందర్భంగా ‘దర్బార్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎంత మంచి వాడవురా’ సినిమాలు విడుదలవుతున్నాయి. వాళ్ల సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.


మనసు దురద పెట్టినప్పుడు గోక్కునే దువ్వెన సంగీతం: త్రివిక్రమ్‌

ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘30ఏళ్ల యువకుడు.. 60ఏళ్ల  పెద్దాయన.. కూనిరాగం తీసుకుంటూ రాసిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన’. తన వయసు నుంచి దిగి ఆయన(సీతారామశాస్త్రి), తన స్థాయి నుంచి ఎక్కి తమన్‌ ఇద్దరూ కలిసి ఈ చిత్రానికి ఒక స్థాయిని తీసుకొచ్చారు. ఇది వినాలనిపించే సాయంత్రం.. అనాలనిపించే సాయంత్రం కాదు.. ఒక ఒంటరి సాయంత్రం కారులో వెళ్తున్న కుర్రాడు తన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ వినడానికి, ఎక్కడో విదేశంలో ఉన్న ఒక అబ్బాయి, తన గర్ల్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుంటూ వినడానికి, ఒక ఆడ పిల్ల ఎక్కడో తన కోసం దొంగతనంగా సైట్‌ కొట్టుకుంటూ వెళ్లే అబ్బాయిని గుర్తు చేసుకుంటూ వినడానికి.. ఒక జ్ఞాపకాన్ని ఈ ఇద్దరూ కలిసి ఇచ్చారు. వీరందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. దానికి గొంతునిచ్చి సిధ్‌ శ్రీరామ్‌ మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు. ఒక పాట మనకు జ్ఞానం బోధిస్తుంది. అలాంటి అందమైన పాటల్ని గౌరవించాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే దీనికి మ్యూజికల్‌ నైట్‌ అని పెట్టాం. ఈ సంస్కారవంతమైన కోరికను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్‌.’’

‘‘జులాయి’ సమయానికి పెళ్లి కాని అల్లు అర్జున్‌గా తెలిసిన నాకు ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రిగా జీవితంలో, పనిలో మెచ్యురిటీ సాధించాడు. ఈ సినిమా ట్రైలర్‌ కోసం రాత్రి 2గంటల వరకూ అందరం కష్టపడ్డాం. ఈ సినిమాలో పాటలు పాడిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు. సంగీతం అంటే మనసుకు దురద పెట్టినప్పుడు గోక్కునే దువ్వెనలాంటిది. నేను ఒక్క పదం ఇచ్చినందుకే సీతారామశాస్త్రిగారు పొగిడారు. కానీ, ఆయన మన జీవితాల్లో ఎన్నో ఇచ్చారు. మీరు చెప్పిన మాట మాకు ఒక ఆశీర్వాదం. వేటూరి గారు, సీతారామశాస్త్రిగారు సినిమా పాటకు స్థాయిని తెచ్చిన వ్యక్తులు. అందుకు ఎన్నో పోరాటాలు, యుద్ధాలు చేశారు. మనిషిగా నన్ను కదిలించకపోతే ఎవరితోనూ కలిసి పనిచేయను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నా. ఈ సినిమాకు మొదలు చివర అన్నీ అల్లు అర్జునే. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు ‘ఆనందంగా ఉంది సర్‌.. తప్పకుండా చేద్దాం సర్‌’ అన్నారు. ఇప్పటికీ ఆ ఆనందం కొనసాగుతూనే ఉంది. లిరికల్‌ వీడియో కాకుండా, పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కనిపించాలన్న ఐడియా అల్లు అర్జున్‌దే. జనవరి 12న అందరం కలుద్దాం. ఆనందంగా పండగ చేసుకుందాం’’ అని తివిక్రమ్‌ అన్నారు. 

ఇవీ చదవండి...

‘అల వైకుంఠపురములో’ ర్యాప్‌తో అదరగొట్టారు!
‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ వచ్చేసింది!
త్రివిక్రమ్‌ నుంచి చాలా నేర్చుకున్నా: సుశాంత్‌
పండక్కి మేమే మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది
‘సామజవరగమన’ రాసేటప్పుడు బన్నిని అయిపోయా!మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని