అందుకే తారక్‌ను తమ్ముడూ అని పిలవను!
close
Published : 16/01/2020 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే తారక్‌ను తమ్ముడూ అని పిలవను!

‘నీకెందుకు సినిమాలు అవసరమా’ అన్నారు!

నందమూరి నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైనా వైవిధ్యమైన కథలు, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కల్యాణ్‌రామ్‌. అంతేకాదు, నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. తాజాగా ఆయన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. మెహరీన్‌ కథానాయిక. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి తన కొత్త సినిమా విశేషాలతో పాటు,  తాత ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణ, బాబాయ్‌ బాలకృష్ణలతో పాటు, తారక్‌తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. 

‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్‌ మిమ్మల్ని చూసి పెట్టారా? టైటిల్‌ పెట్టిన తర్వాత మిమ్మల్ని తీసుకున్నారా?

కల్యాణ్‌ రామ్‌: దర్శకుడు నాకు కథ చెప్పిన తర్వాత ఈ సినిమాకు ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అని పెడదామన్నారు. కుటుంబం, బంధాలు తెలియజెప్పేలా ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కల్యాణం’లాంటి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు చేసే వ్యక్తి ఈ టైటిల్‌ చెప్పేసరికి ‘తెలుగుదనం ఉన్న టైటిల్‌ నాకు చెబుతారా’ అని అడిగా. రెండు రోజులు టైమ్‌ తీసుకుని ‘ఎంత మంచివాడవురా’ అని చెప్పారు. హీరో క్యారెక్టర్‌ ప్రకారం ఈ టైటిల్‌ సినిమాకు చక్కగా సరిపోతుంది. 

వినయంగా ఉండటం ఎవరి దగ్గరి నుంచి వచ్చింది?

కల్యాణ్‌ రామ్‌: చిన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. ఊరికే కోపం వచ్చేస్తుంది. అయితే, ఎక్కువసేపు ఉండదు. వెంటనే తగ్గిపోతుంది. 

తాత ఎన్టీఆర్‌ టాప్‌లెస్‌ కారు పంపి ‘ఎలా ఉంది’ అని అడిగితే ‘ఏదో ఉందిలే’ అని అన్నారట!

కల్యాణ్‌ రామ్‌: ఒకరోజు తాతగారి కారు ఇబ్బంది పెడితే, నాన్నను అడిగి ఆయన కారు తీసుకున్నారు. అప్పుడు తాతయ్య సీఎం. జ్ఞానీ జైల్‌సింగ్‌ వస్తే, ఆయనను కలవడానికి నాన్న కారు వేసుకుని వెళ్లారు. మరోవైపు మా ఫ్యామిలీ బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తాతయ్య మాకు ఓపెన్‌ టాప్‌ జీపు పంపారు. బయటకు వెళ్లగానే వర్షం పడింది. అందరం తడిసిపోయి ఇంటికి వచ్చాం. ‘ఏంటమ్మా.. అందరూ తడిసిపోయి వచ్చారు’ అని అడిగారు. ‘మీరు పంపిన కారులో తడవకుండా రాగలమా.. అన్నీ బొక్కలే ఉన్నాయి’ అన్నాను. అంతే ఆయన నాన్నను పిలిచి ‘రేపు ఉదయానికల్లా కొత్త అంబాసిడర్‌ మన ఇంట్లో ఉండాలి’ అని అన్నారు. ‘ఏదో చిన్న పిల్లాడు నాన్నా.. వదిలేయండి’ అని నాన్న చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పటికీ ఆ కారు నా దగ్గర ఉంది. నాకు అదొక సెంటిమెంట్‌. 

మీ చేతి మీద టాటూ ఏంటి?

కల్యాణ్‌ రామ్‌: నా భార్య పేరు ‘స్వాతి’. ఆ పేరునే టాటూ వేయించుకున్నా. (వెంటనే ఆలీ అందుకుని మరి మీ పేరు మీ ఆవిడ చేతి మీద ఉందా?) నా పేరు ఆమె గుండెల్లో ఉందండీ(నవ్వులు)

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమా ఏది?

కల్యాణ్‌ రామ్‌: ‘బాల గోపాలుడు’ ఒక్కటే చేశా. ఆ సినిమా చేసేటప్పుడు బాబాయ్‌ వచ్చి ‘వీడు బొద్దుగా చాలా బాగున్నాడు నా సినిమాలో పెట్టుకుంటా’ అని నాన్నను అడిగారు. ఆయన కూడా ఒప్పుకొన్నారు. మా అమ్మగారికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె పదో తరగతి అయిపోగానే పెళ్లి చేసేశారట. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డలు చదువుకోవాలని బలంగా అనుకునేది. ఆమె కోరిక మేరకు మొదట బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, తరవాత మాస్టర్స్‌ చేశా.

కథానాయకుడిగా తొలి సినిమా ఏది?

కల్యాణ్‌ రామ్‌: ‘తొలి చూపులోనే..’ ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో రామోజీరావుగారు నిర్మించారు.  

ఈ సంక్రాతికి ‘దర్బార్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల మధ్య మీ సినిమా కూడా వచ్చింది? మీ ధైర్యం ఏంటి?
కల్యాణ్‌ రామ్‌: ఇది కుటుంబమంతా కలిసి చూసే సినిమా. సంక్రాంతి సినిమా వాళ్లకు పండగ. ఎందుకంటే ఎన్ని సినిమాలు విడుదలైనా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఈ సంక్రాంతికి సొంతూరు వస్తారు. కుటుంబమంతా కలుస్తారు. వాళ్లకు ఉన్న ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం, విలువలు చెప్పే చిత్రాన్ని సంక్రాంతికే తీసుకురావాలని అనుకున్నాం. ఇది సరైన సీజన్‌. ఈ రోజుల్లో.. ఓ సినిమా సరైన సమయంలో విడుదల కావడం కూడా ఓ ముఖ్యాంశమే. దర్శకుడు సతీష్‌గారు గతంలో కుటుంబ కథా చిత్రాలు తీసి మెప్పించారు. ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్‌ను తీసుకుని దాన్ని డెవలప్‌ చేశాం. సాధారణంగా సతీష్‌గారి సినిమా పూర్తి వెజిటేరియన్‌. ఫైట్స్‌, పంచ్‌డైలాగ్‌లు ఉండవు. కానీ, మా సినిమాలో అవి కాస్త యాడ్‌ చేయించాం. 

మీ కెరీర్‌లో సంక్రాంతికి వస్తున్న తొలి సినిమా ఇదేనా?

కల్యాణ్‌ రామ్‌: అవునండీ! ఇన్నేళ్ల కెరీర్‌లో సంక్రాంతికి విడుదలవుతున్న తొలి సినిమా ఇదే.

తాత ఎన్టీఆర్‌ నటించిన సినిమాల్లో మీకు బెస్ట్‌ అనిపించిన చిత్రమేది?

కల్యాణ్‌ రామ్‌: ‘పాతాళ భైరవి’ నాకు చాలా ఇష్టమైన చిత్రం. అందులో చాలా అందంగా ఉంటారు. ‘మాయాబజార్‌’, ‘గుండమ్మ కథ’ సినిమాలన్నా ఇష్టమే. ఇక బాబాయ్‌ నటించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా కోసం బాబాయ్‌ అస్సలు మేకప్‌ వేసుకోలేదు. పీసీ శ్రీరామ్‌గారు చాలా చక్కగా చూపించారు. 

మీకు ఇష్టం లేకపోయినా ఏడో తరగతిలో మిమ్మల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేశారట!

కల్యాణ్‌ రామ్‌: చిన్నప్పుడు బాగా అలర్లి చేసేవాడిని. నేను ఆరో తరగతి చదువుతుండగా, ‘బాల గోపాలుడు’ సినిమా కూడా అయిపోయింది. చదువు మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆ సమయంలో మా మేనమామ చనిపోవడంతో మా అమ్మ నిమ్మకూరు వెళ్లాల్సి వచ్చింది. దీంతో నా చదువు పూర్తిగా అటకెక్కింది. విషయం అమ్మకు తెలియడంతో వెంటనే హైదరాబాద్‌ వచ్చేశారు. చదవకపోతే మా అమ్మ నన్ను బాగా కొట్టేది. అదే సమయంలో మా అన్నయ్య, అక్క హాస్టల్లో చదువుకునేవారు. వాళ్లను ఏమీ అనేది కాదు. దీంతో నేను కూడా హాస్టల్లో చదువుకుంటానని నాన్నతో చెప్పా. అప్పుడే ఓ రోజు నేనొక పిచ్చి పని చేశా. మా హోటల్‌ మేనేజర్‌ దగ్గరకు వెళ్లి ‘రూ.100 కావాలి’ అని అడిగా. ఆయన ఇవ్వను అన్నారు. నాకు బాగా కోపం వచ్చి, రాడ్‌ తీసుకుని ‘అసలు నువ్వెవడురా.. అది నా డబ్బు.. మా సొమ్ము’ అన్నా. ఈ విషయం నాన్నకు తెలిసింది. దీంతో అబ్బాయి చేయి దాటిపోతున్నాడని నన్ను హాస్టల్లో చేర్పించారు.

విజయవాడ చంద్రశేఖర్‌ అంటే మీకు ఏం గుర్తుకు వస్తుంది?

కల్యాణ్‌ రామ్‌: నాకు స్ఫూర్తిని నింపిన వ్యక్తుల్లో ఒకరు. నేను వినయ విధేయతలతో ఉండటానికి కారణం కూడా ఆయనే. ప్రతి మనిషికీ జీవితంలో ఓ మలుపు ఉంటుంది. ఆయన దగ్గరకు వెళ్లడం నా జీవితంలో మలుపు. ఆయన మా ఇంగ్లిష్‌ లెక్చరర్‌. ఎప్పుడూ నాకు క్లాస్‌ తీసుకుంటూ ఉండేవాళ్లు. ఒకరోజు ‘నువ్వు ఎవరో తెలుసా’ అన్నారు. ‘కల్యాణ్‌రామ్‌’ అన్నా. ‘కాదు.. నందమూరి కల్యాణ్‌రామ్‌. నీ పేరుకు ముందు ‘నందమూరి’ అనే పేరుంది. మీ తాతగారు ఎంతో క్రమశిక్షణతో, కృషితో పైకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి చెడ్డ పేరు తీసుకురావద్దు. నిన్నెవరూ పట్టించుకోరు. నువ్వు ఆయన పేరు మీద బతుకుతున్నావు. నువ్వు చేసే పనివల్ల ఆయనకు చెడ్డ పేరు తీసుకురావద్దు’ ఇలా అనేక విషయాలు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘నందమూరి’ అనే పేరుకు చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే మేమంతా ఆయన పేరుతోనే బతుకుతున్నాం. 

నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నారు?

కల్యాణ్‌ రామ్‌:ఆయన ఏ పనినైనా చాలా శ్రద్ధగా చేస్తారు. ముక్కు సూటిగా ఉంటారు. అబద్ధాలు చెప్పరు. ముందొక మాట, వెనకొక మాట మాట్లాడరు. ఇవే ఆయన నుంచి నేర్చుకున్నా. ఒక మనిషి నాకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్లిపోతా. పక్కకు వెళ్లి మాత్రం చెడుగా చెప్పను. నాన్న.. కుటుంబ కోసం పరితపించేవారు. తారక్‌తో మా బ్యానర్‌లో ‘జై లవ కుశ’ చేసేటప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాతోనే కొత్త ఆఫీస్‌ ఓపెన్ చేశా. ఆ రోజంతా ఆయన అక్కడే ఉన్నారు. మేమంతా కలిసి ఉండాలని ఆయన కోరుకునేవారు. ముఖ్యంగా తారక్‌, నేనూ కలిసి సినిమా చేయాలని ఉండేది. భవిష్యత్‌లో తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తారక్‌తో మరిన్ని సినిమాలు చేస్తా. 

తారక్‌ మిమ్మల్ని ‘అన్నా’ అని పిలుస్తాడు. మీరేమో ‘నాన్నా’ అని పిలుస్తారు ఎందుకు?

కల్యాణ్‌ రామ్‌: మొదటి నుంచీ అలా అలవాటైంది. తారక్‌ నాతో కొన్నిసార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడు. ఇంకొన్నిసార్లు చిన్న పిల్లాడు అయిపోతాడు. అతనిలో అన్ని ఎమోషన్స్‌ కలిసిపోయి ఉంటాయి. అందుకే తారక్‌ను ఎప్పుడూ తమ్ముడూ అని పిలవను. వేదికలపై కూడా ‘నాన్నా’ అనే పిలుస్తా. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటు తారక్‌ తీరుస్తున్నాడు. ఒకరికి ఒకరం అండగా ఉంటాం. 


 

‘ఎంత మంచివాడవురా’ విషయంలో తారక్‌ సహకారం ఎంతుంది?

కల్యాణ్‌ రామ్‌: నా ప్రతి సినిమాలోనూ తారక్‌ సహకారం ఉంటుంది. ప్రతి సినిమాకూ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. తను కొన్ని సలహాలిస్తాడు. 

నిజ జీవితంలో ఎవరికైనా కర్చీఫ్‌ వేశారా?

కల్యాణ్‌ రామ్‌: లేదండీ (నవ్వులు)! నా చదువంతా బాయ్స్‌ స్కూల్లో సాగింది. అదే సమస్య.

అయితే మీది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా?

కల్యాణ్‌ రామ్‌: పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆమెది హైదరాబాదే. తను డాక్టర్‌. తన నలుగురు బిడ్డల్లో ఎవరో ఒకరు డాక్టర్‌ కావాలని నాన్నగారికి ఉండేది. మేం అలా చదువును ముగించేశాం. ‘ఎవరైనా డాక్టర్‌ చదువుకున్న వాళ్లు కుటుంబంలో ఉంటే బాగుంటుంది’ అని నాన్నకు ఉండేది. అదృష్టం కొద్దీ ఈ సంబంధం వచ్చింది. చాలా హ్యాపీ. నా భార్యకు ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలని ఉండేదట. అయితే, వాళ్ల తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్‌ అయింది. తర్వాతి చదువుల గురించి అడిగితే ‘నాకు ఇష్టం లేదు’ అని చెప్పింది. చదువు విషయంలో నేను కూడా పెద్దగా బలవంతం చేయలేదు. కానీ, నా వల్లే తను పైచదువులు చదవలేదని నాన్నగారికి నామీద కోపం ఉండేది. తనకు ఇష్టం లేదని నాన్నకు ఎప్పుడూ చెప్పలేదు.

చిన్నప్పుడు నాన్న కొట్టలేదా?

కల్యాణ్‌ రామ్‌: నా చిన్నప్పుడు ఒక స్పోర్ట్స్‌ సైకిల్‌ కొనుక్కుందామని నేనూ అన్నయ్యా అనుకున్నాం. అన్నయ్య తన పాత సైకిల్‌ ఎక్స్ఛేంజ్‌ కింద ఇచ్చేస్తే రూ.500 తగ్గాయి. మళ్లీ వెళ్లి హోటల్‌ మేనేజర్‌తో గొడవ పెట్టుకున్నా. టెలిఫోన్‌ కనెక్టర్‌ పగలగొడతానని భయపెట్టా. దాంతో రూ.500 ఇచ్చారు. విషయం నాన్నకు తెలిసిపోయింది! కారు వేసుకుని ఇంటికి చాలా కోపంగా వచ్చారు. విషయం మా అన్నయ్యకు అర్థమైంది. వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఇంట్లోకి రావడం రావడంతోనే నన్ను లాగిపెట్టి కొట్టారు. అంతే స్పృహ కోల్పోయా. చాలా సేపటి తర్వాత చూస్తే నేను బెడ్‌పై పడి ఉన్నా. నా దగ్గరకు వచ్చి, ‘నాన్నా.. నువ్వు చేసింది చాలా తప్పు. నీకు సైకిల్‌ కావాలంటే వచ్చి నన్ను అడుగు. అలా ప్రవర్తించడం తప్పు’ అంటూ మందలించారు.   

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ‘ఎందుకురా ఈ సినిమాలు ఉద్యోగం చేసుకునే దానికి’ అని అన్నారట!

కల్యాణ్‌ రామ్‌: అప్పట్లో నేను అమెరికాలో ఉద్యోగం చేసేవాడిని. గంటకు 30 డాలర్లు. సినిమాల మీద ప్యాషన్‌తో దాన్ని వదులుకుని వచ్చేశా. ఆ తర్వాత నేను నటించిన మొదటి రెండు చిత్రాలూ ఫ్లాప్‌. దీంతో నాకు బాగా దగ్గరి బంధువులు, స్నేహితులు ‘ఎందుకు నీకీ సినిమాలు.. నీకు సరిపోవేమో’ అన్నారు. కానీ, నాపై నాకు నమ్మకం. తప్పులు సరి చేసుకుని సినిమా చేద్దామనుకున్నా. దీంతో సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించి ‘అతనొక్కడే’ తీశాం. ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకూ 9 సినిమాలు తీశాం. 

‘టెంపర్‌’, ‘పటాస్‌’ కథలు చాలా దగ్గరగా ఉంటాయి. ఒకటి తమ్ముడు చేశాడు. మరొకటి అన్నయ్య చేశాడు. మీ మధ్య ఎప్పుడూ చర్చ జరగలేదు!

కల్యాణ్‌ రామ్‌: ఆ సినిమాల విషయంలోనే తప్పు జరిగింది. అక్కడి నుంచే చర్చించుకోవడం మొదలు పెట్టాం. ఒకరోజు మా హరి.. ‘టెంపర్‌’ రచయిత వక్కంతం వంశీని కలిశారు. మాటల మధ్యలో రెండు చిత్రాల కథలు దాదాపు ఒకటేనని తెలిసింది. వెంటనే విషయాన్ని తారక్‌కు చెబితే, జగన్‌గారితో మాట్లాడండి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే, ‘ఇండస్ట్రీలో అన్ని కథలూ ఒక్కటే సర్‌.. రివెంజ్‌ కథలు, ఎమోషనల్‌ కథలు, కామెడీ కథలు ఇవే ఉంటాయి. డీల్‌ చేసే విధానం మారిపోతుంటుంది. మీరేమీ అధైర్యపడకండి. నేనున్నాను కదా’ అన్నారు. అంతే వదిలేశాం. రెండూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే, రెండు వారాల వ్యవధిలో విడుదలయ్యాయి. 

రొమాంటిక్‌ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడతారట!

కల్యాణ్‌ రామ్‌: అవును, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో నా డూప్‌ను పంపిస్తే చాలా సంతోషిస్తా. అవసరమైతే మిమ్మల్ని (ఆలీ) పంపిస్తా. 

‘ఇజం’ సమయంలో పూరి జగన్నాథ్‌ 8కి.మీ. పరిగెత్తించారట!

కల్యాణ్‌ రామ్‌: ఛేజ్‌ సీక్వెన్స్‌ అది. ఉదయం నుంచి రాత్రి 2గంటల వరకూ అలా పరిగెత్తిస్తూనే ఉంటారు. ఆ సినిమాలో 8ప్యాక్‌ చేద్దామనుకున్నా కానీ, నా వల్ల కాలేదు. నా మేకోవర్‌ మారిన చిత్రంగా పేరొచ్చింది. జగన్‌గారితో పనిచేయడం వల్ల నాకు తెలియని కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అంతకుముందు రెండు, మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాలన్నా, పూర్తి కమర్షియల్ సినిమా చేయాలన్నా కొంచెం భయం ఉండేది. 

ఎన్టీఆర్‌ను చిన్నప్పుడు ఆట పట్టించేవారా?

కల్యాణ్‌ రామ్‌: అమ్మో.. ఎప్పుడూ లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తీరికలేకుండా గడిపేవారు. ‘తాతగారు’ అని పిలిచేవాళ్లం.

బాలయ్య, తారక్‌, కల్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో సినిమా ఆశించవచ్చా?
కల్యాణ్‌ రామ్‌: మంచి కథ ఉంటే ముగ్గురం కలిసి పనిచేస్తాం. అయితే, నేను మాత్రం ఒక సాంగ్‌లో అలా కనిపించి వెళ్లిపోతా. నా బ్యానర్‌లో చేస్తే, నాకున్న కోరికలన్నీ తీరిపోయినట్లే. ‘మనం’ చూసినప్పుడు ‘అరె.. మనకు అలాంటి అవకాశం రాలేదే’ అని అనుకున్నా. 

సినిమా విషయంలో బాబాయ్‌ సహకారం ఎలా ఉంటుంది?
కల్యాణ్‌ రామ్‌: నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పారు. ‘ఒక షాట్‌ చేసేటప్పుడు ఒకట్రెండు టేక్‌ల్లోనే చేసేయాలన్న ఆలోచన పెట్టుకోవద్దు. నీ మనసుకు నచ్చేంత వరకూ చెయ్‌. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, అస్సలు ఆలోచించవద్దు’ అని అన్నారు.

నాగార్జునకు చాలా మంది అభిమానులు ఉంటే, ఆయన మాత్రం మిమ్మల్ని అభిమానిస్తారట!

కల్యాణ్‌ రామ్‌: ‘అతనొక్కడే’ చూసి ఇండస్ట్రీలో చాలా మంది మెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్‌ వైపు నాకు అస్సలు అవగాహన లేదు. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశా. ఒక కొత్త దర్శకుడిని నమ్మి అంత ఎలా ఖర్చ పెట్టగలిగావు? అని ఆశ్చర్యపోయారు. ఆ సినిమా అంటే నాగార్జున గారికి చాలా ఇష్టం. అంతే తప్ప ఆయన నాకు అభిమాని కాదు. 

‘ఎంతమంచి వాడవురా’ ఎందుకు చూడాలి?

కల్యాణ్‌ రామ్‌: పక్కవాళ్లకు మన చేతనైనంత సాయం చేయాలన్న చిన్న ఎలిమెంట్‌ను తీసుకుని ఈ సినిమా చేశాం. ‘ఏమో..ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. కొంచెం పాలు పంచుకుందాం’ అని ఇందులో ఓ సాంగ్‌లో ఉంటుంది. 

మీరు పనిచేసిన హీరోయిన్లలో చాలా సౌకర్యంగా ఉన్న వాళ్లు ఎవరు?

కల్యాణ్‌ రామ్‌: అందరూ బాగుంటారు. అయితే, నివేదా ధామస్‌ సినిమా అంటే పరితపిస్తుంది. 

మీ సెల్‌ఫోన్‌కు వచ్చిన సందేశాల్లో మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేసిన సందేశం ఏది?

కల్యాణ్‌ రామ్‌: తారక్‌ పంపే సందేశాలు చాలా వెరైటీగా ఉంటాయి.

ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్‌ చేశారా?

కల్యాణ్‌ రామ్‌: మీరు డైలాగ్‌ పేపర్‌ ఇస్తే, చేసి చూపిస్తా. (నవ్వులు) నేను ఏ అమ్మాయికీ ప్రపోజ్‌ చేయలేదు. అయితే, నాకు పెళ్లయిన కొత్తలో మాత్రం నా భార్యను పిలిచి ‘నేను నీకు నచ్చానా?’ అని అడిగా. ‘నచ్చకుండా ఎందుకు ఒప్పుకొంటాను’ అని చెప్పింది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. పాప నాలుగో తరగతి చదువుతోంది.

బాబాయ్‌ చెప్పిన డైలాగుల్లో మీకు నచ్చింది?

కల్యాణ్‌ రామ్‌: Even God must be born from mother's womb

మీకు ఏ దర్శకుడితో చేయాలని ఉంది?

కల్యాణ్‌ రామ్‌: కొరటాల శివగారితో పనిచేయాలని ఉంది. కమర్షియాలిటీ, క్లాస్‌ రెండూ చాలా చక్కగా కలిపి చూపిస్తారు. ఆయన టాలెంట్‌ అద్భుతం.

రాజకీయ రంగ ప్రవేశం ఏమైనా ఉందా?

కల్యాణ్‌ రామ్‌: ప్రస్తుతం ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో బిజీగా ఉన్నా. 

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని