ఫస్ట్‌లవ్‌.. నా లైఫ్‌లో అలాంటి సీనే జరిగింది..!
close
Published : 08/02/2020 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫస్ట్‌లవ్‌.. నా లైఫ్‌లో అలాంటి సీనే జరిగింది..!

అక్షయ్‌కుమార్‌ ఫార్ములా ఫాలో అవుతున్నా : శర్వానంద్‌

హైదరాబాద్‌: వెండితెరకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకూ విభిన్న పాత్రలు.. వినూత్నమైన కథలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు నటుడు శర్వానంద్‌. సినిమా సినిమాకీ తనలోని నటుడిని సినీ ప్రియులకు మరింత కొత్తగా పరిచయం చేస్తున్నారు ఈ నటుడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘96’ అనే క్లాసిక్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

అవసరమా అనిపించింది..

 రాజన్న (దిల్‌రాజు) నాకు ఒక రోజు ‘96’ సినిమా చూపించారు. సినిమా చూడడం అయిపోయాక.. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ‘‘96’ మంచి క్లాసిక్‌ మూవీ’ అని చెప్పాను. వెంటనే ఈ సినిమా రీమేక్‌లో నువ్వు నటిస్తున్నావు అన్నారు. ‘అది మంచి క్లాసిక్‌ మూవీ.. అన్నా. ఇద్దరు పెద్ద స్టార్స్‌ చేశారు. చాలా బాగా నటించారు. రీమేక్‌ చేయడం అవసరమా’ అని అడిగాను. ‘నీకు కథ నచ్చింది కదా. కాబట్టి నువ్వు ఈ సినిమాలో చేస్తున్నావ్‌’ అని అనేశారు. నాకు దిల్‌రాజు నిర్ణయం మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అందుకే ఆయన అడిగిన కొంత సమయానికే ఓకే చెప్పేశాను. సినిమా ఓకే చేశాక మూడు నెలలకి ‘జాను’ షూటింగ్‌ ప్రారంభించారు. ‘96’ చిత్రాన్ని ఒక్కసారే చూశాను. అదికూడా కథ గురించి తెలుసుకోడానికి అంతే. షూటింగ్‌ ప్రారంభమయ్యాక ఆ సినిమా చూడలేదు.

ప్రతి సీన్‌కి ఒక కథ..

తమిళంలో తెరకెక్కిన ‘96’ సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించిన రామ్‌‌ పాత్రను తెలుగులో నేను చేశా. ఈ పాత్రను పోషించడానికి ముందు నేను ఎలాంటి హోంవర్క్స్‌ చేయలేదు. మా డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ ఏం చెబితే అదే చేసేవాడిని. ఎందుకంటే ఆయనకు రామ్‌ పాత్ర గురించి పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రతి సీన్‌కి ముందు అసలు ఆ సీన్‌కి ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ కథను వివరించేవారు. అలా నేను ఈ సినిమాలో ఆయన చెప్పినట్లు నటించాను.

బాగా కష్టపడ్డాను..

‘96’ గురించి తెలుసుకున్నప్పుడు కేవలం ఒక్క రాత్రిలోనే సినిమా అంతా అయిపోతుంది కదా.. చాలా ఈజీ అని అనుకున్నాను. కానీ ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ కష్టపడిన సినిమా.. ‘జాను’. ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌ నిజజీవితంలో ఎలా ప్రయాణాలు చేస్తారో.. అలా ఈ సినిమా కోసం 20 రోజులు పాటు కెన్యా, మాల్దీవులు ట్రావెల్‌ చేశాం. ఆ సమయంలోనే యాక్సిడెంట్‌ అయ్యింది.

ట్రోల్స్‌ గురించి భయపడ్డా..

‘96’ సినిమాతో త్రిష, విజయ్‌ సేతుపతి ఒక బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేశారు. ఒకవేళ వాళ్ల స్థాయిలో మేము నటించకపోతే ఎలాంటి ట్రోల్స్‌ వస్తాయో అని మొదటి నుంచి భయపడ్డాం. ఈరోజు విడుదలయ్యాక కూడా చాలా మంది ‘జాను’ చిత్రానికి ఇచ్చిన రేటింగ్‌ చూసి సంతోషించాను. ‘ఒకవేళ మేము సరిగ్గా చేయకపోతే మమ్మల్ని విమర్శించేవారు కదా’ అనిపించింది.

సమంత లేకపోతే రాదు..

‘జాను’ సినిమాలో సమంత నటన కంటే నా నటనే బాగుందని చాలా మంది అంటున్నారు. దాన్ని నేను ఏమాత్రం నమ్మను. సమంత కాకుండా ఇంకెవరైనా ఆ స్థానంలో ఉండి ఉంటే నా నుంచి ఆ స్థాయిలో పెర్ఫామెన్స్‌ రాదని చెప్పగలను.

ఆ సీన్‌కి బాగా కనెక్ట్‌..

‘జాను’ సినిమాలోని ఓ సీన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఒక సన్నివేశంలో సమంత దగ్గర కూర్చుని.. ‘నీకు తాళి కట్టేటప్పుడు నువ్వు అనుకున్నట్టు గానే నేను వచ్చా జాను’ అని సమంతతో చెబుతాను, యాక్షన్‌ చేసి చూపిస్తాను. నిజం చెప్పాలంటే నా జీవితంలో అలాగే జరిగింది. అందుకే నేను ఆ సీన్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నాలైఫ్‌లో కూడా అలాంటి ఫస్ట్‌లవ్‌ స్టోరీనే ఉండబట్టి నేను కనెక్ట్‌ అయ్యాననుకుంటా.

అదే మాకు పెద్ద విజయం..

‘జాను’ సినిమా గురించి మాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ఎక్కడా కూడా రీమేక్‌లా అనిపించలేదు. ఒక ఫ్రెష్‌ సినిమాని చూసినట్లు ఉందని చాలా మంది అన్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి, త్రిషను మర్చిపోయి.. కేవలం సమంత, శర్వానే చూస్తున్నాం అని చెబుతున్నారు. అదే మాకు లభించిన పెద్ద విజయం.

రాజు కాకపోతే చేయను..

‘96’ సినిమాని దిల్‌రాజు కాకుండా ఎవరు రీమేక్‌ చేసిన మేము చేసేవాళ్లం కాదు. రాజన్న కాబట్టే ఈ రీమేక్‌లో నేను నటించాను.

అక్షయ్‌ ఫార్ములా..

‘పడిపడిలేచే మనసు’, ‘రణరంగం’ సినిమాలతో పరాజయాలను చవిచూశాను. ఆ రెండు సినిమాలకు ముందు నాకు వరుసగా ఐదు హిట్‌లు ఉన్నాయి. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్‌ కావడంతో తక్కువ సమయంలోనే వీలైనన్ని మంచి కథల్లో నటించాలని నేను ఫిక్స్‌ అయ్యాను. అందుకే వెంట వెంటనే సినిమాలను ప్రారంభించాను. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ ఫార్ములాని ఫాలో అవుతున్నాను.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని