లాక్‌డౌన్‌ పొడిగింపుపై బోయపాటి కామెంట్‌
close
Published : 15/04/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ పొడిగింపుపై బోయపాటి కామెంట్‌

‘వారికి నా పాదాభివందనం’

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం వైద్యులు, పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని, వారికి పాదాభివందనం చేస్తున్నానని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించడం పట్ల తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘లాక్‌డౌన్‌ కాలాన్ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సుముచితం. కొవిడ్‌-19పై రాజీలేని పోరాటాన్ని కొనసాగించడానికి లాక్‌డౌన్‌ను మించిన ఆయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశంలోని అందరం ఏకతాటిపై నిల్చొని విజయవంతం చేశాం. అందువల్లే కరోనా వైరస్‌ సమాజంలో విరివిగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగాం. మంగళవారం నుంచి మరో 19 రోజులపాటు అదే స్ఫూర్తితో స్వీయ నియంత్రణతో లాక్‌డౌన్‌ను విజయవంతం చేసి, కరోనా మహమ్మారిపై పోరాటంలోనూ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నా’.

‘దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ చైతన్య పరుస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. కరోనా వ్యాప్తి పోరాటంలో వైద్యులు, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు తలవంచి పాదాభివందనం చేస్తున్నా. మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న సేవలే ప్రధాన కారణం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారు’.

‘లాక్‌డౌన్‌ కారణంగా దేశానికి అర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లినా, దాని కంటే ప్రజల ప్రాణాలే గొప్పవని ప్రధాని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. చిత్ర పరిశ్రమపై కూడా లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ప్రధానంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, దినసరి వేతనంతో జీవించే కార్మికులను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటిగా ముందుకు రావడం గొప్ప విషయం. కరోనా వైరస్‌ ఎంత భయానకమైనా, దాని వల్ల దేశమంతా ఒక్కటేననే భావన ఏర్పడటం, కులమత భేదం లేకుండా పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరం ఐకమత్యం ప్రదర్శించడం గొప్ప విషయం. ఇదే స్ఫూర్తితో మే 3 వరకు లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం. అందరం ఇళ్లల్లో ఉండి ప్రభుత్వాలకు, పోలీసుకులకు పూర్తిగా సహకరిద్దాం. ఇంట్లో ఉందాం, క్షేమంగా ఉందాం’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని