నాన్నగారు చెప్పారండి!
close
Updated : 26/02/2020 06:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్నగారు చెప్పారండి!

అని అనకూడదంటే...

బొమ్మరిల్లు సినిమా చూశారుగా..! హీరో పెళ్లిచూపులకెళ్లిన అమ్మాయి ఏ ప్రశ్న అడిగినా... ‘నాన్నగారు చెప్పారండి’ అని ముక్తాయిస్తుంది.హీరోకే కాదు... మనకీ విసుగొచ్చే సమాధానం అది. తల్లిదండ్రులు నడిపించాలి కానీ వారి ఎదుగుదలకి అడ్డుకాకూడదు. వారి అభిప్రాయాలకు అడ్డుకట్ట వేయకూడదు. లేకపోతే వారిలో భావనా సామర్థ్యమే కాదు...అనేకరకాలుగా వికాసం దెబ్బతింటుంది. ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు, ఆశయాలకు విలువనివ్వాలి..
ఇలాంటి సంఘటనలు మన చుట్టూ నిత్యం జరిగేవే. పిల్లల ఆర్థిక భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే వారిని ఏ కోర్సు చదివించాలి, ఏ కళాశాలలో చేర్పించాలనే విషయాలే తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం చేయట్లేదనేది నిజం. విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులవల్ల కొన్ని రంగాల వైపే తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ప్రణాళికల విషయంలో... వాళ్ల కంటే తామే బాగా ఆలోచిస్తామనే నమ్మకం, ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకూడదనే ఆశతో చాలామంది ఇలా ఆలోచిస్తుంటారు. తాము సాధించలేకపోయిన విజయాలను తమ పిల్లలు సాధిస్తే చూడాలని మరికొంతమంది భావిస్తారు. దీంతో చాలామంది విద్యార్థులు అనాసక్తితోనే పెద్దవాళ్లు నిర్ణయించిన కోర్సుల్లో చేరుతూ, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతుంటారు. బలవంతంగా చదివి మంచి మార్కులతోనే ఉత్తీర్ణులైనా, ఇష్టం లేకుండా చేసే ఆ ఉద్యోగం ఎలాంటి వెలితిని మిగులుస్తుందో తెలుసుకోలేరు.
పెద్దవాళ్లు ఎలా ఆలోచించాలంటే...
* బాల్యం నుంచే పిల్లల ఆసక్తులు, అభిరుచులు అర్థమవుతాయి. వారు అడిగే ప్రశ్నలు, ఆడే ఆటలు, చదివే పుస్తకాల ద్వారా వాటిని గ్రహించవచ్చు. కౌమార దశకు వచ్చాక చదువుకు, సమాజానికి, భవిష్యత్తుకు సంబంధించి వారి ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. తరచూ వారి ఆలోచనలు తెలుసుకుంటూ, అందుకనుగుణంగా తల్లిదండ్రులు ఆయా కోర్సుల గురించి సమాచారం సేకరిచాలి. వాటిపై కనీస అవగాహన పెంచుకోవాలి.
* పాఠశాల విద్య పూర్తయినప్పటి నుంచే విద్యార్థులు కెరీర్‌ గురించి ఆలోచిస్తుంటారు. డిగ్రీ, పీజీ చేస్తున్నప్పటి నుంచే వారు ఎంచుకున్న రంగంలో అవకాశాలకోసం ఆరా తీస్తారు. మరికొంతమంది చదువుతున్న కోర్సుకు సంబంధం లేకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటారు. కెరీర్‌కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
* కాలేజీలో చేరినప్పటి నుంచి కోర్సుల విషయంలో పిల్లలకు మార్గదర్శకత్వం(గైడింగ్‌) చేయడం మంచిదే. కానీ నిర్ణయాలు పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోకి తీసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. వాళ్లు కోరుకున్న రంగం వైపు ప్రోత్సహిస్తేనే వారి శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. ఫలానా సబ్జెక్టే తీసుకోవాలని, ఫలానా కాలేజీలోనే చేరాలని బలవంత పెడితే, అవి పిల్లలను భావోద్వేగపరంగా దెబ్బతీస్తూ, కుటుంబ సంబంధాలనూ బలహీనపరుస్తాయి.
* తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకుంటామని పిల్లలు చెప్తే... వారికి కనీసం ఒక్క అవకాశమైనా ఇవ్వాలి. వారు ఎంచుకున్న మార్గం సరైనదేనా, ఆ రంగంలో విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేవి ఆలోచించాలి. అంతేకాని మొండిగా ప్రవర్తిస్తూ ‘మేం చెప్పింది వినాల్సిందే’ అని కఠినంగా ప్రవర్తించకూడదు.
* భవిష్యత్తులో తమ పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని, అక్కడే ఉద్యోగాలు చేయాలనే లక్ష్యాలను నిర్దేశించకూడదు. తెలిసినవారు, చుట్టుపక్కలవారు ఎంచుకున్న విభాగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ, మీ పిల్లలనూ ఆ దారిలోనే వెళ్లాలని కోరుకోవడం సరికాదు. తరాల అంతరాన్ని గమనిస్తూ, పిల్లల అభిరుచులకు అనుగుణంగా, మంచి చెడులను వారితో చర్చించాలి. ఇలా చేస్తే తల్లిదండ్రులపై గౌరవం, ప్రేమాభిమానాలు పెరుగుతాయి.
* విద్యార్థులు చెప్పే కొత్త ఆలోచనలను ఎప్పుడూ నిరాశపరచకూడదు. వారిపై కనీస నమ్మకం ఉంచాలి. అలాగని మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనీ ఆశించకూడదు. ఒక్కోసారి తప్పటడుగులు పడొచ్చు. ఆ సందర్భంలో అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలి. మరోసారి ప్రయత్నించమని ధైర్యం చెప్తూ భరోసా ఇవ్వాలి. ఇలా కాకుండా... ‘నేను ముందే చెప్పానుగా, ఈ రంగంలో నిలదొక్కుకోలేవని..’ వంటి మాటలతో వారిని మరింత నిరాశలోకి, అభద్రతలోకి నెట్టకూడదు.
* చదువుతో పాటు పిల్లల ఆసక్తులు, అభిరుచులను, కళలను ప్రోత్సహించాలి. ఒకవేళ కళలనే కెరీర్‌గా ఎంచుకోవాల్సి వస్తే... సంపాదనా మార్గంగా ఇతర కోర్సులు చేయించాలి. నవతరం తల్లిదండ్రులు మూసలో పడి కొట్టుకుపోకూడదు. ‘వారి భవిష్యత్తు వారి బాధ్యతే’ అనే విషయాన్ని గుర్తిస్తూ, పిల్లలను ప్రోత్సహించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని