Tokyo Olympics: బాధపడి ఏడ్చేంత టైం మాకు లేదు.. దేశానికి కాంస్యమైనా అందించాలి! - no time for disappointment have to focus on bronze medal match: skipper manpreet and sreejesh
close
Published : 03/08/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: బాధపడి ఏడ్చేంత టైం మాకు లేదు.. దేశానికి కాంస్యమైనా అందించాలి!

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఓటమి పాలైనందుకు బాధపడేంత సమయం లేదని భారత హాకీ జట్టు ఆటగాళ్లు అంటున్నారు. గురువారం జరిగే కాంస్య పోరుపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. దేశానికి కనీసం కాంస్య పతకమైనా అందించాలని పట్టుదలతో ఉన్నామన్నారు.  బెల్జియంతో జరిగిన హోరాహోరీ సెమీస్‌లో టీమ్‌ఇండియా 5-2 తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘మేం విజయం సాధించాలన్న వైఖరితో బరిలోకి దిగాం. దురదృష్టవశాత్తు మేం ఓడిపోయాం. అందుకు నిజంగా బాధేస్తోంది. కానీ మేమిప్పుడు కాంస్య పతక పోరుపై దృష్టి సారించాలి. పతకం తేవాలి. సుదీర్ఘ కాలం తర్వాత సెమీసుకు చేరుకోవడం గొప్ప ఘనతే. ఐదేళ్లుగా జట్టు కలిసికట్టుగా ఆడింది. ఈ స్థాయికి చేరుకొనేందుకు మేమంతా కలిసే శ్రమించాం. మరింత మెరుగైన ఫలితానికి మేం అర్హులం. కానీ ఈ రోజు దురదృష్టం వెంటాడింది’ అని కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు.

ది వాల్‌, గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ సైతం కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు. బెల్జియం చేతిలో ఓటమి బాధాకరమే అయినా తర్వాతి మ్యాచ్‌పై దృష్టి సారించడం అంతకన్నా ముఖ్యమని వెల్లడించాడు. ‘నిరాశ చెందాం. కానీ బాధపడేంత సమయం లేదు. దానిని త్వరగా మర్చిపోయి ముందుకు సాగాలి. మేం పతకం గెలిచేందుకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో ఏడుస్తూ కూర్చోవడం కన్నా కాంస్యంపై దృష్టి సారించడం కీలకం. ఈ మ్యాచ్‌ను మళ్లీ చూసి ఎక్కడ పొరపాట్లు చేశామో గుర్తించాలి. దానిని సరిదిద్దుకోవాలి’ అని శ్రీజేశ్‌ తెలిపాడు.

‘నిజమే, ఓటమితో గుండె పగిలింది. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌ చేరాం. మేం స్వర్ణం గెలిచేందుకే ఆడాం. కానీ ఈ రోజు ఓడిపోయాం. తర్వాతి మ్యాచ్‌ గెలిస్తే మాకు కాంస్యం లభించే అవకాశం ఉంది. తర్వాత అందుకోబోయే పతకం మాతోనే ఉన్నా దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుంది. మేం గొప్ప పట్టుదలతో ఉన్నాం. మేం సెమీస్‌ చేరుకొనేందుకు అదే ఉపయోగపడింది. కుర్రాళ్లు బాగా ఆడారు. తర్వాతి మ్యాచ్‌ కోసం మేం ప్రణాళికలు వేసుకోవాలి’ అని సీనియర్‌ డిఫెండర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ అన్నాడు. తాము ఓడినప్పటికీ మహిళల జట్టైనా ఫైనల్‌ చేరుకోవాలని శ్రీజేశ్‌, మన్‌ప్రీత్‌, రూపిందర్‌ ఆశించారు. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తీరు అద్భుతమని వారంతా  ప్రశంసించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని