టీకాల కొరతపై ఎడతెగని మహావివాదం - on the shortage of vaccines conflict
close
Updated : 11/04/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల కొరతపై ఎడతెగని మహావివాదం

 కేంద్రం - మహారాష్ట్రల పరస్పర విమర్శలు

ముంబయి/పుణే: కొవిడ్‌-19 టీకాల సరఫరా విషయంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎడతెగని రీతిలో వివాదం కొనసాగుతూనే ఉంది. అసవరాలకు సరిపడా వ్యాక్సిన్‌ తమకు సరఫరా కావడం లేదని మహారాష్ట్ర చెబుతుండగా.. ఆ రాష్ట్రంలో తగినన్ని టీకా డోసులున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ విషయమై మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ల మధ్య శనివారం మళ్లీ వివాదం రాజుకుంది. టీకాల కొరతతో ఒక్క ముంబయిలోనే 70 వ్యాక్సిన్‌ కేంద్రాలను మూసివేశామని తోపే తెలిపారు. కేంద్రం ఇలాంటి సమస్యలను తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపించారు. రాష్ట్రాలకు కొవిడ్‌ టీకాల కేటాయింపునకు ఒక ప్రాతిపదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం తాజాగా పంపిణీ చేసిన 3.5 కోట్ల డోసుల్లో మహారాష్ట్రకు 7 లక్షలే వచ్చాయని, మరింత ఒత్తిడి చేస్తే మరో 10 లక్షలు అదనంగా కేటాయించినట్లు చెప్పారు. 12 కోట్లకు పైగా జనాభా ఉన్న మహారాష్ట్రలో 60 శాతం క్రియాశీల కేసులున్నట్లు గుర్తుచేశారు. రోజుకు 6 లక్షల టీకా డోసులు వేసే సామర్థ్యానికి పెంచినట్లు వివరించారు. ‘‘ప్రస్తుతం మావద్ద 8 లక్షల డోసులే ఉన్నాయి. రోజుకు 4 లక్షలు వంతున అందుతాయని చెబుతున్నారు. ఇలా రోజువారీగా సరఫరా చేస్తే మేము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు టీకాలను ఎలా రవాణా చేయగలం?’’ అని తోపే ప్రశ్నించారు. కేంద్రం వివాదాలు సృష్టించకుండా రాష్ట్రానికి అవసరమైన టీకా డోసులను పంపించాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కోరారు.

ఉన్న టీకాలను సరిగా వేయండి.. : ప్రకాశ్‌ జావడేకర్‌

మహారాష్ట్ర మంత్రి తోపే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పందించారు. శుక్రవారం నాటికి రాష్ట్రానికి మొత్తం 1.10 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. ప్రస్తుతం 15.63 లక్షలు ఉన్నట్లు చెప్పారు. అలాంటప్పుడు ‘వ్యాక్సిన్‌ లేదు’ అన్న బోర్డులే ఎక్కడా ఉండరాదన్నారు. సరైనరీతిలో వాటిని పంపిణీ చేయాలని సూచించారు. కొవిడ్‌ తీవ్రంగా ఉన్న మహారాష్ట్రకు 1,121 వెంటిలేటర్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీకాల పంపిణీలో కేంద్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని మహారాష్ట్ర చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ దీనిపై రాజకీయాలు చేసే సమయం కాదని, తగిన సమయంలో జవాబిస్తామని అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని