దిల్లీలో ఘోరం: ఆక్సిజన్‌ అందక 20మంది మృతి - oxygen shortage 20 covid 19 patients die in delhi jaipur golden hospital
close
Updated : 24/04/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ఘోరం: ఆక్సిజన్‌ అందక 20మంది మృతి

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాణవాయువు అందక పలు చోట్ల రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆక్సిజన్‌ అందక దిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది రోగులు మృతిచెందినట్లు ఆస్పత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది. ఆక్సిజన్‌ నిల్వలు మరో అరగంట మాత్రమే ఉన్నాయని శనివారం ఉదయం 10.15 గంటలకు ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డా.డీకే బలూజా పేర్కొన్నారు. ఆసుపత్రిలో మరో 200 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతున్నారని.. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడించారు.

‘శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే 3,600 లీటర్ల ఆక్సిజన్‌ ఆసుపత్రికి చేరాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12  గంటలకు కేవలం 1500 లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే ఆసుపత్రికి చేరింది. 7 గంటలు ఆలస్యంగా ప్రాణవాయువు రావడంతో అది అందక రోగులు ప్రాణాలు కోల్పోయారు’ అని డా.బలూజా పేర్కొన్నారు. ఇక్కడి మరో ప్రముఖ ఆసుపత్రిలో ఇటీవల 24 గంటల్లో 25 మంది మృతిచెందిన ఘటన మరవకముందే ఈ ఘోరం చోటుచేసుకోవం విచారకరం.

దిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌లో ఆక్సిజన్‌ సరిపడా లేక గురువారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ వద్ద కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయని ఆసుపత్రి అత్యవసర సందేశం పంపింది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం ఆసుపత్రికి రెండు ట్యాంకర్లు పంపింది. 

దిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. తమ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని, సాయమందించాలని దిల్లీలోని మూల్‌చంద్‌ ఆసుప్రతి యాజమాన్యం ప్రధాని మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు అత్యవసర సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపించింది. తమ ఆస్పత్రిలో 130 మంది కొవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ పడకల మీద ఉన్నారని.. కానీ ఇంకా రెండు గంటల వరకు మాత్రమే ప్రాణవాయువు నిల్వలు ఉన్నాయని, సాయమందించాలని కోరింది.

తమ ఆసుపత్రిలో 265 మంది ఆక్సిజన్‌ పడకలపై ఉన్నారని.. ఈరోజు ఉదయం 8.30 గంటల వరకు మాత్రమే నిల్వలు ఉన్నాయని, సాయమందించాలని బాత్రా ఆసుపత్రి కూడా ప్రభుత్వాన్ని కోరింది. స్పందించిన దిల్లీ ప్రభుత్వం 9.30 గంటలకు ఆక్సిజన్‌ నిల్వలను ఆ ఆసుపత్రికి సరఫరా చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని