Corona Effect: ఆ ఖైదీలను విడుదల చేయండి - sc orders release of prisoners to decongest jails amid covid-19 second wave
close
Updated : 08/05/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona Effect: ఆ ఖైదీలను విడుదల చేయండి

జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సుప్రీం ఆదేశాలు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి దృష్ట్యా గతేడాది బెయిల్‌ లేదా పెరోల్‌ ఇచ్చిన ఖైదీలను మరోసారి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేగాక, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో నిందితులను తప్పనిసరైతేనే అరెస్టు చేయాలని పోలీసులను సూచించింది.

 మహమ్మారి ప్రభావంతో గతేడాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి పలువురు ఖైదీలను బెయిల్‌, పెరోల్‌పై విడుదల చేశారు. బెయిల్‌ పూర్తయిన తర్వాత వారంతా తిరిగి జైళ్లకు వెళ్లారు. అయితే తాజాగా రెండో వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని గతేడాది విడుదల చేసిన వారందరినీ ఎలాంటి పరిశీలన అవసరం లేకుండా తక్షణమే మళ్లీ బయటకు పంపించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఆ ఖైదీలందరికీ మరోసారి 90 రోజుల పెరోల్‌/బెయిల్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో దాదాపు 4లక్షల మంది శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఖైదీలు, పోలీసు సిబ్బంది ఆరోగ్యం, జీవించే హక్కుల దృష్ట్యా జైళ్లలో రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘‘రద్దీగా ఉండే జైళ్లలో సరైన శానిటేషన్‌, శుభ్రత, వైద్య సదుపాయాలు లేక వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జైలు గోడల మధ్య వైరస్‌ వ్యాప్తిని అరికట్టేలా సమర్థ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనాను మనం ఓడించగలం’’అని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. 

 జైళ్లలో రద్దీ కారణంగా ఖైదీలకు సరైన వైద్య సదుపాయాలు అందించడం కుదరట్లేదని ధర్మాసనం తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జైలు అధికారులు ఖైదీలందరికీ సరైన వైద్యసేవలు అందించాలని సూచించింది. రోజువారీ శానిటైజేషన్‌ చేయాలని, జైలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది.  అంతేగాక, వరకట్న వేధింపులతో పాటు ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడే నేరాలకు సంబంధించి కేసుల్లో నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసులను ఆదేశించాలని సుప్రీంకోర్టు సూచించింది. అత్యవసరం అనిపిస్తేనే ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలని తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని