రోహిత్‌తో కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తా: కోహ్లీ - virat kohli said will definitely partner with rohit sharma
close
Published : 21/03/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌తో కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తా: కోహ్లీ

(Photo:BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తానని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పొట్టి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 224/2 భారీ స్కోర్‌ చేయగా, ఇంగ్లాండ్‌ 188/8 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు టీమ్‌ఇండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ (64; 34 బంతుల్లో 4x4, 5x4), కోహ్లీ (80నాటౌట్‌; 52 బంతుల్లో 7x4, 2x6) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో జట్టు విజయానికి గట్టి పునాదులు వేశారు. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌ (32; 17 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (39నాటౌట్‌; 17 బంతుల్లో 4x4, 2x6) తమవంతు పరుగులు చేశారు.

మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లీ మాట్లాడుతూ టీమ్‌ఇండియా ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. రోహిత్‌తో కలిసి మళ్లీ ఓపెనింగ్‌ చేస్తానని చెప్పాడు. ‘ఇది మాకు సంపూర్ణమైన విజయం. ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టాం. తేమ ప్రభావం అధికంగా ఉన్నా గత మ్యాచ్‌లాగే లక్ష్యాన్ని కాపాడుకున్నాం. పంత్‌, శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించాం. మా బ్యాటింగ్‌ లైనప్‌ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం. ఈరోజు నేను, రోహిత్‌ సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని తెలుసు. దాంతో ఒకరు చెలరేగితే, మరొకరు నిలకడగా ఆడాలని అనుకున్నాం. తర్వాత సూర్య, హార్దిక్‌ మ్యాచ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు’ అని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

‘ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్‌ చేస్తా. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం నాకుంది. అయితే, ఇప్పుడు మాకు బలమైన మిడిల్‌ఆర్డర్‌ ఉందని నమ్ముతాను. ఇకపై రోహిత్‌తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా. మా ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది జట్టుకు ఎంతో ఉపకరిస్తుంది. శ్రేయస్‌ గత మ్యాచ్‌లో అదరగొట్టాడు. అలాగే తొలి మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాడు. ఇషాన్‌ అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. సూర్య గురించి చెప్పనక్కర్లేదు. భువనేశ్వర్‌ మళ్లీ గాడిలో పడ్డాడు. పంత్‌ కూడా ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత శార్దూల్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అతడు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు’ అని కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని