ఆయనిచ్చిన అవకాశం.. నేడు రజనీ జీవితం!
close
Updated : 04/01/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయనిచ్చిన అవకాశం.. నేడు రజనీ జీవితం!

ఈ సూపర్‌స్టార్‌ చాలా తక్కువగా మాట్లాడతారు... కానీ, ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీసు బద్దలు కొడుతుంటాయి. బెంగళూరులోని ఓ ట్రాన్స్‌ పోర్ట్‌ సర్వీసులో కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకునేంత విజయవంతంగా సాగింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి కలర్‌ వరకూ అందరూ ఆయన్ను ఇష్టపడేవారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆయన ఎవరో కాదు మన రజనీకాంత్‌. 69 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా హుషారుగా ఫైట్లు, డ్యాన్స్‌లతో అదరగొడుతున్న ఆయన నటించిన ‘దర్బార్’ సినిమా జనవరి 9న రాబోతోంది. ఈ సందర్భంగా రజనీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు, సంఘటనల్ని చూద్దాం..

విలన్‌గా మొదలై..

నటనపై ఆసక్తితో రజనీ మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ ఆయన నటనా ప్రతిభను తమిళ దర్శకుడు కె. బాలచందర్‌ గుర్తించారు. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. దీంతో రజనీ తమిళ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టారు. 1975లో బాలచందర్‌ రజనీకి తొలి అవకాశం ఇచ్చారు. ‘అపూర్వ రాగంగల్‌’ సినిమాలో చిన్న పాత్రను పోషించారు. నటి శ్రీవిద్యను వేధించే భర్తగా కనిపించారు. ఈ సినిమా విజయం సాధించడమే కాదు.. మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘కొత్తగా వచ్చిన రజనీకాంత్‌ హుందాగా, మెప్పించేలా నటించారు’ అని పలు పత్రికలు రాశాయి. ఇలా తొలి చిత్రంతోనే రజనీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆపై అనేక సినిమాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో, సహాయ నటుడిగా సందడి చేసి, గుర్తింపు తెచ్చుకున్నారు.

సూపర్‌స్టార్‌ అన్నారు

రజనీ సోలో హీరోగా తమిళంలో చేసిన ‘భైరవి’ (1978) ఆయనకు బ్రేక్‌ తెచ్చింది. కలైజ్ఞానం నిర్మించిన సినిమా అద్భుత విజయం సాధించింది. శ్రీ ప్రియ, శ్రీకాంత్‌, గీత నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇందులో రజనీ నటన, స్టైల్‌ ఆయనకు సూపర్‌స్టార్‌ అనే బిరుదుని తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి అందరూ సూపర్‌స్టార్‌ అనడం మొదలుపెట్టారు. ఆపై 1991 వరకు ఆయన ఇమేజ్‌ ఇలానే కొనసాగింది.

నాన్‌స్టాప్‌..

చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన కుర్రాడికి ఎన్నో ఏళ్ల తర్వాత తల్లి జాడ తెలుస్తుంది. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ తల్లి ఒడిలో ఒదిగిపోతాడు. మరోపక్క తనను అక్కున చేర్చుకున్న తన స్నేహితుడి కోసం ప్రాణాలు తీయడానికైనా, అర్పించడానికైనా వెనకాడడు. తల్లీ-కొడుకు-స్నేహితుడు బంధంతో వచ్చిన చిత్రం ‘దళపతి’.  తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా మెప్పించింది. ఈ సినిమాలో ఆయన నటన, ఔరా.. శభాష్‌ అనిపించాయి. అంతేకాదు ఈ చిత్రం కోసం ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘సుందరీ నీవే నేనంటా..’, ‘చిలకమ్మా చిటికేయంట..’, ‘యమునా తటిలో నల్లనయ్యకై..’ గీతాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌గా ఉన్నాయి.

‘ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లు..’ చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకూ అందరి నోళ్లలోనూ నానిన డైలాగ్‌ ఇది. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో రూపొందిన ‘బాషా’ సినిమా రజనీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా ఆయనకు విపరీతమైన స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే రజనీ అంటే బాషా.. బాషా అంటే రజనీ అనేలా పేరు తెచ్చుకున్నారు. అదే ఏడాది ‘ముత్తు’తోనూ రజనీ సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా జపాన్‌లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, అక్కడ కూడా రజనీకి ఫ్యాన్స్‌ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రజనీ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.

మీరు 30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చుపెట్టగలరా..? రజనీ మాత్రం ఖాళీ చేయగలరు. ‘దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు..’ అంటూ చకచకా డబ్బు మొత్తం పూర్తి చేసేయడమే కాదు, బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో నింపేశారు. ఇక ‘లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.. నా దారి రహదారి, డోన్ట్‌ కమ్‌ ఇన్‌ మై వే..’ అంటూ ‘నరసింహ’ అవతారం ఎత్తి  ఘన విజయాన్ని అందుకున్నారు. ‘అరుణాచలం’ (1997), ‘నరసింహ’ (1999)లతో రజనీ మరింత ఫేమస్‌ అయ్యారు. 1990-99ల కాలంలో రజనీ వరుస హిట్లతో స్వదేశంతోపాటు విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుని ఎల్లలులేని కథానాయకుడిగా మారారు.

రికార్డులు

జపనీస్‌ భాషలో డబ్బింగ్‌ అయిన ‘ముత్తు’ అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. 1998లోనే 1.6 మిలియన్‌ డాలర్లు సాధించింది. ‘నరసింహ’ సినిమా అప్పట్లో తమిళంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో 2010లో వచ్చిన ‘రోబో’ అత్యధిక బడ్జెట్‌తో కూడిన తొలి భారతదేశ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘2.ఓ’ కూడా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణించింది.

నష్టాలు

ఎన్నో అంచనాలు, ఆశల మధ్య 2002లో వచ్చిన ‘బాబా’ నిరాశ మిగిల్చింది. రజనీ నిర్మాతగా, హీరోగా వచ్చిన ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. పంపిణీదారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆపై మూడేళ్లు ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న రజనీకి  ‘చంద్రముఖి’ (2005) ఊరట ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిన కోలీవుడ్‌ చిత్రంగా నిలిచింది. అంతేకాదు తొలి భారతీయ మోషన్‌ పిక్చర్‌గా వచ్చిన ‘విక్రమసింహ’ (2014) కూడా రజనీదే. ఇది కమర్షియల్‌గా పరాజయం ఎదుర్కొంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని