
తాజా వార్తలు
పుట్టింటిపై ప్రేమ.. మెట్టింట్లో దొంగను చేసింది
పెళ్లి అప్పు తీర్చేందుకు అత్తారింట్లో చోరీ
నిందితురాలు, సహకరించిన తల్లి అరెస్టు
ఈనాడు, హైదరాబాద్, జవహర్‌నగర్, న్యూస్‌టుడే: తాహతుకు మించిన సంబంధాలు.. పెళ్లి కోసం ఆడంబరాలు.. దొరికినచోటల్లా అప్పులు! అవి తీర్చలేక సతమతం.. ఇలాంటి సాలెగూడులో చిక్కుకున్న ఓ మధ్యతరగతి యువతి దయనీయ పరిస్థితుల్లో దొంగగా మారింది. పుట్టింటిపై ప్రేమ ఆమెను మెట్టింట్లో దొంగను చేసింది. తన పెళ్లి కోసం అప్పుల్ని చేసి తీర్చలేక తల్లడిల్లుతున్న తల్లిని ఆదుకోవడం కోసం అత్తవారింట్లో చోరీకి పాల్పడి చివరకు కటకటాలపాలైంది. ఆమెకు సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈనెల 23 రాత్రి యాప్రాల్‌కు చెందిన వెంకటస్వామి తన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసరాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా బురఖా ధరించిన ఓ యువతి ఇంట్లోకెళ్లినట్లు గుర్తించారు. లోతుగా ఆరా తీయగా ఫిర్యాదుదారుడి కోడలే చోరీకి పాల్పడిందని గుర్తించారు. శుక్రవారం నిందితురాలిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వెంకటస్వామి కుమారుడికి నిందితురాలితో 2016లో వివాహమైంది. ఆ పెళ్లి కోసం ఆమె తల్లి రూ.30 లక్షలు అప్పు చేసింది. ఆర్థిక సమస్యల వల్ల బాకీ తీర్చలేకపోయింది. దీంతో అత్తవారింట్లో చోరీ చేసేలా కుమార్తెను ఒప్పించింది. నాలుగురోజుల ముందే ఆమె పుట్టింటికి వచ్చింది. ఈనెల 23న అత్తవారింట్లో అందరూ బంధువుల పెళ్లికి వెళ్లారని తెలుసుకుని తల్లీ, కూతురు రంగంలోకి దిగారు. తన దగ్గరున్న తాళంచెవితో తలుపుతీసి కుమార్తె అత్తవారింట్లోకి వెళ్లింది. దొంగలు పడినట్లు భావించేలా ఇల్లంతా చిందరవందర చేసింది. అల్మారాను పగలగొట్టింది. 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. 10,500 నగదు తీసుకుని వెనుక తలుపు నుంచి ఉడాయించింది. చివరకు ఇద్దరూ పోలీసులకు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్లు పి.భిక్షపతిరావు (జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో), శ్రీధర్‌రెడ్డి (ఐటీ సెల్), డి.వెంకన్న నాయక్, రవి కుమార్ (సీసీఎస్ మల్కాజ్గిరి)ను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.