ఒకేరోజు ఐదు ఇళ్లలో భారీ చోరీలు
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 04:59 IST

ఒకేరోజు ఐదు ఇళ్లలో భారీ చోరీలు

రూ.30 లక్షల నగదు, 54 తులాల బంగారు, రెండు కిలోల వెండి నగలు మాయం

జియాగూడ, న్యూస్‌టుడే: ఓవైపు లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. ఇదే అదనుగా భావించి తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పాతబస్తీ జియాగూడలోని రెండు వీధుల్లో దొంగలు స్త్వైర విహారం చేశారు. ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి సుమారు రూ.30లక్షల నగదు, సుమారు 54 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. చుట్టుపక్కల ఇళ్లకు బయటి నుంచి గడియలు పెట్టి మరీ తమ పని కానిచ్చుకుపోవడం గమనార్హం. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. జియాగూడ, వెంకటేశ్వరనగర్‌లో ఎమ్‌.శ్రీనివాస్‌, సురేష్‌కుమార్‌, నరేష్‌కుమార్‌లు ముగ్గురు సోదరులు ఉంటున్నారు. తల్లిదండ్రులు మృతిచెందినా ముగ్గురు సోదరులూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. శ్రీనివాస్‌, సురేష్‌కుమార్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పక్కపక్క గదుల్లో ఉంటుండగా.. ఎదురుగా ఉండే రూమ్‌లో వారి చిన్న తమ్ముడు నరేష్‌కుమార్‌ కుటుంబం నివసిస్తోంది. వీరి భవనం వెనుకవైపున్న రూమ్‌ను జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తికి అద్దెకివ్వగా.. అతడు ఇటీవల జహీరాబాద్‌ వెళ్లాడు. మొదటి అంతస్తులోని గదులను కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌పవార్‌, సికిందర్‌, నామ్‌దేవ్‌ కుటుంబాలకు అద్దెకిచ్చారు. శ్రీనివాస్‌పవార్‌ కుటుంబం లాక్‌డౌన్‌కి ముందే గ్రామానికి వెళ్లిపోయింది. చిన్నతమ్ముడు నరేష్‌కుమార్‌ కమాండో శిక్షణలో ఉండడంతో ఆ రూంకి తాళం వేసి అతడి భార్య, పిల్లలు శనివారం పుట్టింటికి వెళ్లారు.
చుట్టుపక్కల వారి ఇళ్లకు గడియపెట్టి..
ఆదివారం తెల్లవారుజామున జ్ఞానేశ్వర్‌ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని పక్కింటి కిరాణాకొట్టు నిర్వాహకుడు గమనించి ఇంటి యజమాని శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి చెప్పాడు. ఆయన బయటికి వద్దామని ప్రయత్నించగా వారి తలుపులు బయటి నుంచి గడియపెట్టినట్లు గమనించి, రెండో తమ్ముడు సురేష్‌కుమార్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన తలుపులు కూడా బయటి నుంచి ఎవరో గడియపెట్టి ఉన్నట్లు గుర్తించి వారు సదరు కిరాణాకొట్టు నిర్వాహకుడికే చెప్పడంతో ఆయన వచ్చి గడియలు తీశాడు. చిన్న తమ్ముడి ఇంటి తాళాలు బద్దలు కొట్టి.. రెండు బీరువాల లాకర్లు పగులగొట్టి, రూ.25 లక్షలు, సుమారు 45 తులాల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, రెండు కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గమనించారు. జ్ఞానేశ్వర్‌ ఇంట్లోనూ చోరీ జరిగింది. వారు ఊళ్లో ఉండటంతో ఏం చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. శ్రీనివాస్‌ పవార్‌ ఇంట్లో కూడా చోరీ జరిగింది. రూ.లక్షతో పాటు గల్లాబుడ్డి పగులగొట్టి సుమారు రూ.30 వేల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు, పక్కింటి సికిందర్‌ చిట్‌ పాడి శ్రీనివాస్‌పవార్‌ వద్దనే దాచుకున్న రూ.4 లక్షలు అపహరణకు గురయ్యాయి. నామ్‌దేవ్‌ ఇంట్లోంచి బంగారు కమ్మలు, రూ.2 వేల నగదు చోరీకి గురయ్యాయి. సికిందర్‌ ఇంటి తాళాలను కూడా బద్దలుకొట్టారు.
పక్కనే ఉన్న ఇక్బాల్‌గంజ్‌లోనూ..
జియాగూడ వెంకటేశ్వరనగర్‌కు పక్కనే గల ఇక్బాల్‌గంజ్‌ వీధిలో కూడా దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న కె.లక్ష్మమ్మ  ఇంట్లో సుమారు ఏడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.15 వేల నగదు అపహరణకు గురయ్యాయని గుర్తించి బోరుమంది. ఇదే వీధిలో ఇడ్లీల వ్యాపారం నిర్వహించే ఇడ్లీ శ్రీనివాస్‌ ఇంట్లో కూడా దొంగలు చోరీకి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితులందరూ కుల్సుంపురా పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు క్లూస్‌, ఫింగర్‌ప్రింట్స్‌ బృందాలతో ఆధారాలు సేకరించారు. గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, కుల్సుంపురా సీఐ పి.శంకర్‌ ఘటనాస్థలిని సందర్శించి సీసీ కెమెరాల ఆధారంగా వారిని అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని