
తాజా వార్తలు
న్యాయవాద దంపతుల హత్య: హైకోర్టుకు నివేదిక
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు ఉన్నత న్యాయస్థానంలో సమర్పించారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్స్, సిమ్ కార్డులు ఎఫ్ఎస్ఎల్కి పంపించామని.. నివేదిక రావడానికి నాలుగు వారాలు పడుతుందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ కోర్టుకు తెలియజేశారు. మే 17 నాటికి న్యాయవాద దంపతుల హత్య జరిగి 90రోజులు కానుందని.. ఈలోగా సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికను తమకు ఇచ్చేలా ఆదేశించాలని వామన్‌రావు తండ్రి తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. వారి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల నివేదికపై సంతృప్తి చెందినట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని.. సకాలంలో ఛార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూడాలనేదే తమ ఉద్దేశమని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది.