ప్రేమించాడని.. నరికి చంపారు

ప్రధానాంశాలు

Updated : 29/04/2021 13:42 IST

ప్రేమించాడని.. నరికి చంపారు

ఈనాడు డిజిటల్‌-గుంటూరు, న్యూస్‌టుడే-పెదకాకాని: ప్రేమించిన పాపానికి ఓ యువకుడి ప్రాణాలు బలైపోయాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో విన్నకోట వెంకటేశ్‌(23) అనే యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు హతమార్చారు. అతడి స్నేహితుడి సహకారంతో మాట్లాడదామని గ్రామ శివారుకు రప్పించి.. కళ్లలో కారం కొట్టి, అనంతరం  కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడి తల, కాళ్లు, చేతుల మీద నరికేశారు. తీవ్రగాయాల పాలైన ఆ యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. వెంకటేశ్‌ ఓ ప్రైవేటు దంత ఆస్పత్రిలో కాంపౌండర్‌గా.. ఒక్కోసారి కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న బాలికతో వెంకటేశ్‌కు పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. నెల రోజుల క్రితం ఈ ప్రేమ వ్యవహారంపై పంచాయతీ జరిగింది. ఎవరి దారిన వారు ఉందామని అనుకున్నారు. వెంకటేశ్‌ కొన్నాళ్లుగా గ్రామానికి దూరంగానే ఉంటున్నాడు. తర్వాత తరచూ బాలికతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో బాలిక తండ్రి భాస్కరరావు, సోదరుడు తేజ, నలుగురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలిక సోదరుడితో విభేదాలే కారణమా?
హతుడు వెంకటేశ్‌, బాలిక సోదరుడు తేజకు మధ్య విభేదాలు ఈ హత్యకు దారితీశాయి. ఒకే సామాజికవర్గానికి చెందినా వెంకటేశ్‌ ప్రవర్తనను తేజ ముందునుంచి వ్యతిరేకిస్తున్నాడు. తన సోదరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్‌కు ఇవ్వరాదని తేజ భావించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సీఐ శోభన్‌బాబు చెప్పారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. వెంకటేశ్‌ మృతదేహానికి గుంటూరు సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన