Updated : 25/02/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లగ్‌లో పెడదాం.. పరుగున వెళదాం

ఈనాడు - అమరావతి

పెట్రో ధరలు మండిపోతున్నాయి. వందకు దగ్గర అవుతున్నాయి. ఇది వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. భారం అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం వాహనం అందరికీ తప్పనిసరి వస్తువుగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. నిర్వహణ వ్యయం కనిష్ఠ స్థాయిలో ఉండడంతో పాటు కాలుష్య సమస్య ఉండదు. సులభ వాయిదాల్లో అందించేందుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. వీటి వినియోగం పెరిగితే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంది.

విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నెడ్‌క్యాప్‌ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలపి అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సులభ వాయిదాల్లో అందజేయనుంది. ద్విచక్ర వాహనాల సరఫరా కోసం ఇప్పటికే సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఈఈఎస్‌ఎల్‌, ఎన్టీపీసీతో చర్చలు జరుపుతోంది. ఈ ద్విచక్ర వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఒకసారి పూర్తి ఛార్జి చేస్తే.. 80 నుంచి 100 కి.మీ నడుస్తుంది. ఫుల్‌ ఛార్జికి మూడు యూనిట్లు విద్యుత్తు వినియోగం అవుతుంది. నెలకు రూ. 2 వేలు చొప్పున 60 నెలల పాటు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు. వారి నెల జీతం నుంచే వాయిదా సొమ్ము మినహాయించనున్నారు.

జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 60,000

వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది 11,500

కాలుష్యానికి అడ్డుకట్ట

వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో వాటి నుంచి విడుదల అయ్యే కర్బన ఉద్గారాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కార్బన్‌ మోనాక్సైడ్‌, బెంజీన్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, సీసం, తదితర వాయివులు కలుస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం చూస్తే.. జెజవాడ నగరంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ఆందోళనకర స్థాయిలో విడుదల అవుతోంది. ఇది గాలిలో 2 శాతం ఉంటోంది. గాలిలో ధూళి కణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్య కూడళ్లలో పీఎం 10 ప్రమాణాలు (సూక్ష్మ ధూళి కణాలు) వందకు 95 వరకు నమోదవుతున్నాయి. పీఎం 2.5 (అతి సూక్ష్మ ధూళి కణాలు) గణాంకాలు కూడా ఇదే రీతిలో ఉంటున్నాయి. గాలిలో సన్నటి ధూళిని ఈ ప్రమాణం సూచిస్తుంది. ఇది 60కు 58 వరకు ఉంటోంది. వాహన రద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ గణాంకాలు పరిమితిని దాటి నమోదవుతున్నాయి.

* ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగం పెరిగితే కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్యం శూన్యమే. దీంతో పాటు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం పెట్రోలు ధర ప్రస్తుతం లీటరుకు విజయవాడలో రూ. 96.70 ఉంది. పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనానికి కిలోమీటరుకు రూ. 2 అవుతుంది. అదే.. విద్యుత్తు బైక్‌కు అయ్యేది 25 పైసలు కంటే తక్కువే. కేవలం 4 యాంప్‌ సాకెట్‌ ఉంటే ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకోవచ్ఛు ప్రభుత్వ ఉద్యోగులు వాడినా కాలుష్యం బాగా తగ్గుతుంది. ఈ తరహా బండ్లకు ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా రానున్నాయి. జిల్లాలో దాదాపు 50 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల వెంబడి కూడా ఏర్పాటు కానున్నాయి.

సవాళ్లు అధిగమిస్తేనే..

ఎలక్ట్రిక్‌ బైక్‌లతో ప్రయోజనాలు చాలా ఉన్నా.. ఇవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే సవాళ్లను కూడా అధిగమిస్తేనే ఫలితాలు అందరికీ దక్కుతాయి.ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం రాయితీ ఇస్తే చాలా మంది ముందుకు వస్తారు. దూరప్రాంతాలకు విద్యుత్తు బైక్‌లపై వెళ్లేవారికి, అవసరమైన చోట ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా అందుబాటులో ఉండాలి. లేనిపక్షంలో వాహనదారులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.


పెరిగిన వాహనాలు..

టీవల కాలంలో వాహనాలు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. పల్లె నుంచి నగరం వరకు ఇబ్బడిముబ్బడిగా వాహనాలు పెరిగాయి. సులభమైన వాయిదా పద్ధతుల్లో తీసుకునే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఫలితంగా రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ఇంధనంతో నడిచే వాటి కారణంగా కాలుష్యం కూడా పెరుగుతోంది. కాలం చెల్లిన వాటిని కూడా భారీగా వాడుతున్నారు. ఈ వాహనాల నుంచి విడుదల అయ్యే పొగలో నల్లటి ధూళి కణాలు ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో మొత్తం 16.88 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో రవాణా వాహనాలు 2.38 లక్షలు, రవాణేతర.. 14.49 లక్షలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కువగా విజయవాడ పరిధిలోనే తిరుగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని