Updated : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మామిడి కోత మిగిల్చిన విషాదం

కాల్వలో పడి ఇద్దరి దుర్మరణం

పొలగాని వేణు, కందుల శ్రీనివాసరావు (పాతచిత్రాలు)

రెడ్డిగూడెం, నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వారివి. సీజన్‌ రావడంతో మామిడి కాయల కోతకు వెళ్లారు. కోత పూర్తయి భోజనాలు చేసే ముందు కాళ్లు, చేతులు కడుక్కునేందుకు డ్రిప్‌ పైపు సాయంతో నూజివీడు బ్రాంచి కెనాల్‌లో దిగారు. పైపు తెగిపోవడంతో క్షణాల్లోనే కాల్వలో కొట్టుకుపోయిన ఇద్దరు విగతజీవులయ్యారు. ఎన్‌ఎస్‌పీ నూజివీడు బ్రాంచి కాల్వలో రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ పంచాయతీ పరిధిలో అడవికొత్తూరు గ్రామ సమీపంలో ఆదివారం నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మిట్టగూడెం గ్రామానికి చెందిన పోలగాని వేణు(24), కందుల వాసు(16) మరో 20 మంది కూలీలు మామిడి కాయలు కోతలకు వచ్చారు. భోజనాలు చేసే సమయంలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి తోట పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌పీ కాల్వలో జిల్లేడు చెట్టుకు డ్రిప్‌ పైపు కట్టి దాని సహాయంతో దిగారు. ఆది తెగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వాళ్లను కాపాడటానికి మేస్త్రీ, మరొకరు దిగినా ఫలితం లేకపోయింది. చివరికి వారిని సైతం గెడ అందించి బయటకు లాగాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. రెడ్డిగూడెం ఎస్‌ఐ, సిబ్బంది, కూలీలు కలిసి కాల్వలో నీటి ప్రవాహం తగ్గించడానికి రెడ్డిగూడెం కోతుల వాగు వద్దనున్న ఎస్కేఫ్‌ షట్టరు పైకి లేపి నీటిని కోతుల వాగులోకి మళ్లించారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు సైతం కొంత నీటిని జమలాపురం మేజర్‌కు మళ్లించారు. మిట్టగూడెం సర్పంచి కొనకాల నరసింహారావు, గ్రామస్థులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. గ్రామస్థులు నీటిలోకి దిగి గాలించగా వాసు మృతదేహం లభించింది. నాలుగు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన వేణు మృతదేహాన్ని గోపాలపురం వంతెన సమీపంలో రెడ్డిగూడెం ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ దిగి తీశారు.

పెళ్లైన ఏడాదిలోనే...

ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరూ మిట్టగూడెం వాసులు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలగాని వేణుకు సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మితో వివాహమైంది. ట్రాక్టరు డ్రైవరుగా పని చేస్తూనే మామిడి కాయల కోతకు వెళ్లాడు. ఏడాది తిరగకుండానే మృతి చెందడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆగిరిపల్లి మండలంలోని నూగొండపల్లికి చెందిన బాలుడు కందుల శ్రీనివాసరావు మిట్టగూడెంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. నూజివీడులోని కుమార్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యం, ఆదివారం సెలవు దినం కావడంతో చేతి ఖర్చులకు నగదు ఉంటుందని మామిడి కాయల కోతకు వెళ్లి కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని