కొవిడ్‌ తెచ్చిన కష్టం!
logo
Published : 13/06/2021 03:38 IST

కొవిడ్‌ తెచ్చిన కష్టం!


భార్య మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే: భార్య కొవిడ్‌తో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు సహకరించకపోవడంతో భర్త గంటల పాటు నిరీక్షించి ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం నందిగామ ఎస్సీ కాలనీకి చెందిన రెంటపాళ్ల జయప్రద (52) ఐదు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు పరీక్ష నిర్వహించగా శుక్రవారం కొవిడ్‌ నిర్ధారణ అయింది. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఆమెను భర్త ప్రసాదరావు సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసింది. ఆటోలో మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురాగా బంధువులు అడ్డుచెప్పారు. కరోనాతో చనిపోయిన నేపథ్యంలో వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని, నేరుగా శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించాలని సూచించారు. ఈమేరకు ఆయన క్రైస్తవ శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. సమాధి తవ్వడానికి బంధువులు సుముఖత చూపలేదు. ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం లేకపోవడంతో ఎలా సమాధి చేయాలని వారు ప్రశ్నించారు. గుంత తీయడానికి ప్రసాదరావు సిద్ధమైనా.. మృతదేహాన్ని పూడ్చేటప్పుడు కనీసం నలుగురు కావాలని ఆ చర్యను ఉపసంహరించుకున్నారు. కుమారుడు, పెద్ద కుమార్తె వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం, చిన్న కుమార్తె దివ్యాంగురాలు కావడంతో సాయం చేసేందుకు రాలేకపోయారు. భార్య మృతదేహంతో శ్మశానవాటిక ద్వారం వద్ద సుమారు మూడు గంటల పాటు నిరీక్షించారు. బంధువుల సూచనతో సత్తెనపల్లికి చెందిన వావిలాల ప్రజ్వలన సంస్థ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు జయప్రద మృతదేహాన్ని సంచిలో పెట్టి సత్తెనపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో పెడుతున్న వావిలాల ప్రజ్వలన సంస్థ సభ్యులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని