మూడో ఏడాదే ముచ్చటైన కొలువు
eenadu telugu news
Published : 27/07/2021 04:52 IST

మూడో ఏడాదే ముచ్చటైన కొలువు

ఈటీవీ-గుంటూరు

హేమస్పందన

దువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు రావటం పాత ట్రెండ్‌. కోర్సు చివర్లో ఉండగా క్యాంపస్‌ ఇంటర్వూల్లో ఎంపికవ్వడం ప్రస్తుత విధానం. గుంటూరులోని నల్లపాడుకు చెందిన శిరసాని హేమస్పందన ట్రెండ్‌ను అందిపుచ్చుకుంది. ఇంజనీరింగ్‌ మూడో ఏడాది చదువుతుండగానే ఏడాదికి దాదాపు రూ 19.34 లక్షల ప్యాకేజీతో కొలువు సాధించటం ప్రతిభకు నిదర్శనం. ఆమె పలకలూరులోని విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బి.టెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవలే లోవెస్‌ ఇండియా అనే బహుళజాతి సంస్థలో ఉద్యోగానికి ఎంపికైంది. నెలకు లక్షా 61 వేల రూపాయల జీతం ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు నియామకపత్రాన్ని పంపించింది. సాధారణంగా ఇంజనీరింగ్‌ పూర్తయిన వారికి ప్రతిభ ఆధారంగా కంపెనీలు భారీ వేతనాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. కానీ మూడో ఏడాది పూర్తి కాకుండానే ౉ఇంతటి భారీ ఆఫర్‌ రావటం విశేషం. ఉద్యోగంలో చేరేందుకు ఇంకో ఏడాది సమయం ఉంది. అప్పటికి తన నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుంటానని హేమస్పందన చెబుతోంది. పదో తరగతి వరకూ సెయింట్‌ జోసఫ్‌ స్కూల్లో చదివారు. ఎస్సెస్సీలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్‌ శ్రీ చైతన్యలో 980 మార్కులతో పూర్తిచేశారు. కేవలం చదువుతో సరిపెట్టకుండా ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలపైనా దృష్టి సారించానని, సాంకేతిక అంశాలపై పట్టు సాధించానని హేమ స్పందన చెప్పారు. కరోనా కారంగాణా ఏడాదికి పైగా తరగతులు జరగటం లేదు. దొరికిన ఖాళీ సమయాన్ని సాంకేతిక అంశాలపై పట్టు సాధించేందుకు ఉపయోగించుకున్నానన్నారు. ప్రధానంగా కోడింగ్‌ కోసం ఎక్కువగా సమయం కేటాయించినట్లు చెప్పారు. ఐదు కంపెనీల్లో ఇంటర్వ్యూ నెగ్గాను. అందులో అమెరికన్‌ కంపెనీ లోవెస్‌ ఇండియాకు పచ్చజెండా ఊపానన్నారు ‘ఎప్పుడైనా పరీక్షల్లో సరైన మార్కులు రాకపోతే అమ్మ వెన్నుతట్టి ప్రోత్సహించేది. మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లేదాన్ని. ప్రతి పనిని అత్యుత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తాను’ అన్నారు హేమ. చదువుతుండగా భారీ ప్యాకేజీ రావడం అరుదని నిరులా కళాశాల ప్రిన్సిపల్‌ పి.రాధిక అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని