ముద్రణకు ఆపసోపాలు
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

ముద్రణకు ఆపసోపాలు

ఈనాడు - అమరావతి

పెద్ద సంఖ్యలో ఆగిన కార్డులను ముద్రించేందుకు జిల్లాలోని రవాణా కార్యాలయాల్లో సిబ్బంది నానా తిప్పలు పడుతున్నారు. కార్డులు సరఫరా అవుతుండడంతో గతేడాది ఆగిన పనులు నెలన్నర క్రితం తిరిగి మొదలయ్యాయి. జిల్లాలో రోజుకు దాదాపు 400 డీఎల్‌, ఆర్సీలు జారీ అవుతుంటాయి. వీటిలో 250 వరకు డ్రైవింగ్‌ లైసెన్సులు, 150 వాహన ఆర్సీలు ఉంటాయి. వీటిని కార్డుల రూపంలో ముద్రించి వాహనదారులకు పంపిస్తుంటారు. వీటి కొరత కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి ముద్రణ నిలిచిపోయింది. వీటిని సరఫరా చేయాల్సిన గుత్తేదారుకి గడువు ముగియడంతో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల సరఫరా బాధ్యతను పాత గుత్తేదారుకు అప్పగించారు. దీంతో దశల వారీగా వీటి సరఫరా ప్రారంభమైంది. ఆర్సీలు, డీఎల్‌, ఎల్‌ఎల్‌ఆర్‌, వాహనాల బదిలీలు, చిరునామాల మార్పు, రెన్యువల్‌ తదితర అంశాలకు సంబంధించి కార్డుల ముద్రణ మొదలైంది. పెండింగ్‌లో ఉన్నవి మొత్తం వాహనదారులకు అందాలంటే మరో నెల పడుతుందని అంచనా వేస్తున్నారు.

● జిల్లా వ్యాప్తంగా ఆర్సీలు 1,15,034, డ్రైవింగ్‌ లైసెన్సులు 85,638 చొప్పున మొత్తం 2,00,672 కార్డులు గతేడాది సెప్టెంబరు నుంచి పెరడింగ్‌లో ఉన్నాయి. వీటి ముద్రణ ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 1.21 లక్షల కార్డుల ముద్రణ పూర్తయింది. పూర్తి అయిన వాటిని వాహనదారులకు పోస్టులో పంపిస్తున్నారు. వీటిని జిల్లాలోని ఎనిమిది రవాణా కార్యాలయాల్లో ముద్రిస్తున్నారు. వాహనదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు విడతల్లో పని చేస్తున్నారు. ఉన్న 14 యంత్రాల్లో నాలుగు మూలపడ్డాయి. దీంతో పదింటినే ఉపయోగించుకుంటున్నారు. వీటిపై రోజుకు 5వేల నుంచి 6వేల వరకు ప్రింట్‌ చేస్తున్నారు. ఇప్పటికి జగ్గయ్యపేట, నందిగామ కార్యాలయాల్లో పెండింగ్‌ పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల జనవరి నెలలో జారీ చేసిన వాటిని ముద్రిస్తున్నారు.

● కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న ఏప్రిల్‌లో జారీ తక్కువగా ఉంది. మే నెలలో లావాదేవీలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇంకా మిగిలిన 80వేల కార్డులను మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జూన్‌ నుంచి జారీ అవుతున్న పత్రాలకు సంబంధించిన వాటిని ప్రస్తుతం ఇవ్వడం లేదు. పెండింగ్‌ అంతా అయిన తర్వాత, వీటిని చేపట్టనున్నారు. త్వరలో ఈ ప్రక్రియలో మార్పు, చేర్పులు చేసుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. కార్డులు ముద్రించి, దరఖాస్తులకు పంపే పనిని ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉంది. ఇది ఆమోదం పొందితే సంబంధిత గుత్తేదారు కార్డులను ముద్రించి, వాహనదారుల చిరునామాలకు పంపించాల్సి ఉంటుంది. దీని వల్ల రవాణా శాఖ అధికారులపై ఈ భారం తప్పుతుందని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని