బస్సుల్లో ఓఆర్‌ పెంపుపై దృష్టి
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

బస్సుల్లో ఓఆర్‌ పెంపుపై దృష్టి

ఈనాడు - అమరావతి

కొవిడ్‌ ప్రభావం ఆర్టీసీపై ఎక్కువగా ఉంది. దీని వల్ల ఓఆర్‌ పడిపోయింది. ముఖ్యంగా సిటీ సర్వీసులపై అధికంగా ఉంది. విజయవాడలోని ఆరు డిపోల పరిధిలో మొత్తం 425 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, జనజీవనం పుంజుకుంటున్నా.. ఓఆర్‌లో పెరుగుదల నమోదు కావడం లేదు. శ్రావణ మాసం ప్రారంభంలో 60 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత.. క్రమేపీ తగ్గుతూ 55 శాతం వద్ద నిలకడగా ఉంది. ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. కొవిడ్‌కు ముందు ఓఆర్‌ 63 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం నగరంలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  ఈ నేపథ్యంలో పూర్వ స్థితికి ఓఆర్‌ను తీసుకెళ్లడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు ప్రారంభించారు.

గుర్తించిన ప్రాంతాల్లో ..
ప్రస్తుతం సిటీ సర్వీసుల్లో 95 శాతం పైగా పునరుద్ధరించారు. విద్యాసంస్థలు కూడా చాలా వరకు నడుస్తున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు దృష్టిపెట్టారు. రద్దీగా ఉండే బెంజి సర్కిల్‌, రామవరప్పాడు కూడలి, చల్లపల్లి బంగ్లా, కేఆర్‌ మార్కెట్‌, ఇబ్రహీంపట్నం, గన్నవరం, తదితర 10 ప్రాంతాల్లో సూపర్‌వైజర్లకు బాధ్యతలు అప్పగించారు. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను బస్సుల్లోకి ఎక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రద్దీ సమయాలైన ఉదయం 8 నుంచి 10.30, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు విధుల్లో ఉంటారు.

సమయపాలన పాటించేలా..
సిటీ బస్టాపుల వద్ద ఆటోల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని వల్ల బస్సులు సకాలంలో రాకపోతే ఆటోలు ఎక్కుతున్నారు. దీనిని నివారించేందుకు సమయపాలనపై దృష్టి సారించారు. బస్టాపుల వద్ద ఆటోలు ఆగకుండా చూస్తున్నారు.  ఒకే మార్గంలోని బస్సులు అన్నీ ఒకేసారి వస్తుండడం లోపంగా గుర్తించి, సరిచేసేందుకు  కసరత్తు చేస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తే కనీసం 5 శాతం అయినా ఓఆర్‌ పెôచుకోవచ్చని ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ మేనేజరు ఎంవై దానం చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని