డయల్‌ యువర్‌ ఎస్పీలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

డయల్‌ యువర్‌ ఎస్పీలో వెల్లువెత్తిన ఫిర్యాదులు

ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : బుధవారం జరిగిన ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి అందిన వినతుల పరిష్కారానికి రూరల్‌ ఎస్పీ అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అందిన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి..

తెనాలి నుంచి ఓ గృహిణి మాట్లాడుతూ తన తండ్రి చిన్నతనంలోనే చనిపోతే బాబాయి వాళ్లు తమ ముగ్గురు అక్కచెల్లెళ్లను పెంచి పెద్దచేశారన్నారు. తనకు ఏడాది కిందట వివాహమైందని, అత్తింటి వాళ్లు మూడు నెలలు బాగా చూసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత తన మరిదికి వివాహం చేయగా, అతనికి అమ్మాయి వాళ్లు రూ.25 లక్షలు కట్నం ఇచ్చారని, అప్పటి నుంచి తనను కూడా అధిక కట్నం రూ.25 లక్షలు తీసుకు రమ్మని వేధిస్తున్నారని వాపోయింది. ఆరు నెలలు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారని వాపోయింది. తన భర్తకు వేరే వివాహం చేయాలని చూస్తున్నారని తెలిపింది. తనకు రూ.లక్ష ఎదురు ఇస్తాం, విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎస్పీ వెంటనే తెనాలి డీఎస్పీ, సీఐలతో మాట్లాడి అధిక కట్నం వేధింపులపై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు.

దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తనకు పిల్లను ఇచ్చిన మామ అవసరాలకు అని తన వద్ద రూ.13 లక్షలు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే తనపై భార్య చేత కేసు పెట్టించాడని తెలిపాడు. స్పందించిన ఎస్పీ అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడితే వాళ్లు కూడా తమ విచారణలో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో ఎస్పీ వెంటనే ఆ తప్పుడు కేసును ఎత్తివేసి తిరిగి అతని మామయ్యపై 420 కేసు నమోదు చేయాలన్నారు. బాధితుడిని తన వద్ద ఉన్న ఆధారాలను సీఐకి ఇవ్వాలన్నారు.

అంగలకుదురుకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తాను ఓ బ్యాంకులో ఎనిమిది సంవత్సరాలుగా స్వీపర్‌గా పనిచేస్తుంటే తనకు చదువు రాదని ఇటీవల ఉద్యోగం నుంచి తీసివేశారని వాపోయింది. ఎలా బతకాలని అడిగితే దుర్భాషలాడారని ఆవేదన చెందింది. ఈ విషయమై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంది. స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైతో మాట్లాడారు. ఆ బ్యాంకు వాళ్లు చదువుకున్న వారిని మాత్రమే పనిలో పెట్టుకోవాలనే కొత్తగా నిబంధనలు పెట్టారని, దీంతో ఆమె పిల్లలు చదువుకుంటే వారికి ఉద్యోగం ఇస్తానన్నారు కాని ఆమె పిల్లలు చదువుకోలేదని తెలిపారు. ఈ విషయమై తెనాలి డీఎస్పీ, సీఐలు వెంటనే ఆ బ్యాంకు వాళ్లతో మాట్లాడి ఆమెకు మానవతా దృక్పథంలో ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.

అమరావతికి చెందిన ఓ మహిళ ఫోన్‌ చేసి తన తల్లి వద్ద అదే ప్రాంత వ్యక్తి రూ.7.50 లక్షలు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయింది. ఎస్పీ వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెనాలికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ రూరల్‌ పరిధిలో పనిచేసే ఓ ఎస్సై తన కుమార్తెను వివాహం చేసుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. కోర్టులో కేసు వేస్తే రాజీకి వచ్చి భరణం కింద ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని వాపోయింది. స్పందించిన ఎస్పీ ఇప్పటికే ఆ ఎస్సైపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అతనిపై వెంటనే ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని డీఎస్పీని ఆదేశించారు.

తుళ్లూరుకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తనకు చెందిన ఆస్తిని బాబాయి రాయించుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. దీనిపై ఎస్పీ వాస్తవాలు పరిశీలించి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

తాడేపల్లికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తన కారును అద్దెకు తీసుకున్న వ్యక్తి రెండు నెలలు డబ్బులు కట్టి ఆ తర్వాత కారుతో సహా ఉడాయించాడని తెలిపారు. దీనిపై ఎస్పీ విషయం అర్బన్‌ పరిధిలోది కాబట్టి అక్కడి పోలీసులకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

గుంటూరుకు చెందిన యువకుడు మాట్లాడుతూ తాను సీఏ చివరి సంవత్సరం చదువుతున్నానని, అరండల్‌పేటలో రాత్రి 10 గంటలకు రీడింగ్‌రూమ్‌లు పోలీసులు మూసి వేయించడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్నదని సమయాన్ని పొడిగించాలని కోరారు. దీనిపై అర్బన్‌ ఎస్పీతో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ 2019లో ద్విచక్రవాహనం ఫైనాన్స్‌లో కొనుగోలు చేశానని, ఒక కిస్తీ కట్టడం ఆలస్యమైందని.. వాహనం తీసుకు వెళ్లారు కొంత గడువు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎస్పీ అక్కడి పోలీసులతో మాట్లాడి సహాయం చేయాలని సూచిస్తామన్నారు.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ఓ వ్యక్తి తన వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకొని ఇవ్వకుండా గుంటూరు జిల్లా అమరావతికి మకాం మార్చాడని వాపోయింది. స్పందించిన ఎస్పీ వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అతన్ని పట్టుకొని బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని