వైకాపా..విజయ పంకారావం 
eenadu telugu news
Updated : 20/09/2021 06:52 IST

వైకాపా..విజయ పంకారావం 

 ప్రాదేశికంలో ఏకపక్ష విజయం

  తెదేపా, జనసేన, ఇతరులకు కొన్ని..

రాజమహేంద్రవరం గ్రామీణం: బొమ్మురు న్యాక్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు

ఈనాడు - కాకినాడ, ఈనాడు డిజిటల్‌  -రాజమహేంద్రవరం, కలెక్టరేట్, తుని పట్టణం, రంపచోడవరం, ఎటపాక, సామర్లకోట :  పరిషత్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ జోరు కనిపించింది. అధికార పక్షం వైపే గెలుపు గాలి వీచి విజయం ఏకపక్షమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అధికం వైకాపా అభ్యర్థులకే దక్కాయి. దీంతో ఆయా శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో అధికార పార్టీకే సింహభాగం ఫలితాలు దరి చేరాయి. మొత్తం 1,086 ఎంపీటీసీల్లో 82 ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఏకగ్రీవాల్లో అగ్రపథంలో నిలిచిన వైకాపా.. ఫలితాల్లోనూ ముందంజలో ఉంటూ జిల్లా పరిషత్తు పీఠాన్ని పదిలం చేసుకుంది.

మారిన సమీకరణాలు..: తెదేపా అధిష్ఠానం ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ముందే ప్రకటించింది. దీంతో శ్రేణులు, ముఖ్యనాయకులు దూరంగా ఉన్నారు. అయితే.. అప్పటికే రంగంలోకి దిగి గెలుపుపై నమ్మకంతో ఉన్న కొందరు బరిలో నిలిచారు. మిగిలినవారు ప్రచారం చేయలేదు. ఈ అంశం అధికార పక్షానికి, జనసేనకు కలిసొచ్చింది. జనసేనకు కొన్నిచోట్ల తెదేపా పరోక్ష సహకారంతో గత ఎన్నికల్లో కంటే బలం పెరిగింది. కొన్నిచోట్ల ఇతర పార్టీలకు, స్వతంత్రులకు కలిసొచ్చింది.

జనసేన జోష్‌: మంత్రి విశ్వరూప్‌ ప్రాతినిధ్య అమలాపురం పరిధిలో చిందాడగరువు, ఎ.వేమవరం, ఇందుపల్లి, జనుపలి,

 భీమనపల్లి- 2, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం-2, అల్లవరం-1

మంత్రి వేణు ప్రాతినిధ్య రామచంద్రపురం పరిధిలో మతుకుమిల్లి, ఉప్పుమిల్లి, పెనుమల్ల, కాజులూరు-1, 2, తోటపేట, సత్యవాడ, ఏరుపల్లి, ఊడివ΄డి, వెల్ల-1, 2

 మంత్రి కన్నబాబు ప్రాతినిధ్య కాకినాడ గ్రామీణంలో సూర్యారావుపేట-1,2, పండూరు, సిరిపురం స్థానాలు జనసేన దక్కించుకుంది. 

అధికారుల పర్యవేక్షణ..:  స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవడం, ఓట్ల లెక్కింపు.. సిబ్బంది విధులను ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించారు. కాకినాడలో రంగరాయ, జీపీటీ, సామర్లకోట వైటీసీ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును పరిశీలకులు హరిజవహర్‌లాల్, కలెక్టర్‌ 
సి.హరికిరణ్, జేసీ కీర్తి, కమిషనర్‌ స్వప్నిల్‌ సందర్శించారు. అమలాపురంలో జేసీ లక్ష్మీశ, రంపచోడవరంలో అభిషిక్త్‌ కిశోర్, రామచంద్రపురంలో జేసీ భార్గవ్‌ తేజ, ఆర్డీవో సింధూ సుబ్రహ్మణ్యం, రంపచోడవరంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య పరిశీలించారు. కాకినాడలో కేంద్రాలను ఎస్పీ ఎం.రవీంద్రబాబు, రాజమహేంద్రవరంలో అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పరిశీలించారు.

పరిషత్‌ ఫలితాల వెల్లడి ఓటర్లను, రాజకీయ శ్రేణులను ఊరించింది. ఇతర జిల్లాల్లో ఫలితాలు త్వరగా వచ్చినా.. తూర్పున జాప్యం చోటుచేసుకుంది. ఏడు రెవెన్యూ డివిజన్లలో ఉదయం 7.30 గంటలకే శ్రీకారం చుట్టినా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్లు వేరుచేయడం.. ప్రాథమికంగా లెక్కించి కట్టలు కట్టడంలో జాప్యం జరిగింది. ఫలితాల వెల్లడి ఆదివారం మధ్యాహ్నం నుంచి మొదలైంది. 

పరిషత్తు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. డివిజన్‌ కేంద్రాల్లోని 12 చోట్ల నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కంట్రోల్‌ రూంలో వెబ్‌ కాస్టింగ్‌ ప్రత్యక్ష ప్రసారం చేశారు. డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీపీవో నాగేశ్వరనాయక్, తదితరులు క్షేత్రసాయి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. సమస్యలు నెలకొన్నచోట్ల అప్పటికప్పుడు సూచనలు చేశారు. 

దంపతుల జయభేరి

జగ్గంపేట గ్రామీణం:  జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన అత్తులూరి నాగబాబు మండలంలోని కాండ్రేగుల ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి 1,530 ఓట్లు, అతని భార్య నాగరత్నం మల్లిసాల -1 స్థానం నుంచి పోటీ చేసి 934 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.  

అమ్మ ఆశీస్సులకు నోచుకోలేక..

కాట్రేనికోన: కుండలేశ్వరం-నడవపల్లి ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరఫున పోటీచేసిన అక్కల శ్రీధర్‌ 163 ఓట్లతో విజయం సాధించారు. శనివారం రాత్రి ఆయన తల్లి వరలక్ష్మి అనారోగ్యంతో చికిత్సపొందుతూ మృతిచెందారు. దాంతో ఎన్నికల్లో గెలిచాననే ఆనందం కన్నా.. ఆశీర్వదించేందుకు అమ్మ లేదని ఆయన బాధలో ఉన్నారు.

మనసులు గెలిచినా.. మరి లేరాయే

వీఆర్‌పురం: చినమట్టపల్లిలో కారం శిరవయ్య (సీపీఎం) 82 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ః తుని గ్రామీణం: రేఖవానిపాలెంలో నడిగెట్ల సూరిబాబు (తెదేపా) 33 ఆధిక్యంతో గెలిచారు.ః ద్రాక్షారామ: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు టి.గోవిందరాజు (వైకాపా) 1,497 మెజార్టీతో గెలిచారు. అయితే వీరు ముగ్గురూ ఇటీవల కరోనాతో చనిపోవడం బాధాకరం.

వీడని పీఠముడి!

వరరామచంద్రాపురం: మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో.. వ΄డు తెదేపా, వ΄డు వైకాపా, ఒకటి సీపీఎం దక్కించుకున్నాయి. సీపీఎం తరఫున గెలిచిన అభ్యర్థి కారం శిరమయ్య రెండు నెలల కిందట కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. దీంతో ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీల బలాలు సమం కాగా పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

1 గొల్లప్రోలు: కొడవలి గ్రామ ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి బద్దా భగవాన్‌ ఒక్క ఓటు ఆధిక్యతతో విజయం సాధించారు. వైకాపా రెబల్‌గా బరిలోకి దిగిన స్వతంత్య్ర అభ్యర్థి కాకర సతీష్‌ కుమార్‌పై ఆధిక్యత సాధించారు. 

2 రాజవొమ్మంగి: దూసరపాము అభ్యర్థి నల్లా సత్యనారాయణకు (తెదేపా) 553 ఓట్లు రాగా, కె.పరంజ్యోతి రాజుకు (వైకాపా) 552 వచ్చాయి. పునః లెక్కింపులోనూ అదే ఫలితం.వచ్చింది.

3 ప్రత్తిపాడు: ఏలూరు-1లో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాణి 3 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. తొలుత తెదేపా అభ్యర్థిని 4 ఓట్ల ఆధిక్యంతో గెలవగా.. మళ్లీ లెక్కించగా ఫలితం మారింది.

4 కరప: మండలంలో సిరిపురం స్థానంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కత్తుల ధనలక్ష్మి 4 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

5 గోకవరం:  కామరాజుపేట-1  నుంచి తెదేపా అభ్యర్థిని ఎ.సుహాసిని 5 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.మళ్లీ రీకౌంటింగ్‌ చేసినా అదే ఆధిక్యత లభించింది. సుహాసినికి 1,129 ఓట్లు దక్కాయి.

గండేపల్లి:  తాళ్లూరులో వైకాపా అభ్యర్థి చెల్లూరి రాంబాబు ఆరు ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. రాంబాబుకు 1,320 ఓట్లు, తెదేపా అభ్యర్థి శివరామకృష్ణకు 1,314 ఓట్లు పోలయ్యాయి.

6  మారేడుమిల్లి: మారేడుమిల్లి ఎంపీటీసీ వైకాపా అభ్యర్థి లొక్కండ రవికుమార్‌ తెదేపా అభ్యర్థి మట్ల రాజులమ్మపై ఆరు  ఓట్లు తేడాతో గెలిచారు. కాగా రవికుమార్‌కు మొత్తం 531 ఓట్లు వచ్చాయి. 

కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలిస్తున్న  డా.ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, ఎస్పీ  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని