కరోనా ఔషధాలు... ఇంజక్షన్ల కొరత!
logo
Published : 17/05/2021 05:56 IST

కరోనా ఔషధాలు... ఇంజక్షన్ల కొరత!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదీ పరిస్థితి

జిల్లాలో కరోనా రోగులకు అవసరమైన మందులు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభ్యం కావడం లేదు. కొన్ని మందులు బయట కొనుగోలు చేసుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు. ఔషధాల నుంచి ఇంజక్షన్ల వరకు కొరతగా ఉన్నాయి. ఇటీవల నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి ఓ రోగి వచ్చారు. అతన్ని పరీక్షించడానికి పీపీఈ కిట్లు లేకపోవడంతో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కనీసం ముట్టుకోలేదు. తీవ్ర అనారోగ్యం పాలైన అతను ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారు. ఒక్క పీపీఈ కిట్లే కాదు ఔషధాలదీ అదే పరిస్థితి. కరోనా బారినపడిన వారు ఉదయం, రాత్రి కలిపి 12 నుంచి 15 ఔషధాలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్‌ సమస్యలు రాకుండా పరగడుపున పాంటాప్రొజోల్‌ టాబ్లెట్‌ ఒకటి వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అది కూడా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో లేదు.

ఈనాడు, అమరావతి : గుంటూరు జీజీహెచ్‌ సహా జ్వరాల ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, నరసరావుపేట, బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రుల్లో కరోనా వ్యాధిగ్రస్థులకు ఇన్‌పేషెంట్‌ వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రులు మొదలుకుని పీహెచ్‌సీల వరకు కరోనా మందులు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి పంపిణీ అవుతాయి. కీలకమైన డ్రగ్‌ స్టోర్స్‌లోనే ఆయా మందులు లేకపోవడంతో ఆస్పత్రుల్లో తామేం చేయలేమని, వాటిని బయట మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సిందేనని వైద్యులు అంటున్నారు. మొత్తంగా అనేకచోట్ల మందుల కొరత నెలకొంది. చాలా మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందడం లేదు. ఈ విషయాన్ని బాధితులే వైద్య, ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్తున్నారు. జిల్లాలో ఇటీవల హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వైరస్‌ బాధితులకు నిత్యం ఫోన్లు చేసి వారు మందులు వేసుకుంటున్నారా లేదా? ప్రభుత్వం అందజేస్తున్న మందుల కిట్‌ అందిందా లేదా అనే వివరాలను తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో మరో 15 మంది సూపర్‌వైజర్లు ఒక్కొక్కరూ నిత్యం 150 మంది రోగులకు ఫోన్లు చేసి ఈ వివరాలను రాబడుతున్నారు. చాలా మంది మందుల కిట్లు అందలేదని చెబుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదే విషయమై వైద్య, ఆరోగ్య సిబ్బందిని ప్రశ్నిస్తే తాము ఫోన్లు చేసి ఆరా తీస్తుంటే కొందరు కిట్లు అందలేదని, మరికొందరు అన్ని మందులు ఇవ్వడం లేదని చెబుతున్నమాట వాస్తవమేనని ధ్రువీకరించారు. గుంటూరు జీజీహెచ్‌లో పీపీఈ కిట్ల కొరత లేదని, కావాల్సిన మందుల వివరాలు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు అందజేశామని చెప్పారు. ప్రతి రోజూ మందుల కొరత వివరాలను తెలియజేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్‌కుమార్‌ జీజీహెచ్‌ అధికారులను ఆదేశించడంతో నిత్యం ఈ వివరాలు ఆయనకు తెలియజేస్తున్నామని జీజీహెచ్‌ వర్గాలు పేర్కొన్నాయి. నరసరావుపేటలో పల్నాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పీపీఈ కిట్లు కొరతగా ఉన్నాయని బహిరంగంగానే అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రోగులను లింగంగుంటలోని కొత్త ఆసుపత్రికి తరలించటంతో మందులు, పీపీఈ కిట్లు కొత్త ఆసుపత్రికి సరఫరా చేస్తున్నామని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు అంటున్నారు. కానీ పల్నాడు రోడ్డులోని ఆసుపత్రిలో కూడా సేవలు అందిస్తున్నా పీపీఈ కిట్లు సరఫరా చేయడం లేదని, దీంతో రోగులను పరీక్షించాలంటేనే భయమేస్తోందని వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఇంచుమించుగా ప్రతి ఆస్పత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది.

రోగులు కోలుకునేదెలా

వైరస్‌ తీవ్రత బాగా ఉన్నవారికి హెఫారిన్‌, రెమ్‌డెసివిర్‌, స్టెరాయిడ్స్‌ వంటివి వాడితే త్వరగా కోలుకుంటారని వైద్యులు వాటిని సూచిస్తున్నారు. అయితే సర్కారీ దవాఖానాల్లో సైతం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు లభ్యం కావడం లేదు. అవి వచ్చే వరకు వేచి ఉండాలని, అత్యవసరం అనుకుంటే వ్యాధిగ్రస్థులనే కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారని రోగులు గుర్తు చేస్తున్నారు. ఆ ఇంజక్షనే కాదు ఎనక్స్‌పారిన్‌ సూది మందుకు కొరతగా ఉంది. వీటిని రోగి శరీరంలోకి 100 ఎంఎల్‌ సెలైన్‌ ద్వారా ఎక్కిస్తారు. ఆ సెలైన్లు లేక ఇటీవల తెనాలి జిల్లా ఆస్పత్రిలో రోగులనే కొనుగోలు చేసి తీసుకొస్తే మందు ఎక్కిస్తామని సూచించారు. ఒకవైపు ఔషధాలు మరోవైపు ఇంజక్షన్ల కొరతను అధిగమిస్తే కరోనా కష్టకాలంలో రోగుల జేబుకు చిల్లుపడకుండా ఉంటుంది. ఆస్పత్రుల్లోనే పూర్తి స్థాయిలో మందులు లభ్యం కాని పరిస్థితి ఉంటే, ఇక కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు, హోంఐసొలేషన్‌లో ఉంటున్నవారికి ఏ మేరకు మందులు అందుతున్నాయో ఊహించుకోవచ్ఛు ప్రతి నిత్యం పరగడపున వేసుకునే పాంటాప్రొజోల్‌ ట్యాబ్లెట్‌ సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్స్‌లో లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా రాంటోడిన్‌ ఔషధమిస్తున్నారు. రోగికి ఉన్న తీవ్రతను బట్టి ఐవర్‌మెక్టిన్‌ వాడిస్తారు. ఇది ఒకే మోతాదుతో కూడిన టాబ్లెట్‌ ఉందని అంటున్నారు. దీనిపై డ్రగ్‌స్టోర్స్‌ అధికారులు మాట్లాడుతూ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు అవసరం మేరకు ఉన్నాయని, ఇండెంట్‌ పెట్టగానే పంపుతున్నామని తెలిపారు. లేని మందులు కూడా సమకూర్చుకుని రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని