పదవుల పందేరం!
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

పదవుల పందేరం!

జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ రేసులో ఆశావహులు ఎందరో  
ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు మంతనాలు ఆరంభం

ఈనాడు, గుంటూరు పరిషత్‌ ఫలితాలు వెల్లడి కావడంతో జిల్లా, మండల పరిషత్‌ పదవులపై నేతలు మంతనాలు మొదలెట్టారు. జడ్పీటీసీ స్థానాలను అధికారపార్టీ వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేయడంతో అన్ని పదవులు ఆ పార్టీ అభ్యర్థులకు దక్కనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన నేతలు పదవులను దక్కించుకోవడానికి నియోజకవర్గ నేతల వద్దకు వెళుతున్నారు. మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవి, కోఆప్షన్, జిల్లా పరిషత్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులు రెండు, కోఆప్షన్‌ సభ్యుల పదవులు ఉంటాయి. వీటిపై పలువురు ఆశలు పెంచుకోవడంతో పోటీ పెరిగింది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కావడంతో కొల్లిపర నుంచి విజయం సాధించిన కత్తెర హెనీ క్రిస్టినా పేరు దాదాపు ఖరారైందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉపాధ్యక్ష పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ సామాజికవర్గానికి ఇచ్చినందున ఉపాధ్యక్ష పదవులు రెండు బీసీ, ఓసీ సామాజికవర్గాలకు కేటాయిస్తారన్న అంచనాతో ఆయా సామాజికవర్గాల నేతలు మంతనాలు మొదలెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన నేత ఒకరు జడ్పీ ఉపాధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సదరు నేత ప్రజాప్రతినిధి కుమారుడు. మంగళవారం జిల్లా పరిషత్‌ పదవుల ఎన్నికకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈనేపథ్యంలో ఎంపికపై స్పష్టత వస్తుందని ఆపార్టీ నేత ఒకరు తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని