హద్దులెరగని అక్రమ రవాణా
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

హద్దులెరగని అక్రమ రవాణా

దళారుల జేబులు నింపుతున్న రేషన్‌ బియ్యం


పొన్నూరులోని ఓ మిల్లులో స్వాధీనం చేసుకున్న బియ్యం

ఈనాడు, గుంటూరు జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ రవాణా అడ్డగోలుగా సాగుతోంది. అక్రమార్కులు పేదల బియ్యాన్ని దొడ్డిదారిలో అమ్మేసి జేబులు నింపుకుంటున్నారు. కొందరు డీలర్లు, ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేసే ఎండీయూలు, కొన్నేళ్లుగా బియ్యం అక్రమరవాణాను వృత్తిగా మార్చుకున్న వ్యాపారులు కలిసి మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా రేషన్‌ బియ్యం రవాణా కొనసాగిస్తున్నారు. పౌరసరఫరాలశాఖలోని కొందరు లోపాయికారీగా ఇతోధికంగా సహకారం అందించడం వరంగా మారింది. కొందరు పోలీసులకు సైతం నెలవారీ మామూళ్లు ఇస్తూ వ్యాపారులు పనులు చక్కబెట్టుకుంటున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నెల రోజుల వ్యవధిలో వేల క్వింటాళ్లు రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. 
తీర ప్రాంతంలో రైస్‌మిల్లు యజమాని ఒకరు పూర్తిగా రేషన్‌బియ్యం రీసైక్లింగ్, పాలిష్‌ చేసి సన్న బియ్యంగా మార్చి ప్రైవేటు మార్కెÆట్‌లో విక్రయించడం వృత్తిగా మార్చుకున్నారు. ఇతనికి ఒక ప్రజాప్రతినిధి పూర్తిగా అండదండలు అందించడం, అధికార యంత్రాంగాన్ని అటు వెళ్లకుండా కట్టడి చేయడంతో రేషన్‌ బియ్యం వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. సత్తెనపల్లి  మండలం కొమెరపూడికి చెందిన వ్యాపారి ఒకరు దశాబ్దకాలంపైగా రేషన్‌బియ్యం రవాణా చేస్తూ రూ.కోట్లు గడించారు. సదరు వ్యాపారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయినా వ్యాపారం ఆపడం లేదు. యంత్రాంగానికి మామూళ్ల రుచి చూపించి దర్జాగా బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటించి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. ఇంటింటికి బియ్యం సరఫరా చేసేవారు నేరుగా ఎండీయూ వాహనాల్లోనే కొమెరపూడికి తరలించడం గమనార్హం. ఇటీవల పౌరసరఫరాల అధికారులు ఆ మార్గంలో వెళుతూ తనిఖీ చేయగా ఒక ఎండీయూ వాహనంలో 28 క్వింటాళ్ల బియ్యం తేడా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదుచేశారు. 

*పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి రైసుమిల్లులో 1155 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. ఇదే మిల్లుకు సంబంధించిన వ్యాపారికి చెందిన 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం 20రోజుల కిందట స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు పట్టణానికి చెందిన వ్యాపారులు రేషన్‌ బియ్యం రవాణా చేస్తూ భట్టిప్రోలు వద్ద 30టన్నులు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 30 టన్నులు, పాలకొల్లులో 30 టన్నులు తరలిస్తూ పట్టుబడ్డారు. 

*ఫిరంగిపురం మండలం వేమవరంలో రెండు రోజుల కిందట ఒక వ్యాపారి వద్ద 140 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. గుంటూరు శివారు పలకలూరు నుంచి ఫిరంగిపురం వైపు వెళ్తున్న ఆటోలో 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

*తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో ఈనెల 13న ఒక షెడ్డులో 400 బస్తాల రేషన్‌బియ్యం పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రోసూరు మండలం ఎర్రబాలెంలో ఈనెల 3న 80 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. 

రూ.10కి  కొనుగోలు 
జిల్లాలో కార్డుదారులకు నెలకు 22 వేల మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత ఆరు నెలలుగా నెలకు రెండుసార్లు బియ్యం అందిస్తున్నారు. దీంతో నెలకు జిల్లాలో 44వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రజలకు అందుతున్నాయి. ఇందులో 50శాతంపైగా బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళుతోంది. కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.10 ధరకు స్థానికంగా కొందరు దళారులు సేకరిస్తున్నారు. వీరంతా పోర్టుకు తరలించే వ్యాపారులకు కిలో రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని బస్తాలు మార్చి లారీల్లో జిల్లా సరిహద్దులు దాటించి పోర్టుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో పట్టుబడితే 6ఏ కేసులు నమోదుచేస్తున్నారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో కేసులు నిలవడం లేదు. యంత్రాంగం కేసు నమోదు నుంచి ఆధారాలు సమర్పించడం వరకు సక్రమంగా వ్యవహరించకపోవడంతో ఈపరిస్థితి ఏర్పడుతుంది. రేషన్‌ బియ్యం అక్రమరవాణాను కొందరు వృత్తిగా మార్చుకుని దశాబ్దాలుగా చేస్తున్నారంటే వారికి ఏ స్థాయిలో సహకారం అందుతుందో యంత్రాంగానికే తెలియాలి. డెల్టాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు అక్రమరవాణాకు అండగా నిలుస్తున్నారు. ఒక వ్యాపారి ప్రజాప్రతినిధితో కలిసి పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు నేతలకు నెలవారీగా మామూళ్లు ఇచ్చి అక్రమార్కులు పని చక్కబెట్టుకుంటున్నారు. 

వ్యాపారులపై పీˆడీ యాక్ట్‌ నమోదు
జిల్లాలో సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వ్యాపారి ఒకరు పలుమార్లు రేషన్‌బియ్యం అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డారు. 6ఏ కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. దీనిని గుర్తించి ఇటీవల పట్టుబడిన బియ్యంపై లోతుగా దర్యాప్తు చేశాం. నంద్యాలలో బియ్యం కొనుగోలు చేసి చత్తీస్‌గడ్‌కు తరలిస్తున్నట్లు నకిలీ ఆధారాలు చూపించారు. దీంతో నంద్యాలలో బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారి, చత్తీస్‌గడ్‌లో బియ్యం తీసుకుంటున్నవారి వివరాలు సేకరించి అక్కడి స్థానిక అధికారులతో చర్చించాం. వివరాలు ఆరా తీయడంతోపాటు వారితో సత్తెనపల్లి ప్రాంతం వ్యాపారితో వ్యాపార లావాదేవీలు చేయలేదని అఫిడవిట్ తీసుకున్నాం. పక్కాగా ఆధారాలు లభించడంతో పీˆడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించాం. ఇక నుంచి పట్టుబడితే సరైన ఆధారాలు సేకరించి వారిపై పీˆడీ యాక్టు నమోదుచేస్తాం. దీనివల్ల ఈ వ్యాపారం చేసే వారికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాం. 
- ఏఎస్‌ దినేష్‌కుమార్, జిల్లా సంయుక్త పాలనాధికారి, గుంటూరు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని