
లాఘవంగా విద్యుత్తు చౌర్యం.. ఆపై కటకటాలపాలు
వీరిలో సగానికి పైగా గ్రేటర్‌లోనే..
ఈనాడు, హైదరాబాద్
రాజధానిలో విద్యుత్తు చౌర్యం కేసులు ఎక్కువగా సంఖ్యలో నమోదవుతున్నాయి. విద్యుత్తు సంస్థ కార్యాలయాలన్నీ కొలువుదీరి.. విస్తృత నెట్వర్క్ కల్గిన నగరంలోనే కరెంట్‌ను దొంగతనంగా వాడుకుంటున్నారు. కరోనా కాలంలో తనిఖీలు లేకపోవడంతో చౌర్యం మరింత పెరిగింది. మీటర్లు నెమ్మదిగా తిరిగేలా ట్యాంపరింగ్‌కు పాల్పడున్న కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ సౌత్‌లో కొన్ని ఫీడర్ల పరిధిలో 90 శాతం నష్టాలు వస్తున్నాయి. గ్రేటర్లో ఇక్కడే అత్యధిక చౌర్యం కేసులు నమోదయ్యాయి.
రెండోసారి పట్టుబడితే..
విద్యుత్తు చౌర్యం కేసుల్లో వినియోగదారులు కటకటాల పాలవుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో గత ఏడాదిలో కరెంట్ చౌర్యానికి పాల్పడిన 80 మందిని విజిలెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందినవారే. ప్రస్తుతం ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. ఏడాది కాలంలో 27,501 కేసులు నమోదు చేశారు. రూ.19.87 కోట్ల విలువైన విద్యుత్తు చౌర్యం జరిగినట్లు అంచనా వేశారు. మొదటిసారి చౌర్యానికి జరిమానాతో వదిలేయగా, వారే రెండోసారి పట్టుబడితే అరెస్టు చేస్తున్నారు. అంతకు కిందటి ఏడాదితో పోలిస్తే గత ఏడాది కేసులు తగ్గాయి. కొవిడ్‌తో ఆరు నెలల పాటూ విద్యుత్తు అధికారులు తనిఖీలు చేపట్టలేదు. మూడునెలలుగా చౌర్యం నివారణపై మళ్లీ దృష్టిపెట్టారు. ప్రతి నెలా సెక్షన్ల వారీగా లక్ష్యాలను చేరుకున్నారా? లేదా? అని కార్పొరేట్ కార్యాలయం నుంచి సమీక్ష చేస్తున్నారు.
కరోనాతో కేసులు తగ్గాయి..
కె.మురళీధర్‌రావు, చీఫ్ విజిలెన్స్ అధికారి, టీఎస్ఎస్పీడీసీఎల్
2020లో చౌర్యం కేసులు తగ్గడానికి కారణం.. కరోనా సమయంలో ఆరునెలల పాటు తనిఖీలు చేపట్టకపోవడమే. డిస్కం సిబ్బంది 833 మంది ఏడాది కాలంలో కొవిడ్ బారిన పడ్డారు. 20 మంది చనిపోయారు. వీటి నుంచి తేరుకుని ఇటీవల చౌర్యం కేసులపై దృష్టిపెట్టాం. విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే వినియోగదారులపై తప్పక చర్యలు ఉంటాయి. మొదటిసారి దొరికితే ఎప్పటి నుంచి చౌర్యానికి పాల్పడుతున్నారో అంచానా వేసి అంతమొత్తాన్ని వసూలు చేస్తాం. మళ్లీ తనిఖీ చేసినప్పుడు దొరికితే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తాం. కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.