Published : 21/04/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తరగతి పాఠం.. అంతరిక్షానికి బాట!

 ఇస్రో పరిశోధనల్లో నగర ఇంజినీరింగ్‌ విద్యార్థి

ఈనాడు, హైదరాబాద్‌ మల్లాపూర్‌, న్యూస్‌టుడే: ఆలోచనకు.. ఆచరణ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి అలువాల కీర్తన్‌చంద్‌. ప్రస్తుతం చెన్నైలోని భారతీయ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన స్వదేశీ ఉపగ్రహ తయారీలో కీర్తన్‌చంద్‌ కీలకంగా వ్యవహరించారు. తన పరిశోధనల ప్రస్థానాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు. అవేంటో అతడి మాటల్లోనే..!

ఆరోతరగతిలోనే అడుగులు

నాన్న అలువాల రమేష్‌ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్నారు. అమ్మ జయరాణి గృహిణి. అన్నయ్య నితిన్‌ బీఫార్మసీ చేస్తున్నాడు. మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నాం. మదర్‌థెరిస్సా పాఠశాలలో పదోతరగతి, నల్లకుంట నానో జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తిచేశాను. ఆరోతరగతిలో పాఠ్యాంశాలతో ప్రయోగాలు చేసేవాణ్ని. అంతర్జాలంలో చూస్తూ ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అంశాలను తెలుసుకునేవాణ్ని. సీ లాంగ్వేజ్‌, సీ ప్లస్‌ ఇవన్నీ ఇంటర్‌లో చేరేటప్పటికే నేర్చేసుకున్నా. ఇంట్లో ఇచ్చే పాకెట్‌మనీతో కొన్ని పరికరాలు కొనుగోలు చేసి ప్రయోగాలు చేయటం ప్రారంభించా. డ్రోన్లు తయారు చేసేందుకు ఒక్కో దానికోసం రూ50 వేలవరకూ ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టు వర్క్‌కు సాయం చేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్పటం ద్వారా అవకాశాలు వచ్చాయి. 2016లో సైన్స్‌ఫెయిర్‌లో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ నుంచి పతకం అందుకోవటం చాలా స్ఫూర్తినిచ్చింది. 9వ తగరతిలో ఉన్నప్పుడు రూపొందించిన డ్రోన్‌ రష్యా వెళ్లేందుకు కారణమైంది. స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఏటా కొత్త పరిశోధన అంశాలను ప్రోత్సహించేందుకు పోటీ నిర్వహిస్తుంది.2017లో నేను రూపొందించిన డ్రోన్‌లోని సాంకేతిక పరిజ్ఞానం ఎంపికైంది. రష్యాలోని గగారిన్‌ రీసెర్స్‌ అండ్‌ టెస్ట్‌ కాప్మొనాట్‌ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పూర్తిచేసే అవకాశం దక్కింది. ఆ పరిశోధనను మెచ్చిన చెన్నైలోని భారతీయ యూనివర్సిటీ ఉచితంగా ఇంజినీరింగ్‌ సీటిచ్చింది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా ద్వారా శాటిలైట్‌ రూపకల్పనలో అవకాశం వచ్చింది. దీనిలో నేను కోడింగ్‌ చేశాను. ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లాక అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పనిచేసేలా కంప్యూటర్లు కోడింగ్‌ చేయటం సవాల్‌ అనే చెప్పాలి. అంతరిక్షంలోని రేడియేషన్‌కు కంప్యూటర్‌ నిలిచిపోకుండా(షట్‌డౌన్‌) పనిచేసేలా రూపొందించాను. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్‌ అంశాలను నేర్చుకోవటం, పట్టుసాధించటం వంటివి శాటిలైట్‌ ప్రయోగంలో బాగా ఉపయోగపడ్డాయి. నాకు భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ స్ఫూర్తి. ఆయన్ను కలవాలనే కోరిక తీరలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని