పక్కాగా సాగు లెక్క
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

పక్కాగా సాగు లెక్క

 పూర్తయిన అధికారుల సర్వే  
 ప్రకృతి సహకరిస్తేనే పంటలు

పంట వివరాలు నమోదు చేసుకుంటున్న ఏఈఓ శివకుమార్‌

పంటల సాగు వివరాల నమోదు పూర్తయింది. మండలాల వారీగా ఏఈఓలు, ఏఓలు రెండు నెలలుగా రైతుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన విషయం తెలిసిందే. నమోదు ప్రక్రియ కొంత ఆలస్యమైనా ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగైందనేది పక్కాగా రాసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ కార్యక్రమం ఈనెల 20 నాటికి పూర్తయింది. దీని ఆధారంగానే ఈ ఏడాది ప్రభుత్వ రాయితీ పథకాలను అందించడం, పంట విక్రయ సమయంలో మద్దతు ధరను నేరుగా రైతులకు అందనుందని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం...

న్యూస్‌టుడే, బషీరాబాద్‌

జిల్లాలోని 19 మండలాల పరిధిలో 2.24లక్షల మంది రైతులుండగా, 5,82,583 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది 5,96,817 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది కాస్త తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజను ప్రారంభంలో వరుణుడు కరుణించడంతో రైతులు విత్తనాలు విత్తుకొని ముందస్తుగానే సాగుకు సిద్ధమయ్యారు. అనంతరం వర్షాభావం.. మళ్లీ తెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పత్తి, కంది, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. పంట బీమా పథకంపై స్పష్టత లేకపోవడంతో రైతులెవరూ బీమా చేయించుకోలేదు. గతేడాది పత్తి పంట నష్టాలే మిగిల్చినా ఈసారైనా గట్టెక్కుతామనే ఆశతో రైతులున్నారు. ప్రకృతి సహకరించి పంట సిరులు కురియాలని కోరుకుంటున్నారు.

తగ్గిన పత్తి.. పెరిగిన కంది, వరి: జిల్లాలో పత్తి సాగు భారీగా తగ్గింది. చీడపీడల బెడద, మందుల పిచికారీ అదనం కావడం, పెట్టుబడులు పెరగడం వంటి కారణాల తోపాటు గతేడాది ఎకరాకు 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కేవలం సరాసరిగా 3 క్వింటాళ్లే వచ్చింది. దీంతో అప్పులపాలైన అన్నదాతలు ఈసారి పంట సాగును భారీగా తగ్గించారు. జిల్లాలో గతేడాది 2,73,963 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది కేవలం 1,51,243 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,22,720 ఎకరాల పత్తి సాగు తగ్గిపోయింది. కందికి గతేడాది ధర బాగుండడంతో ఈసారి సాగుకు మొగ్గు చూపించారు. గతేడాది 1,85,104 ఎకరాలు సాగవ్వగా, ఈసారి 1,96,900 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది వానాకాలంలో వరి 75,491 ఎకరాల్లో సాగవ్వగా, ఈసారి 1,11,791 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది 36,00 ఎకరాల్లో అదనంగా సాగవుతోంది.
నష్ట పరిహారంపై దృష్టి సారిస్తేనే మేలు..
అధిక వర్షాలతో ప్రతి ఏడాది పంటలు నీట మునిగి రైతులు నష్టాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా కాగ్నా, కాకరవేణి, మూసీ నది పరీవాహక పొలాలు వందల ఎకరాల్లో కంది, పత్తి పంటలు నీట మునిగిపోతున్నాయి.పెట్టుబడికి సైతం దిగుబడి రావడం లేదు. కనీసం పూర్తిగా పాడైన పంటలకు ప్రతి ఏడాది పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. తాండూరు ప్రాంతంలోని పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల, తాండూరు మండలాల పరిధిలోని నది పరీవాహకంగా పంటలు దెబ్బతిని రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి
గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్‌.

పంటలకు చీడపీడలు ఆశించినప్పుడు వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సమాచారం ఇచ్చి సూచనలు తీసుకోవాలి. సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటేనే రాబడి ఉంటుంది. యంత్ర పద్ధతిలో అదనుకు వ్యవసాయ పనులు చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. పత్తి సాగు తగ్గి కంది, వరి సాగు పెరిగింది. జిల్లాలో పంటల సాగు వివరాల నమోదు పూర్తయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని