వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం..
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం..

చికిత్స పొందుతూ వివాహిత మృతి

గుండ్లమడుగుతండా(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: అత్తింటి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ ఏడుకొండలు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. తాండూరు మండలం గుండ్లమడుగుతండాకు చెందిన రాజుకు రాంపూర్‌తండాకు చెందిన రాథోడ్‌ అనిత(23)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు అంకిత్‌, కూతురు అంకిత ఉన్నారు. మూడు నెలలుగా కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 22న అనితతో అత్త లక్కీబాయి, మామ చంద్రునాయక్‌, ఆడపడుచు సరితబాయిలు గొడవపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన అనిత పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి, అక్కడ్నించి వికారాబాద్‌లోని మిషన్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆదివారం శవపంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజుకు ఇది మూడో వివాహం అని, మొదటి భార్య ఇద్దరు పిల్లలతో కర్ణాటక రాష్ట్రంలోని పుట్టింట్లో ఉంటుండగా, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రెండో భార్య విడాకులు పొందారని గ్రామస్థులు పేర్కొన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మృతురాలి వాంగ్మూలం మేరకు అత్త, మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని