Updated : 21/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక

కొవిడ్‌ నియంత్రణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్‌ రవి

జగిత్యాల, న్యూస్‌టుడే

జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2.91 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యిందని 6.99 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు స్వీయరక్షణ పాటించాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, కరోనా నియంత్రణపై మంగళవారం ‘ఈనాడు-ఈటీవీ’ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలు తెలిపారు.

న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

కలెక్టర్‌: జిల్లాలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 104172 ఎకరాలుండగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 291290 ఎకరాల్లో సాగు చేశారు. 699096 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా ప్రభుత్వ పరంగా 650045 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశాం. మిగతా ధాన్యాన్ని స్థానిక వినియోగం, మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

న్యూ: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు?

కలెక్టర్‌: జిల్లాలో 380 గ్రామపంచాయతీలుండగా 397 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం అవసరమైతే మరో 9 కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తాం ఐకేపీ ద్వారా 157, సహకార సంఘాల ద్వారా 233, వ్యవసాయ మార్కెట్ల ద్వారా 7 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేంద్రాల్లో 398 ధాన్యం శుద్ధి యంత్రాలు, 680 తేమ పరీక్షించే యంత్రాలు, 772 ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాం. అకాల వర్షం వస్తే ధాన్యం తడవకుండా ఉండేందుకు 12442 టార్పాలిన్లు కేంద్రాల్లో ఉన్నాయి. రైతులకు తాగునీరు, నీడ వసతి కల్పించాలని ఆదేశించాం.

న్యూ: కొనుగోళ్లలో ఇబ్బందులను ఎలా అధిగమిస్తారు?

కలెక్టర్‌: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయం. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి కేంద్రాల వారీగా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ప్రతి కేంద్రానికి ఇద్దరిని ఇన్‌ఛార్జులుగా నియమించాం. ఏరైతు ఏరోజు ధాన్యం తేవాలనే విషయమై ముందుగానే వ్యవసాయ అధికారుల ద్వారా టోకెన్‌ జారీ చేస్తాం. ధాన్యం కొనుగోళ్లు ముగిసే వరకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికాలందరూ సమన్వయంతో పనిచేస్తారు.

న్యూ: గన్నీ సంచులు... రవాణాకు ఏర్పాట్లు?

కలెక్టర్‌: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు... జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 1.62 కోట్ల గన్నీ సంచులు అవసరముండగా 90 లక్షలు అందుబాటులో ఉన్నాయి. 39 లక్షల సంచులు వస్తున్నాయి. మరో 33 లక్షలు రావాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలిస్తాం. కేంద్రాల వారీగా ధాన్యం తీసుకెళ్లే వాహనాల వివరాలు ఇస్తాం ధాన్యం రవాణా, మిల్లుల్లో అన్‌లోడింగ్‌ బాధ్యత రెవెన్యూ సిబ్బంది చూసుకుంటారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంట వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపరిచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

న్యూ: కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు ఎలా ఉన్నాయి?

కలెక్టర్‌: జిల్లాలో కొవిడ్‌ బాధితులకు అన్ని విధాలా సేవలందిస్తున్నాం. ప్రభుత్వ పరంగా జిల్లా కేంద్ర ఆస్పత్రిసహా మెట్‌పల్లి ఆస్పత్రిలో 150 పడకలు ఆక్సిజన్‌ సదుపాయంతో సిద్ధంగా ఉన్నాయి. సుమారు వందమంది చికిత్స పొందుతున్నారు. జగిత్యాలలో 4, కోరుట్ల, మెట్‌పల్లి ఒక్కో ప్రైవేటు ఆస్పత్రికి కొవిడ్‌ సేవల అనుమతి వచ్చింది. జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఇతర ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నాం.

న్యూ: వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది?

కలెక్టర్‌: జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని ఆదేశించాం. హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించుకుంటున్నారు. మాస్కులు ధరించకుండా నిబంధనలు పాటించని వారికి అధికారులు జరిమానా విధించటమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈనెల 30 వరకు రాత్రి 9 నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైతం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

న్యూ: జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు?

కలెక్టర్‌: జిల్లాలో రెండోవిడత కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని 25 ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ 2500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు ఇచ్చి గృహ సంరక్షణలో ఉండాలని సూచిస్తున్నాం. ఇళ్లలో సరైన వసతి లేని వారి కోసం కొండగట్టు జేఎన్టీయూ కళాశాలలో ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు, పురపాలక, పంచాయతీ అధికారులను ఆదేశించాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని