తొలి విడతలో 68శాతం కేటాయింపు
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

తొలి విడతలో 68శాతం కేటాయింపు

ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ, సీఎస్‌ఎంకు ఆదరణ

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పెరిగిన సీట్లు

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు జరిగింది. శనివారం ఉన్నత విద్యామండలి కళాశాలల వారీగా వివరాలను వెల్లడించింది. అభ్యర్థుల అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను వెబ్‌సైటులో ఉంచింది. ఉమ్మడి జిల్లాలో కేటాయింపు చెప్పుకునే విధంగా జరిగింది. 2021-22 విద్యా సంవత్సరం మొత్తం సీట్లలో 68శాతం తొలి విడతలో దక్కడం విశేషమే. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య చివరి వరకు పెరిగింది. పలు కోర్సుల్లో విద్యార్థులకు అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడు మూడు ప్రభుత్వ, పది ప్రైవేటు కళాశాలలకు అనుబంధ గుర్తింపు హోదా లభించింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలుపుకుని కన్వీనర్‌ కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 4,253. ఇందులో తొలి విడుత కేటాయింపు 2885.

సీట్లన్నీ బదలాయింపు

గత నాలుగేళ్లుగా కొన్ని కోర్సులు కన్వీనర్‌ విభాగంలో భర్తీ కావడం లేదు. ఇక వాటికి యాజమాన్య కోటాలో విలువెక్కడిది. ఒక్కో కళాశాలల్లో 15శాతానికి మించి చేరడం లేదు. దీంతో ఆ కోర్సులకు మంగళం పాడాలని కొన్ని, సీట్లు తగ్గించుకోవాలని మరి కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. ఒక కోర్సులో సీట్లను డిమాండ్‌ గల శాఖలకు బదిలీ చేసుకున్నాయి. ఫలితంగా సివిల్‌, మెకానికల్‌, ట్రిపుల్‌ఈ వంటి కోర్సుల్లో సీట్లు తగ్గాయి. ఎంత తగ్గించుకున్నా ఈ సారి భర్తీ అంతంత మాత్రమే అని తెలుస్తోంది. ప్రవేశాలకు తొలి విడత కేటాయింపే ప్రధానం. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలల్లో 47 సీట్లకు రెండు, 93 సీట్లకు తొమ్మిది సీట్ల కేటాయింపును పొందాయి. అవి కూడా ఉంటాయో కూడా తెలియదు.

594 సీట్ల పెంపు

ఈ విద్యా సంవత్సరానికి తొలుత కన్వీనర్‌ కోటాలో 3,659 సీట్లను ఖరారు చేశారు. ఆ తర్వాత కళాశాలల విజ్ఞప్తి మేరకు జేఎన్‌టీయూహెచ్‌ సీట్ల సర్దు బాటు కూడా చేసింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలుపుకుని 594ను పెంచింది. ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య 4,253కు పెరిగింది. ఇందులో సీఎస్‌జీ (కంప్యూటర్‌ సైన్స్‌ డిజైన్‌) అనే కొత్త కోర్సుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ కళాశాలల్లో సివిల్‌లో 12, సీఎస్‌ఈలో 20, ఈసీఈలో 14, ట్రిపుల్‌ఈలో 20, మెకానికల్‌లో 21, సీఎస్‌ఎంలో 7, ఐటీలో 6, మైనింగ్‌లో 4, టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో 2 సీట్లను పెంచింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సిరిసిల్లకు ప్రభుత్వ కళాశాల రావడంతో పాటు మిగితా రెండు కళాశాలల్లో సీట్లు పెరగడం విద్యార్థులకు కలిసి వచ్చింది.

సీఎస్‌ఈ, సీఎస్‌ఎంకు ప్రాధాన్యం

సివిల్‌, సీఎస్‌ఈ, ఈసీఈ, ట్రిపుల్‌ఈ, మెకానికల్‌తో పాటుగా సీఎస్‌ఎం, ఐటీ, మైనింగ్‌, సీఎస్‌ఐ, సీఎస్‌వో, టెక్స్‌టైల్‌, సీఎస్‌జీ ఆయా కళాశాలల్లో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 12 కోర్సులకు అనుమతి లభించింది. అయితే విద్యార్థులు మాత్రం ఎప్పటిలాగానే కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌కు మొగ్గు చూపారు. ఆ తర్వాత స్థానం ఈ ఏడు సీఎస్‌ఎం (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌ మెషిన్‌ లెర్నింగ్‌) దక్కించుకుంది. ఎప్పుడైనా సీఎస్‌ఈ తర్వాత ఈసీఈకు ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు అందుకు భిన్నంగా సీఎస్‌ఎం చదివేందుకు ఆసక్తి చూపారు. సీఎస్‌ఈలో మొత్తం సీట్లు 994లో 966 (97శాతం) కేటాయింపు అయ్యాయి. అంటే విద్యార్థుల దృష్టి మొత్తం సీఎస్‌ఈపైనే ఉంది. సీఎస్‌ఎంలో మొత్తం 440 ఉంటే అందులో కేటాయించినవి 357 (81శాతం). ఈసీఈలో 881 మొత్తం సీట్లు అయితే అందులో 657 (75శాతం) కేటాయింపు జరిగాయి. మిగితా వాటిలో ఈసీఈలో 41శాతం, సివిల్‌ 43శాతం, మెకానికల్‌ 45శాతం మాత్రమే. కంప్యూటర్‌ కోర్సు ఆధారిత కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినా పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని