మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

ఫిర్యాదులపై సత్వర స్పందన

రామగుండం నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌ శంకర్‌ కుమార్‌

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం : ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తూనే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ అన్నారు. నగరపాలికలోని వివిధ విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరింత పురోగతి సాధించేలా లక్ష్యాలను నిర్దేశిస్తున్నామన్నారు. నగరపాలక నిర్వహణకు ప్రజలు సైతం సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

న్యూస్‌టుడే : నగరపాలిక పనితీరు మెరుగుపర్చడానికి ప్రణాళిక ఏంటీ?

కమిషనర్‌ : నగరపాలికలోని వివిధ విభాగాల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా సమయపాలన కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌ విధానాన్ని నిలిపివేశారు. ఒప్పంద కార్మికుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ దాని అమలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉత్తర్వులు రాగానే కార్మికులకు పెరిగిన వేతనాలు చెల్లిస్తాం. నగరంలో రహదారులపై విచ్చిలవిడిగా తిరుగుతున్న పశువులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచిస్తున్నాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. బందెల దొడ్డిని కూల్చివేసి ఆ స్థానంలో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. అందులోకి వాహనాలు వెళ్లకుండా కందకం తవ్విస్తున్నాం.


రామగుండంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి కమిషనర్‌ శంకర్‌కుమార్‌, తదితరులు

న్యూస్‌టుడే : నగరపాలికలో ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి..?

కమిషనర్‌ : ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయం వరకు రానవసరం లేదు. నగరపాలిక ఫిర్యాదుల విభాగంలోని చరవాణి 96036 66444, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 7062 లకు ఫోన్‌ చేసి తమ సమస్యలను వివరిస్తే నమోదు చేసుకొని పరిష్కార చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన సమస్య మూడు రోజుల్లో పరిష్కారం కానట్లయితే నేరుగా నా చరవాణి 98499 05878 నంబరుకు ఫోన్‌ చేస్తే సత్వరమే తగు చర్యలు తీసుకుంటాం. ఆండ్రాయిడ్‌ ఫోన్లు కల్గిన వారు ఇంటినుంచే సిటిజన్‌ బడ్డీ యాప్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్ఛు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాల సమస్యలుంటే చరవాణి ద్వారా, సిటిజన్‌ బడ్డీ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారు.

న్యూస్‌టుడే : నగరపాలిక నిర్వహణలో ప్రథమ ప్రాధాన్యతాంశాలు ఏమిటీ?

కమిషనర్‌ : నగరపాలిక నుంచి ప్రజలు కోరుకునేది తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రహదారులు, మురుగు కాలువలు తదితర పనులు మాత్రమే. ఇందులో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. చెత్త సేకరణకు అత్యాధునిక వాహనాలతో పాటు ఆటో ట్రాలీలను కొనుగోలు చేయడంతో పారిశుద్ధ్యం వేగవంతమైంది. ఇ.ఎస్‌.ఎస్‌.ఎల్‌. ద్వారా ఎప్పటికప్పుడు వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తున్నాం. కొత్తగా రహదారులు, మురుగు కాలువల నిర్మాణం కోసం గతంలో నిర్వహించిన టెండర్లలో పనులు దక్కించుకున్న గుత్తేదార్లు పనులు చేపడుతున్నారు. న్యూమారేడు పాక ప్రాంతంలో నిరంతర నీటి సరఫరా కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఇంకొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించి ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

న్యూస్‌టుడే : పారిశుద్ధ్య నిర్వహణలో కీలకమైన ఆటో ట్రాలీలకు మరమ్మతులు ఎప్పుడు చేయిస్తారు..?

కమిషనర్‌ : ఆటో ట్రాలీల మరమ్మతులతో పాటు నిర్వహణ బాధ్యతలను ‘ఆగ్రోస్‌’ సంస్థకు అప్పగించాం. ఇటీవలనే వర్కు ఆర్డరు ఇచ్చాం. ఆగ్రోస్‌ అధికారులు, మేయర్‌, నేను ఇటీవల సంయుక్తంగా సమావేశమై త్వరితగతిన వాహనాలకు మరమ్మతులు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆగ్రోస్‌ ప్రతినిధులతో పేర్కొన్నాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కానుంది. చెత్త సేకరణలో అత్యాధునికమైన కంపాక్టర్‌ వాహనంతో చెత్త తరలింపు వేగవంతమవుతోంది. త్వరలోనే ఇలాంటిదే మరో వాహనం రానుంది. చెత్త సేకరణ సర్వీసు ఛార్జీలను కలుపుతూ స్థానిక పరిశ్రమల నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నాం. ప్రైవేటు కట్టడాలకు సైతం ఇదే తరహాలో చెత్త సేకరణ ఛార్జీలను ఆస్తిపన్నుతో కలిపి వసూలు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నాం.

న్యూస్‌టుడే : అక్రమ కట్టడాల నివారణ, పన్నుల వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

కమిషనర్‌ : జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు వస్తాయేమోనని అనుమానంతో కొందరు వెనకంజ వేశారు. దీనిపై ఇటీవల అదనపు పాలనాధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించడంతో బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా నిబంధనల ప్రకారంగా ముందుకు సాగుతాం. స్థానిక పరిశ్రమల నుంచి ఆస్తిపన్ను వసూలు వేగవంతమవుతుంది. రామగుండం ఎరువుల కర్మాగారం, సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ ఆస్తిపన్నులు చెల్లించాయి. ఈ విషయంలో ప్రజలు సైతం స్పందించి సత్వరమే ఆస్తిపన్నును బకాయిలతో సహా చెల్లించి నగరపాలిక అభివృద్ధికి సహకరించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని