హరితశోభితం... నాలుగు వరుసల రహదారి
eenadu telugu news
Published : 26/09/2021 03:49 IST

హరితశోభితం... నాలుగు వరుసల రహదారి

బోయినపల్లి, న్యూస్‌టుడే

రహదారి డివైడర్‌ మధ్యలో నాటిన మొక్కలు

రాజన్న సిరిసిల్ల-కరీంనగర్‌ జిల్లా ప్రధాన రహదారిలోని కొదురుపాక చౌరస్తా నుంచి ఆరెపల్లి శివారు వరకు నాలుగు వరుసల రహదారి (వంతెన) పచ్చదనంతో సంతరించుకుంది. నాలుగు వరుసల వంతెనపై వాహనాలు నిలిపి రాజరాజేశ్వర జలాశయం(మధ్యమానేరు) బ్యాక్‌ వాటర్‌ను చూస్తున్న వారికి డివైడర్‌ మధ్యలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సుమారు మూడు వేల మొక్కలను డివైడర్‌ మధ్యలో, రేలింగ్‌కు ఇరువైపులా నాటారు.

రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) నిర్మాణంలో భాగంగా మూలవాగుపై నాలుగు వరుసల వంతెన, రహదారిని సుమారు రూ.132 కోట్ల అంచనాతో నిర్మించారు. వంతెనకు ఇరువైపులా నాలుగు వరుసల రహదారి కొదురుపాక చౌరస్తా నుంచి ఆరెపల్లి శివారు వరకు చేపట్టారు. రహదారి మధ్యలో డివైడర్‌ నిర్మించారు. వంతెన నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినప్పటికీ మధ్యలో మొక్కలను నాటలేదు. రాత్రి సమయంలో వాహనదారులకు ఇబ్బందులు కలగడంతోపాటు పచ్చదనం లేకుండా పోయింది. మొక్కలు నాటేందుకు పలు సందర్భాల్లో అధికారులు పరిశీలించారు. డివైడర్‌, రహదారి నిర్మాణ సమయంలో వేసిన కంకర, సిమెంట్‌ వల్ల గుంతలు తీయడం ఖర్చుతో కూడుకున్నదని వదిలేశారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో...

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొదురుపాక చౌరస్తా నుంచి ఆరెపల్లి శివారు వరకు మొక్కలు నాటాలని నిర్ణయించారు. తెరాస రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్‌రావు ఆధ్వర్యంలో జేసీబీ యంత్రాలను వినియోగించి డివైడర్‌ మధ్యలో, రేలింగ్‌కు ఇరువైపులా గుంతలు తీయించి ఎర్ర మట్టి పోయించారు. కడెం, ఇతర ప్రాంతాల నుంచి సుమారు మూడు వేల మొక్కలను తెప్పించారు. పాతూరియా, కాదియా, లెగిస్ట్రేమియా, తాయి, తబూబియా, గుల్మోహర్‌, బాహూనియా, గన్నేరు, బాదం, పెంటోఫాం తదితర మొక్కలు నాటారు. పలు మొక్కలు పూలు పూస్తుండటం, ఏపుగా పెరుగుతుండటం వల్ల పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.


కనుచూపు మేర పచ్చదనం

-రవీందర్‌రావు, తెరాస రాష్ట్ర నాయకుడు

నాలుగు వరుసల వంతెనపై నుంచి మధ్యమానేరు జలాశయం బ్యాక్‌ వాటర్‌ చూడటానికి రెండు జిల్లాల మధ్య ప్రయాణం సాగించే వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ ఆగుతున్నారు. డివైడర్‌ మధ్యలో, రేలింగ్‌కు ఇరువైపులా పచ్చదనం కోసం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో మూడు వేల మొక్కలు తెప్పించి నాటించాను. కనుచూపు మేర మొక్కలతో పచ్చదనం సంతరించుకుంది.


సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం

- నల్లా రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో

నాలుగు వరుసల రహదారి డివైడర్‌ మధ్యలో, రేలింగ్‌కు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల చుట్టూ గడ్డి తొలగించడం, నీరు పోయడం చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌తోపాటు మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని