సీఎం కేసీఆర్‌ పాలన అంతా డొల్లతనమే
eenadu telugu news
Published : 20/10/2021 03:01 IST

సీఎం కేసీఆర్‌ పాలన అంతా డొల్లతనమే

మాజీమంత్రి ఈటల రాజేందర్‌

శాలపల్లిలో మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మొదట నేనే డిమాండ్‌ చేశానని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌ కాలనీ, శాలపల్లి, చెల్పూరు, రాజపల్లి, రంగాపూర్‌, రాంపూర్‌, కనుకులగిద్ద గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి తిలకాలు దిద్దారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామం కేంద్రంగా మారిందన్నారు. అన్ని కులాల్లోని నిరుపేదలకు దళితబంధు వంటి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. భాజపాకు ఓటేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని...కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని...ఆయన పాలన అంతా డొల్లతనమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలి పేదరికం పెరిగిపోయిందన్నారు. ఎన్నికలప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు, దళిత బంధు లాంటివి తెరాసకు గుర్తుకువస్తాయన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, చెల్పూరు సర్పంచి నేరెళ్ల మహేందర్‌గౌడ్‌, జూపాక సింగిల్‌విండో అధ్యక్షులు అనుమాండ్ల శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రాముల కుమార్‌, నాయకులు మండల సాయిబాబ, సురేష్‌యాదవ్‌, పంజాల వెంకన్న, పంజాల లక్ష్మి, కోమల్‌రెడ్డి, సిగ లత, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని