పాజుల్‌నగర్‌ హత్యకేసులో ముగ్గురి అరెస్టు
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

పాజుల్‌నగర్‌ హత్యకేసులో ముగ్గురి అరెస్టు

స్వాధీనం చేసుకున్న కత్తులను చూపుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: వేములవాడ మండలం పాజుల్‌నగర్‌ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం హత్య కేసు నిందితులను అరెస్టు చూపించారు. ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం... పిట్టల లక్ష్మీనర్సయ్యకు ఇద్దరు సోదరులు పిట్టల రాజేశం, పిట్టల శంకర్‌ ఉన్నారు. లక్ష్మీనర్సయ్య విద్యుత్తు శాఖలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రికి సంబంధించిన 5 ఎకరాల భూమికి సంబంధించి ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మీనర్సయ్య అతని కుటుంబ సభ్యులు భూమి తమకు దక్కలేదనే కోపంతో రాజేశంపై కక్ష పెంచుకొన్నారు. ఎలాగైన రాజేశంతోపాటు ఆయన కొడుకు మహేష్‌ను చంపి భూమి దక్కించుకోవాలని పథకం పన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈనెల 19న లక్ష్మీనర్సయ్య, ఈయన భార్య మొండవ్వ, చిన్న కుమారుడు పర్శరాములు కలిసి దారిలో నిలబడి పొలం పనికి వెళ్లి వస్తున్న రాజేశంను ఆపి అతనితో గొడవ పడి దాడి చేస్తుండగా వెంటనే రాజేశం కుమారుడు మహేష్‌ అక్కడికి వచ్చి తండ్రిని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. లక్ష్మీనర్సయ్య, ఆయన కుమారుడు పర్శరాములు కలిసి తల్వార్‌లతో మహేష్‌, రాజేశంలపై దాడి చేశారు. మహేష్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశం తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో పడి ఉండగా అతను చనిపోయాడని భావించి ముగ్గురు పారిపోయారు. శనివారం నిందితులను వేములవాడ రూరల్‌ పోలీసులు వారిని పట్టుకొని వారి దగ్గర నుంచి రెండు తల్వార్‌లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ చెప్పారు. వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌, వేములవాడ రూరల్‌ సీఐ బన్సిలాల్‌, ఎస్‌ఐ మాలకొండరాయుడులను అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని