సిబ్బంది ముగ్గురే..
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

సిబ్బంది ముగ్గురే..

రోజూ వందకు పైగా పరీక్షలు
ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో నియామకాలేవీ?
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

గోదావరిఖనిలోని కొవిడ్‌ పరీక్ష కేంద్రం

రోనాతో పాటు వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణలో మెరుగైన వసతులతో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో సిబ్బంది నియామకం చేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో ప్రతి రోజు 400లకు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యంతో అత్యాధునిక యంత్ర పరికరాలను నెలకొల్పినా ప్రత్యేక నిపుణుల నియామకాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో అవసరమైన సిబ్బందిని నియమించిన ప్రభుత్వం గోదావరిఖనిలోని కేంద్రంలో నియామకాలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోని ఒప్పంద ల్యాబ్‌ టెక్నీషియన్లతోనే పరీక్షలు చేయిస్తున్నారు.

పరీక్షలు చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌

ప్రత్యేక నిపుణులుంటేనే ప్రయోజనం
అనేక రకాలైన వ్యాధుల నిర్ధారణ చేసేలా ‘ఖని’లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో ప్రత్యేక నిపుణులుంటేనే ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్‌ టెక్నీషియన్లతో కేవలం కరోనా పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని, కమాన్‌పూర్‌, అడ్డగుంటపల్లి, గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారికి ఇక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆయా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని కరోనా అనుమానితుల నమూనాలు సేకరిస్తారు. ఓ ప్రత్యేక వాహనం ద్వారా ఆయా ప్రాంతాల్లో సేకరించిన నమూనాలను గోదావరిఖనిలోని ఆర్టీపీసీఆర్‌ కేంద్రానికి తీసుకొస్తారు. ఇక్కడ పరీక్షలు చేశాక ఫలితాలను అందిస్తారు. ఒకేసారి 100 మంది నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఉండగా ఒక్కసారి ఉపయోగించే ప్లేటుతో సుమారు రూ.1.5 లక్షల వరకు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఒకరిద్దరి నమూనాలను పరీక్షించినా అంతే వ్యయం కానుంది. మూడు షిఫ్టుల్లో మొత్తం 400లకు పైగా పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ సిబ్బంది కొరతతో నిత్యం 100 నుంచి 150 వరకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. కీలకమైన మైక్రోబయాలజిస్టు, పాథాలజిస్టు, సైంటిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, హెల్పర్లు, వాచ్‌మెన్లు మొత్తం 17 మంది సిబ్బంది ఆర్టీపీసీఆర్‌ కేంద్రం నిర్వహణకు అవసరం కాగా నియామకాలు జరగలేదు. ఆస్పత్రికి చెందిన ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోనే నిర్వహిస్తున్నారు. ఆగస్టు 14 నుంచి పరీక్షలు మొదలు పెట్టగా మంగళవారం నాటికి 2,648 పరీక్షలు నిర్వహించారు.


ప్రభుత్వానికి నివేదించాం
- డాక్టర్‌ వాసుదేవరెడ్డి. జిల్లా ఆస్పత్రుల నిర్వహణ పర్యవేక్షకులు

గోదావరిఖని ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే నియామకాలు జరిగే అవకాశముంది. గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్పత్రితో పాటు అనుబంధంగానున్న అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో నియామకాలు జరుగనున్నాయి. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని