నమో టీకా..సంబరమేగా !
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

నమో టీకా..సంబరమేగా !


జాతీయ స్థాయిలో టీకా కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో బెంగళూరులో భాజపా శ్రేణుల సంబరాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : దేశమంతా వందకోట్ల కరోనా టీకా సంబరాల్లో మునిగితేలుతోన్న వేళ.. కన్నడనాట ఆనందం వెల్లివిరిసింది. కర్ణాటకలో మరో రెండు నెలల వ్యవధిలో లక్ష్య సాధన పరిపూర్ణమవుతుందని సర్కారు ప్రకటించింది. జనవరి నుంచి మొదలైన కరోనా టీకా వితరణ ప్రక్రియలో రాష్ట్రం పాల్గొంది. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.

l రాష్ట్రంలో టీకా వితరణ కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వెల్లడించారు. జనవరి 26 నుంచి పంపిణీ ప్రారంభించినా మార్చి నెలలో కేవలం 20 లక్షల డోసులు మాత్రమే ఇచ్చినట్లు చెప్పారు. ఆపై ప్రతి నెలా లక్ష్యం దిశగా అడుగులు వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబరు నెలలో అత్యధికంగా 1.48 కోట్ల డోసులు ఇవ్వగా.. ఆ నెల 17న ఒకే రోజున 31.75 లక్షల మందికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 17 శాతం మందికి తొలి, 62శాతం మందికి మలి విడత పంపిణీ మిగిలే ఉంది. అదే సమయంలో వివిధ గోదాముల్లో 60 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయి. 52 లక్షల మంది రెండో డోసుకు అర్హత పొందినా.. వెసుకునేందుకు ఆసక్తి చూపలేదని అధికారులు చెప్పారు.

l డిసెంబరులోగా రాష్ట్రంలో 90 శాతం మందికి, 70 శాతం మందికి రెండోది అందిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హుబ్బళ్లిలో వెల్లడించారు. ఈ విషయంలో తాము ఎప్పటికప్పుడు కేంద్రానికి విన్నవించడంతో స్పందన బాగా ఉందన్నారు. అక్టోబరు తొలివారం దిల్లీకి వెళ్లి కనీసం రెండు కోట్ల డోసుల కోసం తాము ప్రతిపాదన చేశామన్నారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి 1.50 కోట్ల యూనిట్లను రాష్ట్రానికి పంపింది. ‘వందకోట్ల భారత సాధన’లో రాష్ట్రం వాటా 6.21 శాతమే. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ మందు కొరత లేనేలేదు. కరోనా తగ్గిందన్న భావనతో కొందరు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మానేశారు. రెండో డోసు వేసుకుంటేనే కొవిడ్‌ నుంచి రక్షణ పొందగలమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

అంతా హాస్యాస్పదం

వందకోట్ల డోసు వేసినట్లు సర్కారు చేసుకుంటున్న సంబరం హాస్యాస్పదమని విపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. 139 కోట్ల మందిలో కేవలం 29 కోట్ల మందికే రెండు కోట్ల డోసులిచ్చి వందకోట్ల సంబరం చేసుకోవటమేమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం 29 కోట్ల మందికి రెండు డోసులు, 42 కోట్ల మందికి తొలిడోసు వేశారని వివరించారు. మరో 68 కోట్ల మంది మాటేమిటని నిలదీశారు. అంతలోనే వందకోట్ల సంబరం ఎందుకని ఏద్దేవా చేశారు. రాష్ట్రంలోనూ ఇంకా 80 శాతం మందికి మలివిడత పంపిణీనే సాగలేదని ఆయన లెక్కతేల్చారు. లక్షలాది మంది కరోనాతో మరణించినా ఆ లెక్కలు దాచిపెట్టిన కేంద్ర, రాష్ట్ర సర్కారులు కరోనా నియంత్రణలో వైఫల్యం చెందినట్లు ఆరోపించారు.

అన్నింటా రికార్డే

రాష్ట్రంలో అక్టోబరు 10 నాటికి 0.06 శాతం డోసులు వృథా అయ్యాయి. వీటిల్లో కొవాగ్జిన్‌ 0.82 శాతంగా నమోదైంది. కొవిషీల్డ్‌ మాత్రం డోసు ప్రమాణమంతా వినియోగించారు. జులై నాటికి ఒక్క డోసు కూడా వృథా కాకపోగా ఆపై క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడించాయి. జిల్లాల వారీగా బాగల్‌కోటెలో 10.83, శాతం కలబురగిలో 3.2 శాతం, ధార్వాడలో 2.62 శాతం, విజయపురలో 2.57 శాతం, బళ్లారి, చిత్రదుర్గల్లో 1.8 శాతం రెండు రకాల డోసులు వృథా అయినట్లు కొవిన్‌ డేటా ద్వారా వెల్లడైంది.

ఇంటి ముంగిటకే బడి

కరోనా కష్టకాలంలో చిన్నారులు బడికి వెళ్లాల్సిన పని లేకుండా కర్ణాటక సర్కారు ఇటీవలే ప్రారంభించిన ‘మొబైల్‌ లర్నింగ్‌ వాహనాలు’ శుక్రవారం సేవలు ప్రారంభించాయి. విధానసౌధ ముంగిట విద్యా శాఖ మంత్రి వాటిని ప్రారంభించడంతో మారుమూల వాడలకు కదలివెళుతున్న దృశ్యం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని