డబ్బులిచ్చాం.. లాటరీ ఏంది?
eenadu telugu news
Updated : 18/09/2021 10:52 IST

డబ్బులిచ్చాం.. లాటరీ ఏంది?

అధికారులతో వాదనకు దిగిన లబ్ధిదారులు

కారేపల్లి, న్యూస్‌టుడే: పేరుపల్లిలో నిర్మించిన 70 రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం రసాభాసగా మారింది. సర్పంచి నాగేశ్వరరావు అధ్యక్షతన తహసీల్దార్‌ పుల్లయ్య గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో వంద మందికి ఇళ్లు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు గతంలో రూ.20 నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశారు. తీరా 70 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వాయిదా పడుతూ వస్తున్న ఎంపిక ప్రక్రియను ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో చేపట్టారు. 120 దరఖాస్తుల నుంచి జల్లెడపట్టి 80 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 70మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని తహసీల్దార్‌ ప్రకటించారు. గతంలో నాయకులు తమ నుంచి నగదు తీసుకున్నారని, లాటరీ లేకుండా ఇస్తామని హామీ ఇచ్చారని పలువురు అభ్యంతరం తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని అధికారి తేల్చిచెప్పడంతో వాదన చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఎస్సీలు సైతం అందరికీ ఇళ్లు ఇవ్వాలని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి మరింత జఠిలంగా మారింది. సీఐ శ్రీనివాసులు, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు సురేశ్‌, స్రవంతిలు జోక్యం చేసుకుని బందోబస్తు నడుమ ప్రక్రియను పూర్తి చేయించారు.


నగదు ఇచ్చినా ఇల్లు ఇవ్వలేదని రోదిస్తున్న సీత

మోసపోయామంటూ రోదనలు: గ్రామసభకు సుమారు 300 మంది వరకు వచ్చారు. వీరిలో డబ్బులు ఇచ్చిన కొందరి పేర్లు లేకపోవడంతోపాటు లాటరీలో సైతం రాకపోవటంతో వాగ్వాదానికి దిగారు. సుజాత, విజయ, కె.సీత, సరోజా తదితరులు తాము మోసపోయామంటూ బోరున విలపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని