కంటి వెలుగు సమీక్ష రసాభాస
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

కంటి వెలుగు సమీక్ష రసాభాస

వైద్యులు, ఆఫ్తాల్మిక్‌ అధికారి మధ్య వాగ్వాదం

సమీక్షలో పాల్గొన్న వైద్యులు, అధికారులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు సర్వజన వైద్యశాలలో గురువారం కంటి వెలుగు పథకంపై జరిగిన సమీక్ష రసాభాసగా మారింది. డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య ఎదురుగానే అధికారి మహేశ్వరరెడ్డి, కంటి వైద్యుల మధ్య మాటల యుధ్ధం జరిగింది. కంటి వెలుగు పథకం జిల్లా సమన్వయకర్త సంధ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమానికి ప్రాంతీయ కంటి వైద్యులు, గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. మొదటగా ప్రాంతీయ కంటి ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంటి ఆసుపత్రికి ఎంతమంది వచ్చినా వెంటనే శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నామని, బాధితులను ఆస్పత్రికి తీసుకురావడంలో జిల్లా సమన్వయకర్త సమన్వయం చేయడం లేదన్నారు. వైద్యులు ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కంటి ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రాజు మాట్లాడుతూ కంటి ఆసుపత్రిలో కంటే ప్రైవేటు వైద్యశాలల్లో కంటి వెలుగు పథకం కింద శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయని, కొందరు ఆఫ్తాల్మిక్‌ సహాయకులు డబ్బులు తీసుకుని రోగులకు ప్రైవేటుకు పంపుతున్నారని ఆరోపించారు. దీనికి ఆఫ్తాల్మిక్‌ అధికారి మహేశ్వరరెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రాంతీయ కంటి ఆసుపత్రికి 12 కేసులు తీసుకొస్తే కేవలం ఇద్దరికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే బాధితులకు హెచ్‌ఐవీతోపాటు వివిధ పరీక్షలు చేసుకురావాలని చెబుతుండటంతో వారు తిరగలేక వెనక్కి వెళ్లిపోతున్నారని చెప్పారు. ఆఫ్తాల్మిక్‌ సహాయకులు డబ్బులు తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పంపుతున్నారనడం సరికాదన్నారు. కంటి వైద్యులు నివేదిత మాట్లాడుతూ అవసరమైన వారికి మాత్రమే పరీక్షలు రాస్తామని, అసలు పరీక్షల గురించి అడిగేందుకు మీరెవరని ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జిల్లా సమన్వయకర్త సంధ్యారెడ్డి, ఆశాలు, ఏఎన్‌ఎంలతో ఆఫ్తాల్మిక్‌ సహాయకులు సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో బాధితులను గుర్తించి కంటి ఆస్పత్రిలో చేర్పించి శస్త్రచికిత్సల సంఖ్య పెంచేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కంటి వెలుగు పథకం కింద ఆదోని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు పద్మకుమార్‌ను ఉత్తమ సర్జన్‌గా, ఉత్తమ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌గా గంగాధర్‌, ఉత్తమ ఎన్‌జీవోగా శాంతిరామ్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఈ సమీక్షలో విశ్వభారతి ఆసుపత్రి నుంచి డా.భరణీకుమార్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా.సుమన్‌ పాల్గొన్నారు.

ఉత్తమ సర్జన్‌గా డాక్టర్‌ పద్మకుమార్‌కు

పురస్కారం అందజేస్తున్న డీఎంహెచ్‌వో


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని