ఇక లెక్కింపే.
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ఇక లెక్కింపే.

తేదీ ఖరారుతో ఏర్పాట్లలో యంత్రాంగం


ఎన్నికల కమిషన్‌కు నివేదిక తయారు చేస్తున్న జడ్పీ సిబ్బంది

ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అగ్ని పరీక్ష మొదలైంది. అదృష్టాన్ని పరీక్షించుకునే వేళయింది. ఎన్నికలకు సంబంధించి ఎదురైన చిక్కుముడులు విడిపోయాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ప్రకారం కౌంటింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమతివ్వగా.. ఎన్నికల సంఘం ఈ నెల 19న ముహూర్తం నిర్ణయించింది. దీంతో దాదాపు ఆరు నెలలుగా జిల్లాలోని పది స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్‌ పెట్టెలను తెరిచేందుకు మార్గం సుగమమైంది. 

నెల్లూరు జడ్పీ, న్యూస్‌టుడే జిల్లా వ్యాప్తంగా 46 మండలాలు ఉండగా- వాటి పరిధిలో గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ప్రకారం 12 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 34 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఇక 554 ఎంపీటీసీ స్థానాలు ఉండగా- 188 ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్‌ ముందే వివిధ కారణాలతో నలుగురు అభ్యర్థులు చనిపోగా.. అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో 362కు మాత్రమే జరిగాయి. వీటికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఓట్లు లెక్కించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో పి.సుశీల పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జడ్పీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. కోర్టు తీర్పు.. ఎన్నికల సంఘం తేదీ ఖరారు చేయడంతో సమర్థంగా ప్రక్రియను నిర్వహించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.
జడ్పీటీసీ బరిలో 140 మంది..
జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సుమారు 330 మంది నామినేషన్లు వేశారు. పరిశీలన అనంతరం 303 మందివి మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అప్పట్లో పలు నాటకీయ పరిణామాల మధ్య కొందరు అభ్యర్థులు పరుగున వచ్చి మరీ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇలాంటి వారు 151 మంది ఉన్నారు. ఇక మిగిలిన స్థానాల్లో 152 మంది మాత్రమే బరిలో నిలవగా- 12 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. చివరగా 34 మండలాలకు 140 మంది మాత్రమే పోటీలో నిలిచారు. 
పార్టీల వారీగా పరిశీలిస్తే...
జడ్పీటీసీ ఎన్నికల బరిలో చివరగా నిలిచిన 140 మంది అభ్యర్థులను పార్టీల వారీగా పరిశీలిస్తే... వైకాపా నుంచి 34 మంది, తెదేపా 28, భాజపా 30, కాంగ్రెస్‌ 23, జనసేన 4, బీఎస్పీ 10, సీపీఎం నుంచి 2, స్వతంత్రులు మరో 9 మంది ఉన్నారు. 336 ఎంపీటీసీ స్థానాల్లో 972 మంది పోటీలో నిలిచారు. 
ఆరుగురు అలా..
జిల్లాలో మొత్తం 554 ఎంపీటీసీ స్థానాలు ఉండగా- 188 ఏకగ్రీవమయ్యాయి. 362 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా 972 మంది బరిలో నిలిచారు. కానీ, వివిధ కారణాలతో పోలింగ్‌కు ముందే నలుగురు, ఏకగ్రీవంగా గెలిచిన వారు ఇద్దరు.. మొత్తంగా ఆరుగురు చనిపోయారు. వీరిలో ఎస్‌.జనార్దన్‌రెడ్డి(కోవూరు గంగవరం), కె.నారాయణ (బాలాయపల్లి వెంగమాంబపురం), కె.కోటయ్య (సైదాపురం అనంత మడుగు) డి.సుబ్బరామయ్య(కోట-2), పి.సుబ్బమ్మ (జలదంకి-2), కె.జయరామయ్య(పెళ్లకూరు శిరసనంబేడు) ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి తీసుకున్న తర్వాత.. ఈ స్థానాల్లో తిరిగి ఎన్నికల ప్రక్రియ చేపడతామని జడ్పీ అధికారులు తెలిపారు. 
ఏకగ్రీవమైన జడ్పీటీసీ స్థానాలు 
జలదంకి, ఓజిలి, నెల్లూరు గ్రామీణం, బుచ్చిరెడ్డిపాలెం, రాపూరు, అల్లూరు, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ,సీతారామపురం   
పది కేంద్రాల్లో..
- పి.సుశీల, జడ్పీ సీఈవో
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపునకు సన్నద్ధమవుతున్నాం. కలెక్టర్‌ సూచనల మేరకు ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించాం. జిల్లాలో మొత్తం పది కేంద్రాల్లో లెక్కింపునకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలిస్తున్నాం. 


ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా సామగ్రి 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని