పట్టించుకోరా.. పరిష్కరించరా!
eenadu telugu news
Published : 28/09/2021 05:36 IST

పట్టించుకోరా.. పరిష్కరించరా!

 

సమస్యలను ప్రస్తావిస్తున్న కౌన్సిలర్లు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ‘మురుగు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోతుంటే, కార్మికులు ఎలా శుభ్రం చేయగలరు? చినుకుపడితే మురుగంతా రహదారులపై ప్రవహిస్తోంది... వ్యాధులు ప్రభలుతున్నాయి.. దీనికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? పట్టణ వ్యాప్తంగా కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉంది.. జననివాసాల నడుమే పందులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి? వాటిని తొలగించరా? 8వ వార్డు సచివాలయంలో సాంకేతిక సమస్యల కారణంగా ధృవపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు సక్రమంగా సాగడం లేదని మరి పరిష్కారమేంటి? ఒకే అంశాన్ని అజెండాలో పదే పదే పెడుతున్నారు.. మరి దీన్ని ఎప్పటికి పూర్తిచేస్తారు?’


సమావేశంలో మాట్లాడుతున్న పురాధ్యక్షురాలు రాజలక్ష్మి, కమిషనరు రామలక్ష్మి

వార్డు కౌన్సిలర్లు బి.జగన్నాథరెడ్డి, పి.మధుమూర్తి, లీలారాణి, ఎల్‌.స్వర్ణమణి తదితరులు కురిపించిన ప్రశ్నలివి.. సోమవారం పురాధ్యక్షురాలు పి.రాజలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఇది కన్పించింది. మారుమూల బడ్డీకొట్టు పెట్టినా ఒప్పుకోని అధికారులు, ప్రధాన మార్గాలలో జనానికి ఇబ్బంది పెట్టే పక్కా నిర్మాణాల ఆక్రమణలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఓ కౌన్సిలర్‌ ప్రశ్నించారు. ఉపాధ్యాయ బదిలీ అంశాలను కొందరు సభ్యులు వ్యతిరేకించారు. 15వ ఆర్థికసంఘ ట్రైడ్‌ నిధులు రూ.20 లక్షలతో బాహుదాలోని ఊటబావి నుంచి సంతపేట సంప్‌హౌస్‌ వరకూ మంచినీటి పథకం గొట్టం మార్పు అంశంపై ఉపాధ్యక్షురాలు స్వర్ణమణి అసహనం వ్యక్తం చేశారు. ఇది మూడోసారి అజెండాలో చేర్చారని, పదేపదే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పట్టణ మధ్యదీపాల స్తంభాలకు ఉన్న వేరే తీగలు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని సరిచేయించాలని కో ఆప్షన్‌ సభ్యులు పత్తి విజయ్‌కుమార్‌ కోరారు. కమిషనరు ఎల్‌.రామలక్ష్మి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని