ఏమైంది?
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

ఏమైంది?

అనుమానాస్పద స్థితిలో తాతామనుమళ్ల మృతి

కమ్ముల నంబూద్రిపాల్‌,

అలుగులగూడెం (దెందులూరు), న్యూస్‌టుడే: దెందులూరు మండలం అలుగులగూడెంలో తాతా మనువళ్ల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈఘటనకు సంబంధించి మృతుల బంధువులు, గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కమ్ముల నంబూద్రిపాల్‌(64), కమ్ముల అద్విక్‌(5) తాతా మనవళ్లు. నంబూద్రిపాల్‌ రెండో కుమారుడు మోహన్‌ దంపతులకు కుమారుడు అద్విక్‌, కుమార్తె అగస్సీ ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇంటి బయట పడుకున్న నంబూద్రిపాల్‌ కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో భార్య నీరు ఇచ్చి సపర్యలు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో పెద్ద కుమారుడు రవికుమార్‌ని పిలిచింది. అదే సమయంలో మరో గదిలో ఉన్న అద్విక్‌ కూడా కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆటోలో దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మార్గం మధ్యలో అద్విక్‌ నోటి వెంట నురగలు వచ్చాయి. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నంబూద్రిపాల్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఎన్ని ఆస్పత్రులు తిప్పినా.. అద్విక్‌కు ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడానికి పలు ఆసుపత్రులకు తిప్పారు. ఎక్కడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అద్విక్‌ మృతి చెందినట్లు చెప్పారు. మృతులు ఇద్దరినీ ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత మోహన్‌ భార్య ఝాన్సీ ఇంటి ఆవరణలో తాచుపామును చూడటంతో పాము కాటు వల్ల ఇద్దరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం అద్విక్‌ కదులుతున్నాడని తిరిగి దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డాక్టరు మాలిని, డాక్టరు రాంబాబు చనిపోయినట్లు తెలిపారు. ఒకే ఇంటిలో ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతదేహాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు.

అద్విక్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని