ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి


సమీక్షలో మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి మోతీలాల్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు. పీఏసీఎస్‌, ఐకేపీ, డీసీఎంఎస్‌ మార్కెటింగ్‌ శాఖల ద్వారా 192 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సారి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని తెలిపారు. వచ్చే నెల 15 నుంచి కొనుగోలును ప్రారంభించి 70 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం సరఫరా కాకుండా రెవెన్యూ, పోలీసు, వ్యవసాయాధికారులు చెక్‌పోస్టుల వద్ద కట్టడి చేయాలని ఆదేశించారు. విక్రయించిన ధాన్యానికి 24 గంటల లోపు రైతులకు చెల్లింపులు జరిగే విధంగా చూడాలని, రైతుల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా నంబరు వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. మద్దతు ధర ప్రకారం మేలు రకానికి క్వింటాకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చెల్లిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, డీసీఎస్‌ఓ రాజేశ్వర్‌, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, డీఎం విమల, డీసీఓ సుజాత, అదనపు డీఆర్‌డీవో నర్సిములు, డీసీఎంఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఛైర్మన్‌ కృష్ణారెడ్డి, తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ తెలిపారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర విద్యాధికారులు దృశ్య మాధ్యమం ద్వారా ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో చేపట్టిన కార్యాచరణను వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలున్నాయని 9,239 మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్నారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని