close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

గుప్త నిధుల కోసమే దారుణహత్య?

అడవిలో ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు (దాచిన చిత్రం)

శిరువెళ్ల, ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: నంద్యాల- ఒంగోలు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలో జాకీర్‌బాషా ఈనెల 12న విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. గుప్తనిధుల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ మండల పరిధిలోని కొందరు యువకులతోపాటు, రుద్రవరం మండలానికి చెందినవారు ఓ పథకం ప్రకారమే హత్యకు గురైన యువకునితో గత కొంతకాలంగా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఆ చనువుతో తమ స్థావరానికి పిలిపించుకుని పూజల అనంతరం హత్య చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు ఐదుగురిని ఓ పోలీస్‌స్టేషన్‌లో రహస్యంగా విచారిస్తున్నారు.

నిందితులు సంచరించారా..?

మృతుని ఆచూకీ వివరాలు బహిర్గతమవడంతో ఈ సమాచారం తెలుసుకున్న నిందితులు పోలీసులు నల్లమలలో శవపరీక్ష నిర్వహించే సమయంలో అక్కడే సంచరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలకు ఎట్టకేలకు యువకుని మృతికి గల కారకులను తెలుసుకున్నట్లు సమాచారం. క్షుద్ర పూజలు చేశారా లేక గుప్తనిధుల తవ్వకంలో భాగంగానే హత్య చేశారా అన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. నిధి సమాచారం హతుడికి కూడా తెలిసినట్లు, అతడు కూడా నిధిని చేజిక్కించుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతుడు చరవాణి వాడని కారణంతో కేసు ఛేదన ముందు కొంతమేర ఆలస్యమైనప్పటికీ ఆళ్లగడ్డ, నరసాపురం, రుద్రవరం, గాజులపల్లె మెట్ట తదితర ప్రాంతాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయిన పలు దృశ్యాల ఆధారంగా పొలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టడంతో మృతిపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేస్తున్నారు. దీనిపై డీఎస్పీ తిప్పేస్వామి మాట్లాడుతూ ఈ హత్య విషయంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ప్రస్తుతం బయటకు వస్తున్న విషయాలన్నీ పుకార్లే అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.