close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

చిన్న పిల్లలే ఆమె లక్ష్యం! 

ఏమార్చి నగలు దోచుకుంటున్న మహిళ అరెస్టు 
25 కేసుల్లో నిందితురాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: మెడలో బంగారు గొలుసు... చెవులకు లోలాకులు.. కాళ్లకు పట్టీలు.. ఆమెను ఎవరైనా చూస్తే మంచి స్థితిమంతురాలు అనుకుంటారు.. కానీ ఆమె చేసే పనేంటో తెలుసా? ఇళ్ల ఎదుట, నిర్మానుష్య ప్రాంతాల్లో ఆడుకుంటున్న చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని వారి ఒంటిపై ఉండే ఆభరణాలను తస్కరించడం! ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళా దొంగను మలక్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి సుమారు రూ.2.35 లక్షల విలువ చేసే 57.6 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం నగర పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రముక్కపల్లి గ్రామానికి చెందిన యెగ్నం అనూరాధ (30) ప్రస్తుతం గుంటూరు నగరం రైల్‌పేట్‌లో నివసిస్తోంది. ఆమె హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మలక్‌పేట్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌, జూబ్లిహిల్స్‌ ఠాణాల పరిధిలో 8 దొంగతనాలు చేసి 23 గ్రాముల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో 14 దొంగతనాలు చేసి 34 గ్రాముల బంగారం, 270 గ్రాముల వెండి వస్తువులు ఎత్తుకెళ్లింది. సైబరాబాద్‌ పరిధిలోని సనత్‌నగర్‌లో మూడు నేరాల్లో అయిదు గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి వస్తువులు.. ఇలా మొత్తం 25 కేసుల్లో 62 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి వస్తువుల్ని దోచుకెళ్లిందని కమిషనర్‌ వివరించారు. 
చాక్లెట్లు ఎరగా వేసి... 
బంగారు, వెండి ఆభరణాలు ధరించి ఇళ్లముందు, క్రీడామైదానాలు, నిర్మానుష్య ప్రాంతాలు, పాఠశాలలు, ఉద్యానాలు వంటి ప్రాంతాల్లో ఆడుకునే పిల్లలను అనూరాధ లక్ష్యంగా చేసుకునేది. వారితో పరిచయం పెంచుకొని, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు ఇతర ఆట వస్తువులను ఎరగా వేస్తుంది. పిల్లల్ని ఎవరూ చూడని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తెర (కటర్‌)తో ఆ పిల్లల బంగారు, వెండి ఆభరణాలను కోసి.. అపహరిస్తుంది. గత కొంత కాలంగా బాధిత తల్లిదండ్రులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పోలీసు ఠాణాలను ఆశ్రయించి ఫిర్యాదులు ఇచ్చారు. దీనిపై అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో మలక్‌పేట్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కె.వి.సుబ్బారావు, డీఐ డి.నానునాయక్‌, డీఎస్సై ఎన్‌.శివశంకర్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
ఎలా పట్టుకున్నారంటే.. 
పిల్లల ఒంటిపై ఉన్న నగలు పోతున్నాయని ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దొరికిన ఆధారాలతో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. ఎట్టకేలకు బుధవారం కర్మన్‌ఘాట్‌లోని నందనవనం కాలనీలో అనూరాధ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా తాను చేసిన చోరీల చిట్టాను విప్పింది. ఆమె దోచుకున్న 62 గ్రాముల బంగారంలో 57.6 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. వెండి 681 గ్రాములు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా వదలకుండా, తమ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.